తెలంగాణకు ద్రోహం-బడా బాబులకు భోజ్యం

– కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల మహా ధర్నా ను జయప్రదం చేద్దాం 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల మహా ధర్నా ను జయప్రదం చేద్దాం అని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్ లు మాట్లాడుతూ.. 2025 ఫిబ్రవరి 10, ఉ.10 గంటలకు, ఇందిరాపార్కు, హైదరాబాద్ మహాధర్నను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను చట్టబద్ధం చేసే ఎంఎస్పి చట్టం తెచ్చేది లేదని, అందుకవసరమైన నిధులు కేటాయించబోమని ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ స్పష్టం చేసింది. రైతన్నలను మార్కెట్ శక్తుల దోపిడీకి వదిలేసింది. ఎరువుల సబ్సిడీలో కోత పెట్టి ధరల పెరుగుదలకు కారణమయింది. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి రుణ విమోచన చట్టం ప్రకటించలేదు. రుణ మాఫీ మాటే ఎత్తలేదు. రెండు లక్షల కోట్లు కేటాయించాల్సిన గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేవలం 86వేల కోట్లు కేటాయించింది. ఇవి సరిపోవు. రెడు లక్షల కోట్లు కేటాయించాలి. భారతీయ బీమా రంగంలో 100శాతం ఎఫ్ఐ ప్రకటించి విదేశీ కార్పొరేట్ల చేతుల్లోకి పెట్టేందుకు సిద్ధమైంది. దేశ ప్రజల పొదుపుని స్వాహా చేసేందుకు విదేశీ కంపెనీలకు అప్పగించడం దేశభక్తి కాదు విదేశీ భక్తి. విద్యుత్తు రంగాన్ని కూడా ప్రైవేటీకరించాలని ప్రతిపాదించారు. ఈ చర్యలు దేశ అభివృద్ధికి ఆటంకమే కాకుండా సాధారణ ప్రజల జీవితాల మీద మోయలేని భారంగా తయారవుతాయి. కార్మికుల కనీస వేతనాల పెంపుదలకు గానీ, ఇతర శ్రామిక ప్రజల ఆదాయాల మెరుగుదలకు గానీ ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు లేవు. పైగా యాజమాన్యాల కోసం తెచ్చిన లేబర్ కోడ్స్ను అమలు జరపాలని, సరళీకృత విధానాల అమలు మరింత వేగవంతం చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. 12 గంటల పని విధానంపై ఇటీవల కార్పొరేట్లు పదేపదే మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో వైద్యసేవలందించే ఆశాల ప్రసక్తి లేదు. పెరుగుతున్న ధరలు, అవసరాలకనుగుణంగా ఐసిడిఎస్కు కేటాయింపులు లేవు. స్కీమ్ వర్కర్ల క్రమబద్ధీకరణ గురించి గానీ, 40 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలు బడ్జెట్లో లేవు.
16 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు కేవలం 5శాతం, 15 శాతంగా ఉన్న మైనారిటీల సంక్షేమానికి కేవలం 0.05 మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నది. బీసీ సంక్షేమం ఊసే లేదు. స్త్రీ, శుశు సంక్షేమాభివృద్ధికి కేటాయింపులు నామమాత్రంగానే వీటి కేటాయింపులు పెంచడంతో పాటు, ప్రజా ఆరోగ్యం కోసం డీజీపీలో 3 శాతం, విద్యకు 6 శాతం కేటాయింపులు పెంచాలి. ఆహార సబ్సిడీని పెంచి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అర్జెంటు సవర్ణ చేయకపోతే రానున్న కాలంలో పోరాటాలను కుదురుతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాదు లో ఇంద్ర పార్క్ వద్ద జరిగే మహాధర్నను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ ఎంపీ ఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వఏ ఏ షాల గంగాధర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నన్నేసాబ్ , విజయ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.