కొలంబోలో టీమ్‌ ఇండియా

Team India in Colombo– శ్రీలంక చేరుకున్న భారత క్రికెటర్లు
కొలంబో: భారత క్రికెట్‌ జట్టు శ్రీలంకకు చేరుకుంది. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు కొత్త చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ శిక్షణ సారథ్యంలో టీమ్‌ ఇండియాకు కొలంబోలో అడుగుపెట్టింది. జులై 27న తొలి టీ20తో శ్రీలంక పర్యటన షురూ కానుండగా.. ఆ తర్వాత వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది. వన్డే జట్టులో మాత్రమే ఆడుతున్న క్రికెటర్లు మినహా టీమ్‌ ఇండియాలోని ఆటగాళ్లు అందరూ కొలంబోకు చేరుకున్నారు. ఓ రోజు విశ్రాంతి అనంతరం భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేయనున్నారు. ఇక చీఫ్‌ కోచ్‌గా గౌతం గంభీర్‌ శ్రీలంక పర్యటనలో తొలి సవాల్‌ ఎదుర్కొన్నాడు. భారత్‌ టీ20 ప్రపంచకప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రన్నరప్‌గా కొనసాగుతున్న భారత జట్టు పగ్గాలు చేపట్టిన గంభీర్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చీఫ్‌ కోచ్‌గా ఆటగాళ్లకు స్వేచ్ఛ, నమ్మకం ఇవ్వటానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని గంభీర్‌ వెల్లడించాడు. ‘ఉత్తమ బంధం నమ్మకంపైనే ఏర్పడుతుంది. ఆటగాళ్లకు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది’ అని గంభీర్‌ తెలిపాడు.