నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ అప్పు రూ.3,89,672.50 కోట్లు అని, ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,85,490.80 కోట్లు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024లో బడ్జెట్ అంచ నాలకు ఈ రెండు రాష్ట్రాల అప్పులు పై విధంగా ఉన్నాయన్నారు. ఏపీలో 2022లో రూ.3,80,548.50 కోట్లు, 2023లో రూ.4,28,715.70 కోట్ల అప్పు ఉండగా, తెలంగాణలో ఇదే సంవత్సరంలో రూ. 3,14,852.90 కోట్లు, 2023లో రూ. 3,52,061 కోట్ల అప్పులుండేవని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే ముందు తమిళనాడు అప్పు రూ. 8,34,543.50 కోట్లు, ఉత్తరప్రదేశ్ అప్పు రూ. 7,69,245.30 కోట్లు, మహారాష్ట్ర అప్పు రూ.7,22,887.30 కోట్లు, పశ్చిమ బెంగాల్ అప్పు రూ. 6,58,426.20 కోట్లు, కర్ణాటక అప్పు రూ.5,97,618.40 కోట్లు, రాజస్థాన్ అప్పు రూ. 5,62,494.90 కోట్లుగా ఉన్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల అప్పు 2022లో రూ. 67,79,970.80 కోట్లు, 2023లో రూ. 73,96,354.90 కోట్లు, 2024లో రూ. 82,22,065.30 కోట్లు ఉందని తెలిపారు.
తెలంగాణలో 1,637. 25, ఏపిలో 1,593.97 హెక్టార్ల అటవీ భూమి బదిలీ
తెలంగాణలో 1,637.25, ఆంధ్రప్రదేశ్‌లో 1,593.97 హెక్టార్ల అటవీ భూమిని బదిలీ, ఇతరావసరాలకు బదిలీ చేసినట్టు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ తెలిపారు. సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 47 ప్రతిపాదనలకు గాను 1,593.97 హెక్టర్ల అటవీ భూమిని, తెలంగాణలో 116 ప్రతి పాదనలకు గాను 1,637.25 హెక్టర్ల అటవీ భూమి బదిలీ చేసినట్టు తెలిపారు. దేశవ్యా ప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 8,731 ప్రతిపాదనలకు గాను, 95,724.99 హెక్టర్ల అటవీ భూమిని బదిలీ చేసినట్టు మంత్రి తెలిపారు.
ఏపీ స్థానిక సంస్థలకు రూ.7,800 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్
ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు రూ.7,800 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు రూ.18,063 కోట్లు 15వ ఆర్థిక సంఘం సిఫా ర్సులు చేసిందని, అందులో 2024 జులై15 నాటికి రూ.10,263 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అలాగే డిజార్టస్ మేనేజ్‌మెంట్ నిధులు రూ.6,183 కోట్లు సిఫార్సు చేయగా, రూ.3,398 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.
అంటే ఈ నిధుల్లో ఇంకా రూ.2,785 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు రూ.45,743 కోట్లు సిఫార్సు చేస్తే, రూ.44,158 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అంటే రూ.10,585 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
తెలంగాణకు రూ.5,885 కోట్లు పెండింగ్
తెలంగాణ స్థానిక సంస్థలకు రూ.13,111 కోట్లను 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేసిందని, అందులో 2024 జులై15 నాటికి రూ.7,226 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అంటే రూ.5,885 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే డిజార్టస్ మేనేజ్‌మెంట్ నిధులు రూ. 2,483 కోట్లు సిఫారసు చేయగా, రూ.1,176 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అంటే ఈ నిధుల్లో ఇంకా రూ.1,307 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు రూ.15,594 కోట్లు సిఫార్సు చేస్తే, రూ.8,402 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అంటే రూ.7,192 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.