టీమ్‌ ఇండియా తీన్‌మార్‌

Team India Tinmar– ఆసియా టీటీలో వరుసగా మూడో కాంస్యం
న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌ మెన్స్‌ జట్టు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో హ్యాట్రిక్‌ పతకాలు సాధించింది. వరుసగా మూడోసారి కాంస్య పతకం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మెన్స్‌ సెమీఫైన్లో అగ్రజట్టు చైనా చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. అచంట శరత్‌ కమల్‌, మానవ్‌ ఠాకర్‌, హర్మీత్‌ దేశారులు తమకంటే మెరుగైన ర్యాంకర్ల చేతిలో పరాజయం పాలయ్యారు. చైనాతో సెమీస్‌ సమరంలో పరాజయం పాలైనా.. టీమ్‌ ఇండియా పతకం ఖాయం చేసుకుంది. సెమీస్‌కు చేరుకుని కనీసం కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇది ఓవరాల్‌గా ఏడో పతకం. భారత మహిళల జట్టు తొలిసారి ఆసియా పోటీల్లో కాంస్య పతకం సాధించి చరిత్ర సష్టించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ నం.11 యున్‌ జు చేతిలో శరత్‌ కమల్‌ 7-11, 10-12, 9-11తో ఓటమి చెందగా..వరల్డ్‌ నం.22 చేతిలో మానవ్‌ 9-11, 11-8, 3-11, 11-13తో పోరాడి ఓడాడు. దేశారు 6-11, 7-11, 7-11తో వరల్డ్‌ నం.70 హుయాంగ్‌ చేతిలో ఓటమి చెందాడు. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన టేబుల్‌ టెన్నిస్‌.. అదే జోరు ఆసియా క్రీడల్లో చూపించకపోవటం గమనార్హం. 2018 ఆసియా క్రీడల్లో మాత్రమే భారత టేబుల్‌ టెన్నిస్‌ పతకం సాధించగలిగింది.