నవతెలంగాణ – కామారెడ్డి: కలకత్తా ఆర్ జి కే ఏ ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మహిళా (పీజీ ఇన్ పౌల్మౌనరీ డిపార్ట్మెంట్ )పీజీ వైద్యురాలి పై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ( టి జి జి డి ఏ నిజామాబాద్ యూనిట్ ) తీవ్రంగా ఖండిస్తుందనీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం శ్రీనివాస్ అన్నారు.అందులో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులందరూ ర్యాలీగా బయలుదేరి ఇందిరా గాంధీ చౌక్ వద్దకు చేరుకొని మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు. నిదితుల్ని కఠినంగా శిక్షించాలని, వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఎస్ఆర్డిఎ, జూడ సంఘాల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. రేపు తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రpభుత్వ హాస్పిటల్స్ కు వచ్చే బీద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 10గంటల నుంచి 11గంటల వరకు, ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయగలరని ప్రభుత్వ వైద్యులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి డాక్టర్ కే బన్సీలాల్, కోశాధికారి డాక్టర్ రాజ గౌడ్, ప్రభుత్వ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.