
– రెడ్డి సంఘ భవనానికి స్థలం కేటాయింపుపై తలెత్తిన వివాదం
నవతెలంగాణ-బెజ్జంకి :
గూడెం గ్రామంలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు స్థలం కొరత ఏర్పడడంతో గ్రామంలోని 321 సర్వే నంబర్ యందు ప్రభుత్వ భూమిలో పలువురు గ్రామస్తులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు జనవరి 5,2023న తొలగించి సుమారు 7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. పల్లే ప్రకృతి వనం, బృహత్ పల్లే ప్రకృతి వనం, వ్యాయామ కేంద్రం, వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణా పనులకు ప్రభుత్వ భూమి అందుబాటులోకి రావడంతో బుధవారం తహాసిల్దార్ వెంకట్ రెడ్డి, ఎంపీడీఓ రాము గ్రామాన్ని సందర్శించి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిని పరిశీలించి హద్దులు నిర్ణయించారు. గ్రామంలోని కుల సంఘాల భవనాలకు స్థలం కేటాయింపులో సమస్య ఉత్పన్నమవ్వడంతో పరిష్కరించేల చర్యలు చేపట్టునున్నట్టు తహసిల్దార్ వెంకట్ రెడ్డి తెలిపారు.
రెడ్డి సంఘ భవన స్థలంపై తలెత్తిన వివాదం..
గ్రామంలో రెడ్డి సంఘం రెండు వర్గాలుగా విడిపోవడంతో ఇద్దరు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇరువురు అధ్యక్షులు ప్రభుత్వ భూమిలో రెండు రెడ్డి సంఘ భవనాలకు స్థలం కేటాయించాలని వివాదం తలెత్తింది. ఇరువురి రెడ్డి సంఘం అధ్యక్షుల వాదనలను లిఖిత పూర్వకంగా సేకరించి పై అధికారుల ఆదేశాల మేరకు స్థలం నిర్ణయిస్తామని తహసిల్దార్ తెలిపారు.
గృహాలున్నోళ్లకే గృహాలక్ష్మి..!
అధికారుల వద్ద మొరపెట్టుకున్న మహిళలు
అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి గృహాలున్నోళ్లకే లబ్ధిదారులుగా ఎంపికచేసీ గృహాలక్ష్మి మంజూరీ పత్రాలు అందజేశారని పలువురు గ్రామ మహిళలు ఎంపీడీఓ రాము,తహసిల్దార్ వెంకట్ రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. గృహాలక్ష్మి పథకానికి గ్రామంలోని ప్రజలు సమర్పించిన దరఖాస్తుల అధారంగా ప్రత్యేక అధికారుల బృందం విచారణ జరిపి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని..విడతల వారిగా ప్రభుత్వం గృహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని సంయమనం పాటించాలని ఎంపీడీఓ రాము మహిళలకు సూచించారు.గృహాలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో అధికారులు ఇండ్లున్నోళ్లకే మళ్లీ ఇండ్లు మంజూరీ చేశారని వితంతువులైన మహిళలను,గుడిసెలో నివసిస్తున్న వారిని విస్మరించారని అవేదన వ్యక్తం చేయగా తహసిల్లార్ వెంకట్ రెడ్డి మరోసారి దరఖాస్తుల వివరాలందజేయండి ప్రభుత్వానికి నివేదిస్తామని సూచించారు. తహాసిల్దార్ సూచనతో మహిళలు తమ వివరాలను లిఖిత పూర్వకంగా అందజేశారు.గృహాలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో విచారణ బృందం అధికారులు అవకతవకలకు అస్కారమిచ్చి లబ్ధిదారులను ఎంపిక చేశారని వదంతులు గ్రామంలో వెల్లువెత్తడంతో జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి విచారణ చేపట్టి ఆర్హులకు న్యాయం చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.