తెలంగాణ సంస్కృతి-‘సదర్‌’ ఉత్సవం

Telangana culture- 'Sadar' festivalభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం హైదరాబాద్‌ నగరం. ప్రతియేటా సరిగ్గా దీపావళి సమయానికి జంటనగరాలు మరో విభిన్నమైన ఉత్సవానికి జరుపుకోవడానికి ముస్తాబవుతాయి. అవే సదర్‌ ఉత్సవాలు. అ సదర్‌ను వృషభోత్సవాలు అని కూడా అంటారు. సదర్‌ అనే ఉర్దూ పదానికి ఆత్మ విశ్వాసం, లీడర్‌ అనే అర్థాలు ఉన్నాయి.”సదర్‌”అంటే హైదరాబాది వ్యవహారికం ప్రకారం ”ప్రధానమైనది” అని అర్థం. యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ సదర్‌ ఉత్సవంలో కుల,మతాలతో సంబంధం లేదు. యాదవ కులాలతో పాటు ,వారి మిత్రులు, బంధువులు కూడా అందరూ పాల్గొని, ఆటా, పాటలతో సరదాగా గడుపుతారు.
ఈ సదర్‌ ఉత్సవాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికతలో భాగంగా ప్రారంభమై దేశ వ్యాప్తంగా విస్తరించినప్పటికీ, తర్వాత కాలంలో కనుమరుగై అక్కడక్కడ స్థానిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి.ఈ ఉత్సవాలు మన రాష్ట్రానికి దేవగిరి యాదవ రాజుల కాలంలో వ్యాప్తి చెందాయి. కాకతీయ రాజుల కన్నా ముందే యాదవులు గొల్లకొండగా పిలిచే ప్రస్తుత గోల్కొండను కేంద్రంగా చేసుకుని జీవించేవారని చరిత్ర. తరువాత కాలంలో గొల్లకొండ ప్రాంతాన్ని (ప్రస్తుతం గోల్కొండ ప్రాంతం) పాలించే గొల్లల రాణి (యాదవుల రాణి) కుతుబ్‌ షాహీ దండయాత్రలను ఐదు దున్నపోతుల సహాయంతో ఎదుర్కొని పోరాడి వీర మరణం పొందిందని, తర్వాత కాలంలో గొల్లకొండ గోల్కొండగా మారినా రాణి, దున్నపోతుల వీరత్వానికి ప్రతీకగా సదరు ఉత్సవాలు జరుపుతున్నట్లు ఒక నానుడి. యాదవ వీరులు కుతుబ్‌ షాహిలు, మొగలులు, నిజాంల కాలంలో సైనిక అధికారులుగా, అంగరక్షకులుగా సమర్థవంతంగా పనిచేసినట్టు చెబుతారు. నిజాం వారి సేవలను గుర్తించి గౌలిగూడను (ఒకప్పుడు దీన్ని గొల్లగూడ అనేవారు. అక్కడ పాల ఉత్పత్తులు ఎక్కువగా అమ్మడం వల్ల ఆ పేరొచ్చింది.) ఇనామ్‌గా ఇచ్చారని ఆ తరంవారు చెబుతుంటారు. అక్కడినుంచే ఈ సదర్‌ ఉత్సవాలు ప్రారంభమయినట్టు తెలుస్తోంది.
దీపావళి పండుగ నాటికి వ్యవసాయ పనుల్లో దున్నలు,గేదెలు,ఎద్దులు,ఆవులతో చేసే పని చివరి దశకు చేరుకుంటుంది.ఆ సమయంలో పశువులు సమృద్ధిగా మేతను తింటూ బలంగా తయారై తమ సంతతిని పునరుత్పత్తి చేసే దశకు చేరుకుం టాయి.మేలు జాతి జంతువులను ఉత్పత్తి చేసే క్రమంలో ఈ పండుగ పుట్టుకొచ్చింది. అప్పట్లో వందలు,వేలాదిగా తరలివచ్చే దున్నలన్నింటిలో మేలు రకమైన జాతిని ఎన్నుకుని ఆ దున్న రాజును, దాని యజమానిని ఘనంగా సత్కరించి,ఆ దున్న రాజును, గేదెలతో క్రాస్‌ చేయించి మేలు జాతి దూడలను ఉత్పత్తి చేసేవారు. ఈ విధంగానే ఆంధ్ర ప్రాంతంలో కాటమరాజు ఒంగోలు గిత్త అనే బ్రీడును, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మల్లన్న, బీరప్పలు మేలిమి జాతి దక్కనీ గొర్రెలను వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఈ ఒంగోలు గిత్తలు, దక్కనీ గొర్రెలు ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు పొందాయి.
ఆధునిక సదర్‌ ఉత్సవాలు మాత్రం 1946 నుంచి కీర్తిశేషులు చౌదరి మల్లయ్య యాదవ్‌, నారాయణగూడ వై.ఎం.సి ప్రాంగణంలో ప్రారంభించినట్లు తెలుస్తోంది.కాలక్రమేణా హైదరాబాద్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో విస్తరించినప్పటికీ నారాయణగూడలో సదర్‌ ఉత్సవం (రెడ్డి మహిళా కళాశాల సమీపంలో)దాని చరిత్ర, ప్రజాధారణ కారణంగా అత్యధిక మందిని ఆకర్షిస్తున్నది.అందుకే దీనిని పెద్ద సదర్‌ అంటారు. మల్లయ్యయాదవ్‌ తదనంతరం నాటి నుంచి నేటి వరకు అతని కుటుంబ సభ్యులచే ఏటా ఇక్కడ నిరంతరాయంగా నిర్వహించ బడుతున్నది. ఈ ఉత్సవం ప్రధానంగా నారాయణగూడతో పాటు షేక్‌పేట్‌-దర్గా,సైదాబాద్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, కార్వాన్‌, బేగంబజార్‌, ముషిరాబాద్‌, గోషామహల్‌, మల్కాజ్‌గిరి లాంటి వివిధ ప్రాంతాల్లో జరుపుతారు. నేడు ఈ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా శంషాబాద్‌, షాద్‌గర్‌, కొల్లాపూర్‌, తుఫ్రాన్‌,నాగార్జున సాగర్‌, నకిరేకల్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, కరీంనగర్‌, చేవేళ్ల, నల్గొండ, భువనగిరి,యాదగిరి గుట్ట లాంటి నగరాలతో పాటు,మండల కేంద్రాల వరకూ విస్తరించాయి.
ఇది కేవలం తెలంగాణలోనే సదర్‌ అని పిలుస్తారు. మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో పోలా అని, తమిళనాడులో జల్లికట్టు అని, కర్నాటకలో కంబాలని,నేపాల్‌లో మాళ్వి అని హర్యానా, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన ప్రాంతాలలో కూడా వివిధ కాలాల్లో, వివిధ పేర్లతో యాదవులు ఘనంగా జరుపుకుంటారు.యాదవుల ఐక్యతను, జంతువుల పట్ల వారికున్న ప్రేమానురాగాలను, వారి జీవన విధానానికి, రుతువులకు ఉన్న సంబంధాన్ని ఈ సదర్‌ ఉత్సవాలు సూచిస్తాయి.సాధారణంగా దీపావళి రోజు వ్యాపార వర్గాలు లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. కానీ యాదవులకు ఈ సదరు ఉత్సవమే లక్ష్మీ పూజలాంటింది. ఎందుకంటే వారిది ఎక్కువగా పాల వ్యాపారం. గేదెలు, దున్నపోతులు, ఎద్దులు, ఆవులు, గొర్రెలే వారికి సంపద. కాబట్టి అవే వారికి లక్ష్మీ దేవతలు.అందుకనే ప్రత్యేకించి సదరు ఉత్సవం రోజున వాటికి శుభ్రంగా స్నానం చేయించి, పూలదండలతో అందంగా అలంకరంచి పండుగలా చేసుకుంటారు.ఉత్తర భారతదేశంలో ఉన్న గోవర్ధన పూజ వలే మన దగ్గర సదర్‌ ఉత్సవం జరుపుకుంటారు.
ఆవు పేడతో నేలపై అలికి, దానిపై రంగురంగుల ముగ్గులు వేసి,తీపి పదార్థంతో అన్నం వండిన మట్టి కుండపై దీపం వెలిగించి పూజ చేస్తారు.అనంతరం ఉరేగింపుకు తెచ్చిన బలిష్టమైన దున్నను దాని పైనుంచి దాటిస్తారు. దీంతో సదరు ఊరేగింపు ప్రారంభమైనట్లు.కవాతులో యాదవులు తమ అత్యుత్తమ దున్నలను ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు.దున్నల శరీరాన్ని నూనెతో రుద్ది, వాటి కొమ్ములకు రంగులు వేయడం, మెడ చుట్టూ దండలు, పాదాలకు చీలమండలు (గజ్జెలు), మెడ లేదా నుదుటిపై గంటలతో, వాటి కొమ్ములపై నెమలీకలతో అలంకరిస్తారు.వివిధ ప్రాంతాల నుంచి డప్పులతో, డ్యాన్సులతో దున్న రాజులు బయలుదేరి తన చురుకుదనాన్ని,బలిష్టతను ప్రదర్శిస్తాయి.వాటిని ప్రధానంగా దాని వెనుక కాళ్లపై నిలబడేలా చేస్తారు. అందులో భాగంగా ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందుకాళ్లను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ప్రదానం చేస్తారు. ఈ మధ్య జరుగుతున్నా సదర్‌ ఉత్సవాలు రాజకీయ రంగు పులుముకున్నట్లు కనిపిస్తోంది.ఆధిపత్య కులాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం యాదవుల మధ్య చీలికలు తెచ్చి వారి సాంస్కృతిక పండుగలను సైతం రాజకీయ రొచ్చులోకి లాగుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. యాదవులంతా ఒక్కటిగా రాజకీయాలకు అతీతంగా జాతి ఔన్నత్యాన్ని ద్వివినీకృతం చేసే విధంగా సదరు ఉత్సవాలు నిర్వహించుకోవాలి. అన్ని కుల, మతాలను గౌరవిస్తూనే తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు భవిష్యత్‌ తరాలకు చాటాలి.

– జె.నారాయణయాదవ్‌, 9494019270