– అమలులో క్షేత్రస్థాయి ఇబ్బందులు
– రకరకాల కారణాలు చూపుతున్న బ్యాంకర్లు
– మొండి ఖాతాలకే మొదటి ప్రాధాన్యత
– నత్తనడకన సాగుతున్న’రుణమాఫీ’
పంటరుణాల మాఫీ పథకం అమలుకు ‘సాంకేతిక’ సాకు ఎదురవుతోంది. ప్రభుత్వం చెబుతున్న దానికి భిన్నమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో నెలకొన్నాయి. వివిధ రకాల సాంకేతిక కారణాలను చూపుతూ బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. బకాయిదారులను తగ్గించుకునే ఉద్దేశంతో ఎప్పటికప్పుడూ రెన్యూవల్ చేయించుకున్న రైతులకంటే కూడా డిఫాల్టర్ల (ఎగవేతదారులు)కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
2018 నవంబర్ 11కు ముందు క్రాప్‌లోన్ తీసుకున్న ఒక్కో కుటుంబానికి రూ.లక్షలోపు పంట రుణం మాఫీ చేస్తామన్న ప్రభుత్వం.. మొదటి నుంచి ఈ స్కీంపై చిత్తశుద్ధి చూపించలేదు. తొలి విడత 25వేలను మాత్రమే అందరికీ మాఫీ చేసిన సర్కారు.. రెండో విడత 40 నుంచి 50శాతం మంది రైతులకు రూ.50వేల వరకు మాఫీ చేసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో మూడో విడత ప్రక్రియలో రూ.లక్షలోపు రుణమాఫీకి ప్రభుత్వం హడావుడి చేస్తున్నా క్షేత్రస్థాయిలో బ్యాంకర్ల వైపు నుంచి రైతులకు సహకారం లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సాంకేతిక కారణాలు ఇలా..
సాంకేతిక పరమైన చిక్కులతో రుణమాఫీ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరట్లేదు. కొందరికి క్లోజ్ అయిన అకౌంట్లో డబ్బులు జమై నిధులు తిరిగి వెళ్తుండగా ఇంకొందరికి డబ్బులొచ్చినట్టు మెసేజ్‌లు వచ్చినా ఖాతాల్లో మాత్రం జమ కావట్లేదు. కొందరికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాల్లో బకాయిలున్నాయని, మరికొందరివి ఫ్రీజ్ అయ్యాయని బ్యాంకర్లు అనేక కారణాలు చెబుతున్నారు. రుణమాఫీ డబ్బులు వేరే బకాయి కింద జమ చేసుకోవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోవట్లేదు.
బ్యాంకర్లు పాతబకాయిల కింద రుణమాఫీ డబ్బులు జమ చేసుకుని మిగిలితే ఇస్తున్నారు. 2018 నవంబర్ 11 నాటికి రూ.లక్ష లోపు రుణం ఉన్నా కొందరికి మాఫీ అమలు కావట్లేదు. కొందరికి రూ.లక్షలోపు రుణం జమైనట్టు సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు రావడంతో బ్యాంకులకు వెళ్తే పాత బకాయి కింద జమ చేసుకున్నట్టు బ్యాంకర్లు సమాధానం ఇస్తున్నారు.
బ్యాంకర్ల నుంచి రకరకాల కొర్రీలు
నిర్వహణ చార్జీలు, వడ్డీలు, ఇతర బ్యాంకుల్లో బకాయిలు.. ఇలా అనేక కారణాలు చెప్పి రుణమాఫీ డబ్బులను బకాయిల కింద జమ చేసుకుంటున్నారు. బ్యాంకుల విలీనంతో కొందరి ఖాతా నంబర్లు మారాయి. పాత అకౌంట్ స్థానంలో కొత్త ఖాతా తెరిస్తే డబ్బులు పడటం లేదు.పాత ఖాతాలో పడినట్టు మెసేజ్ వచ్చినా బ్యాంకుకు వెళ్లి చూస్తే డబ్బులు ఉండటం లేదు. ఒకే కుటుంబానికి చెందిన రైతులు రూ.లక్ష కంటే ఎక్కువ రుణం తీసుకున్నా లక్ష వరకు మాఫీ చేయాలనే నిబంధన ఉన్నా బ్యాంకర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ కారణం చేత డబ్బులు పడలేదో అర్థం కాని స్థితిలో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికీ వేలాదిగా రైతుల ఖాతాలున్న బ్యాంకుల్లోనూ వందలోపు మందికి కూడా రుణమాఫీ కాలేదంటే అతిశయోక్తి కాదు.
మంత్రి మాటలూ పెడచెవిన..
రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాటలను సైతం పెడచెవిన పెడుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలుంటే మాఫీ సొమ్మును అన్ని ఖాతాల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించినా అమలు కావట్లేదు.
పంట రుణం మొత్తం చెల్లించిన రైతుకు నేరుగా డబ్బులివ్వాలని ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అందించిన డబ్బును ఏదో ఒక రూపంలో తమ దగ్గరే అట్టిపెట్టుకోవాలనే ఉద్దేశమే బ్యాంకర్లలో కనిపిస్తోందనే ఆరోపణలున్నాయి.
‘మాఫీ’ గందరగోళం..
ఖమ్మం జిల్లాలో మూడో విడత 53,222 మంది రైతులకు రూ.297.2కోట్ల రుణాలు మాఫీ అయినట్టు మంత్రి పువ్వాడ అజరుకుమార్ చెప్పారు. పంట రుణ మాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఐడీవోసీలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో అధికారపక్షం నేతలే అనేక మంది రుణమాఫీ అందలేదనే అంశాన్ని ప్రస్తావించారు. పాస్‌బుక్ లేని రైతుల సమస్యను పరిష్కరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. బ్యాంకర్లు ఏ రైతుకు పంట రుణమాఫీ చేశారో జాబితా కలెక్టర్‌తోపాటు వ్యవసాయ శాఖకు ఇవ్వాలన్నారు.
మాఫీ ఎవరికి అయ్యిందో.. ఎవరికి కాలేదో.. ఇంకా ఎంతమందికి కావాలో తెలియని గందరగోళ స్థితి కనిపిస్తోంది. రైతుబంధు ఖాతాలు, ఆధార్ నంబర్ల ఆధారంగా బ్యాంకర్ల సహకారంతో రుణమాఫీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ చెబుతున్నా ఆచరణలో మాత్రం అది ముందుపడటం లేదనే విమర్శలు ఉన్నాయి.