తీస్తా బెయిల్‌.. విస్తృత ధర్మాసనానికి ఇద్దరు జడ్జీల భిన్నాభిప్రాయంతో సుప్రీం నిర్ణయం

– అంతకుముందు తక్షణమే లొంగిపోవాలన్న గుజరాత్‌ హైకోర్టు
– సర్వోన్నత న్యాయస్థానంలో సెతల్వాద్‌ సవాల్‌
న్యూఢిల్లీ / అహ్మదాబాద్‌ : ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ బెయిల్‌ కోసం చేసుకున్న అప్పీలుపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై శనివారం విచారణ చేపట్టిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్య భిన్నాప్రాయాలు రావడంతో విస్తృత ధర్మాసనం ముందు విచారణకు ఉంచాల్సిందిగా కోరుతూ భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌కు ప్రతిపాదించారు. 2002 గుజరాత్‌ మారణహోమానికి సంబంధించిన కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను శనివారం ఉదయం విచారణ చేపట్టిన గుజరాత్‌ హైకోర్టు ఆమె విజ్ఞాపనను తిరస్కరించింది. తక్షణమే లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సెతల్వాద్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సెతల్వాద్‌ పిటిషన్‌పై జస్టిస్‌ అభరు ఎస్‌ ఒకా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ధర్మాసనంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో తీస్తా విజ్ఞప్తిని విస్తృత ధర్మాసనానికి ప్రతిపాదించారు. ‘తీస్తా సెతల్వాద్‌కు మధ్యంతర ఉపశమనం కల్పించే విషయంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అందువల్ల ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి పంపాల్సిందిగా ప్రధానన్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని జస్టిస్‌ ఎఎస్‌ ఒకా, జస్టిస్‌ పికె మిశ్రా ధర్మాసనం ప్రకటించింది.
కాగా తీస్తా బెయిల్‌ పిటిషన్‌పై శనివారం ఉదయం విచారణ చేపట్టిన గుజరాత్‌ హైకోర్టు ధర్మాసనం కుఠువుగా వ్యవహరించినట్లు కనిపించింది. తక్షణమే లొంగిపోవాలంటూ ఇచ్చిన ఆదేశాల అమలును వాయిదా వేయాలని తీస్తా న్యాయవాది మిహిర్‌ ఠాకూర్‌ విన్నవించినా ధర్మాసనం అందుకు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు వీలుగా తీర్పు అమలును 30 రోజుల పాటు వాయిదా వేయాలంటూ మిహిర్‌ అభ్యర్థిం చారు. ఇందుకు న్యాయస్థానం ససేమిరా అంటూ ఆ విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో తీస్తాకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాత్కాలిక బెయిల్‌పై ఉన్న నిందితురాలు వెంటనే లొంగిపోవాలని గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిర్జాన్‌ ఆదేశించారు. గుజరాత్‌ అల్లర్ల కేసుల్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహా అమాయకులైన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను, బీజేపీ నేతలను ఇరికించేందుకు తీస్తా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కుట్ర పన్నారంటూ అహ్మదాబాద్‌ నేర పరిశోధన విభాగం ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీనిపై తీస్తాను గత సంవత్సరం జూన్‌ 25న అరెస్ట్‌ చేశారు. ఏడు రోజుల పాటు పోలీస్‌ రిమాండ్‌లో ఉన్న అనంతరం తీస్తాను జూలై 2న జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. గుజరాత్‌ అల్లర్ల ఘటనలకు సంబంధించి నరేంద్ర మోడీ, మరికొందరికి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జకియా జఫ్రీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన మర్నాడే ఈ కేసులో సహ నిందితుడైన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌ను కూడా అరెస్ట్‌ చేశారు.