– కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి విఘాతం
– 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబ సభ్యులే
– మోడీ గ్యారంటీ అంటే..నెరవేర్చడమే..
– గెలిపిస్తే..మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా : పటేల్‌గూడ బహిరంగ సభలో ప్రధాని మోడీ
– బీఆర్‌ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. తాను గ్యారంటీ ఇచ్చారంటే అది కచ్చితంగా నెరవేరుతుందని చెప్పారు. మరోమారు ఆశీర్వదించి తనను ప్రధానిగా చేస్తే ప్రపంచంలోనే భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో పలు అభివృద్ధి పనులు, ఘట్‌కేసర్ – శేరిలింగంపల్లి ఎమ్‌ఎమ్‌టీఎస్ రైలు, పలు రహదారుల ప్రారంభోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. తెలంగాణకు బీజేపీ రుణపడి ఉంది’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ప్రాంతీయ పార్టీల కుటుంబాలు బాగుపడ్డాయనీ, ప్రతిభ ఉన్న నాయకులను ఆ పార్టీలు ఎదుగనివ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల కుటుంబవాదం ప్రజాస్వామ్యానికి విఘాతం అని హెచ్చరించారు. కుటుంబ వాదులకు దోపీడీ చేసే లైసెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. కుటుంబవాదాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కొంత మంది తనకు కుటుంబమే లేదని చెప్పడాన్ని తప్పుబట్టారు. తనపై విమర్శలు చేస్తున్నవారికి వారి కుటుంబాలు ముఖ్యమైతే తనకు దేశంలోని ప్రతి కుటుంబమూ ముఖ్యమేనని చెప్పారు. కొందరు నాయకులు బహుమతులు తీసుకుని ఖజానా నింపుకుంటున్నారనీ, నల్లధనాన్ని దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారని విమర్శించారు. అలాంటి వారి దొంగసొత్తును కక్కిస్తామని అని అన్నారు. అలా అన్నందుకే తనకు కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారన్నారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులూ తన ప్రజలేననీ, దేశంలోని ప్రతి చెల్లీ, ప్రతి తల్లీ తన కుటుంబ సభ్యురాలేనని చెప్పారు. ఇది ఇండియా కూటమికి అర్థం కావడం లేదన్నారు. వాళ్లు తమ కుటుంబాలకు విలాసవంతమైన ఇండ్లను కట్టిస్తే తాను ప్రధాని అయ్యాక నాలు కోట్ల ఇండ్లను పేదలకు కట్టించానని తెలిపారు. వాళ్లలాగా ప్రజలు తలదించుకునే పనులను తాను చేయబోనని నొక్కి చెప్పారు. దళితుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టామన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశామనీ, దానిపై కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతున్నదనీ, ప్రజల ఆశీర్వదాన్ని వృథా కానివ్వబోనని హామీనిచ్చారు. తెలుగు ప్రజలు ప్రపంచంలోని పలు దేశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారనీ, ఇది చాలా గర్వకారణంగా ఉందని చెప్పారు. మోడీ ఏదైతే చెబుతాడో అదే చేస్తాడన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 370 ఆర్టికల్ రద్దు చేశామనీ, అయోధ్యలో రామమందిరాన్ని కట్టించామని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు అబద్ధాలు చెప్పడం, దోచుకోవడమే తెలుసునన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైలును మూసేసిందని విమర్శించారు. ‘తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలి..బీజేపీకి ఓటువేయాలి..దేశ భవిష్యత్తు కోసం 400 సీట్లలో గెలిపించాలి’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ముగించారు.
రియల్టర్ల నుంచి రాహుల్‌గాంధీ ట్యాక్స్ వసూలు : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు రియల్టర్లు, వ్యాపార వేత్తల నుంచి రాహుల్‌గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పదేండ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మార్చేమీ రాలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కుటుంబ, అవినీతి పార్టీలనీ, వాటికి ఏఐఎం తోడైందని ఆరోపించారు. తెలంగాణ మార్పు రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మోడీ గ్యారంటీ ఇస్తారంటే కచ్చితంగా నెరవేరుతుందన్నారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 17 సీట్లలోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.గ్రామాలు, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందనే విజన్‌తో ప్రధాని మోడీ వెళ్తున్నారని చెప్పారు. ఈ సభలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ఎల్పీ నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి, ఉపనేత వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బీజేపీ నేతలు రఘునందన్‌రావు, బంగారు శృతి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.