నవతెలంగాణ-కాగజ్‌నగర్ రూరల్
మేడం మమ్మల్ని విడిచి పోవద్దు… మీరే మాకు ఎప్పుడూ పాఠాలు చెప్పాలె.. మీరు లేకపోతే మేము బడికా రాం అంటూ ఆరెగూడ ప్రాథమిక పాఠశాలు విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆరెగూడ పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు మానస, స్వరూపారాణి, అనూషలను శనివారం పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు మానస 12 ఏళ్లుగా విద్యాబోధనలో తనదైన శైలిలో విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా ఇతర రంగాల్లోనూ రాణించేలా క్రీడాపరికరాలు అందజేసి తన ఔన్నత్యాన్ని చాటుకుందని తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయులు, మరెందరికో ఆదర్శప్రాయులని కొనియాడారు. పాఠాలు బోధించడమే కాకుండా చిత్రలేఖనంలోనూ విద్యార్థులు ప్రతిభ సాధించేలా తన పాత్రను పోషించిందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను వస్త్రాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. భాజాభజంత్రీలతో ఘన వీడ్కోలు పలకగా విద్యార్థులంతా ఉపాధ్యాయురాలు మానస చెంతన చేరి తమ పాఠశాలను, తమను వదిలి వెళ్లొదంటూ కంటతడి పెట్టారు. విద్యార్థుల ఆప్యాయతకు ఉద్వేగానికి లోనైన మానస తాను సైతం కంటతడి పెడుతూ వీడ్కోలంటూ పాఠశాలను వదిలి వెళ్లింది. ఇందులో పాఠశాల హెచ్‌ఎం పర్శ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.