తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటం. వాస్తవాలు – వక్రీకరణలు

Armed struggle as a farmer in Telangana.
Facts - Distortionsమొగలాయి పాలన చివరి దశలో ఉన్నపుడు మొగల్‌ చక్రవర్తికి తెలంగాణ ప్రాంతానికి సామంతరాజుగా ఉన్న నిజాం ఉల్‌ముల్క్‌ 1512లో స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. అతని వంశపాలకులలో చివరివాడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1911లో అధికారానికి వచ్చి 1948 సెప్టెంబర్‌ 17న రైతాంగ సాయుధ పోరాటంతో పదవీచ్యుతుడైనాడు. నిజాం పాలకులు నాటి తెలంగాణ ప్రాంతాన్ని 236 సంవత్సరాలు పరిపాలించారు. నిజాంకు మరాఠాలకు జరిగిన యుద్దంలో అంగ్లేయులు సహకరించడంతో వారికి మచిలీపట్నం నుండి గుంటూరు వరకు గల కోస్తా జిల్లాలను అప్పగించాడు. ఆ తరువాత నిజాంతో బ్రిటీష్‌ ప్రభుత్వం సబ్సిడరీ అలయన్స్‌ ఏర్పాటుతో రాయలసీమ 4 జిల్లాలను దత్త మండలాలుగా వదిలేశాడు.
కోస్తా, రాయలసీమ జిల్లాలు పోగా మిగిలిన 16 జిల్లాలతో నిజాం పాలకులు పరిపాలన సాగించారు. ఈ 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలంగాణకు, 5 జిల్లాలు మహారాష్ట్రకు, 3 జిల్లాలు కర్ణాటకకు చెందినవి ఉన్నాయి. మొత్తం 5.30 కోట్ల ఎకరాలను 3 భాగాలుగా చేసారు. రైతులకు పట్టాలు ఇచ్చిన భూములు 3 కోట్ల ఎకరాలకు పైగా దివానీ భూములుగాను, జాగీరుదార్ల ఆధీనంలో 1.5 కోట్ల ఎకరాలు ఉండగా, నిజాం సొంత ఆస్థిగా 55 లక్షల ఎకరాల భూమి ఉంది. రైతులకు పట్టాలు ఇచ్చినప్పటికీ నిజాం భూములు (సర్ఫెఖాస్‌) మరియు జాగీరుదార్ల భూములు ఉచితంగా సాగుచేసిన తరువాతనే, రైతులు తమ భూములు సాగుచేసుకోవాలి. జమీందారులు, జాగీరుదారులు, నిజాం పెద్దఎత్తున పన్నులు వేసి రైతులను పీడించేవారు. మొట్టమొదటిసారి 1908లో లాండ్‌ రెవెన్యూ చట్టం తెచ్చారు. దీని ప్రకారం సాగుచేసే రైతుకు ఎలాంటి హక్కులు లేవు. రైతుల నుండి పన్నులు వసూలు చేయడానికి గ్రామస్థాయిలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను, రాష్ట్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను (తహసిల్‌దారు స్థాయి నుండి కలెక్టర్‌ వరకు) ఏర్పాటు చేశారు. వీరికి సహాయంగా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ రెండు శాఖలను ప్రస్తుతం 40శాఖలుగా ప్రభుత్వాలు విస్తరించాయి. 1944లో కౌలుదారుల చట్టం తెచ్చారు. ఎన్నిచట్టాలున్నప్పటికీ రైతులు శిస్తులు చెల్లించలేక తమ భూములకు రాజీనామాలు పెట్టారు. ఆ భూములే ‘ఖారజ్‌ఖాతా’ భూములుగా గుర్తించారు. గ్రామాలలో వెట్టిచాకిరీ (ఎలాంటి చెల్లింపులు లేకుండా ఉచితసేవ) పెద్దఎత్తున సాగింది. ముఖ్యంగా దళిత, వెనుకబడిన వారిని వెట్టిచాకిరీకి బలిచేసారు.
నాటి భూస్వాములైన విసునూరు దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డికి 48 వేల ఎకరాలు, సూర్యాపేట జమీందారుకు 25 వేల ఎకరాలు, కల్లూరు దేశ్‌ముఖ్‌కు 1 లక్ష ఎకరాలు, జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి 1.50 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీరు కాక దేవరకొండ, మల్లాపురం, రంగారెడ్డి, చందంపెల్లి, మిర్యాలగూడ చెరుకుపెల్లి నర్సింహారెడ్డి, హుజూర్‌నగర్‌ బేతవోలు దొరలకు వేలాది ఎకరాల భూములు అక్రమస్వాధీనంలో ఉన్నాయి. ఈ జమీందారులు ప్రభుత్వంతో మిలాఖతై ప్రజలపై రకరకాల పన్నులు వేసారు.
నిర్బంధపన్నులు – వెట్టిచాకిరి
అన్ని రకాల వృత్తులపైన, వ్యాపారాలపైననే కాక వివాహాలపైన, కూలీలమీద ఇంటిపన్నుతో సహా, శవాలను పూడ్చినందుకు కూడా పన్నులు వసూలు చేసారు. 1867లో సాలార్‌జంగ్‌ ప్రధానమంత్రిగా భూమి పన్ను విధానంలో మార్పులు తెచ్చాడు. భూమిని సర్వే చేసి పన్నులు నిర్ణయించాడు. రెండు ఎద్దుల సేద్యానికి రూ.5-10లు, 4 ఎద్దులవారికి రూ.10-20లు పన్నులు నిర్ణయించారు. మొత్తం పంట అమ్మినా శిస్తు చెల్లించడానికి ఆదాయం వచ్చేదికాదు. వీటితోపాటు జమీందారుల ఇండ్లలోకానీ, రాజుగారికికానీ ఏ కార్యక్రమాలు జరిగినా ప్రజల నుండి గొర్రెలు, మేకలు, పండ్లు, చేపలు, కోళ్ళు తేనె బలవంతంగా పట్టుకెళ్ళేవారు. అడవిలో నెగడు (మంట) వేసుకున్నందుకు కూడా పన్ను వసూలు చేసారు. గ్రామాలలోని అమ్మాయిలను జమీందార్ల ఇండ్లకు ఆడపాపలుగా తీసుకెళ్ళేవారు. నాడు గ్రామాలలో పేదలకు చదువుకునేహక్కు లేదు. వీరి దుష్టపాలనకు వ్యతిరేకంగా అనేక గిరిజన పోరాటాలు జరిగాయి. అందులో జోడేఘాట్‌ పోరాటం కుమరంభీం నాయకత్వాన జరిగింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల భూస్వాములు గిరిజనుల భూములను ఆక్రమించి వారికి వెట్టిబానిసలుగా మార్చారు. మొట్ట మొదటిసారి 1933 జూన్‌ 3వ తేదీన నల్లగొండ జిల్లా భువనగిరిలో 1000 మంది రైతులతో రెవెన్యూ ఆఫీసుకు పోయి ఆందోళన చేశారు. విసిగిపోయిన రైతులు, వ్యవసాయ కార్మికులు పోరాటాలలోకి వచ్చారు. 1917లో రష్యాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన అధికారంలోకి రావడంతో తెలంగాణ పోరాటాలు ప్రభావితమైనాయి. జమీందారులకు వ్యతిరేకంగా సూర్యాపేట, బేతవోలు, మునగాల, కొలనుపాక, పరిటాల, అమ్మపాలెం, మునుగోడు ప్రాంతాలలో పోరాటాలు సాగాయి. వేల ఎకరాల భూస్వాముల భూములను ఆక్రమించారు. ప్రజలలో వచ్చిన ఈ చైతన్యాన్ని, పోరాటాలను అణిచివేయడానికి నిజాం సైన్యం, జమీందారుల గూండాలతో పాటు, రజాకార్లు (వాలంటీర్లు) కూడా తోడైనారు. ఔరంగబాదుకు చెందిన అడ్వకేట్‌ కాశీంరజ్వి 60 వేల మందితో సైన్యం ఏర్పాటు చేసి, వేతనాలు చెల్లింపుపై నిజాంకు సహకరించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. పై మూడు సైన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రతిఘటించి పోరాటాలు ప్రారంభించారు. ఈ పోరాటాలన్నింటికి తలమానికంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది.
నాటి నల్లగొండ జిల్లా జనగామకు చెందిన సీతారాంపురం గ్రామంలో విసునూరు రాంచంద్రారెడ్డి తల్లి జానమ్మ అకృత్యాలు వర్ణించనలవికానివి. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసినా రోజుకు 4 పైసల కూలీ మాత్రమే ఇచ్చేవారు. పాలిచ్చే తల్లులను మద్యాహ్నం ఇంటికి పంపడానికి పాలు పిండి చూపాలని ఆదేశించింది. ఆమె కుమారుడు రాంచంద్రారెడ్డి విసునూరు చుట్టుపక్కల గల గ్రామాలలో తన గూండాలతో నిజాం మరియు కాశీంరజ్వి సైన్యాలతో కలిసి దాడులు చేసి ప్రజల పంటలను కొల్లగొట్టేవారు. ఎదురు తిరిగినవారిని హత్యలు చేసారు. సీతారాంపురం దగ్గర కామారెడ్డి గ్రామంలో బందగీ కుటుంబం నివసించేది. వారు 6 గురు అన్నదమ్ములు. భూములు పంపిణీ చేసుకున్నారు. అందరికన్నా పెద్దవాడు రాంచంద్రారెడ్డి గూండాలతో షరీకై త్రాగుడు అలవాట్లుకు బానిసై తనవాటాకు వచ్చిన భూములు అమ్ముకున్నాడు. తిరిగి తనకు వాటా ఇవ్వాలని తమ్ముల్లతో తగాదాకు దిగాడు. జమీందారు రాంచంద్రారెడ్డి అండతో తమ్ముళ్ళపై దాడులు చేశాడు. బందగీ హైదరాబాదు కోర్టులో కేసు వేశాడు. కేసులో విజయం సాధించి ఇంటికి వస్తున్న రోజుననే బందగీని చంపించాడు. చుట్టు గ్రామాల ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. అంతేకాక జమీందార్లు మరియు నిజాం ప్రభువు అరాచకాలను పత్రికలలో ప్రచారం చేసిన షోయబుల్లాఖాన్‌ అను విలేఖరిని హైదరాబాదులోని బర్కత్‌పురలో హత్య చేశారు. ఈ విధంగా నిజాంకు వ్యతిరేకంగా ఉన్న ముస్లింలను హతమార్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. హిందూ జమీందారులు, నిజాం సైన్యంతో కుమ్మక్కై తిరగబడిన హిందూ, ముస్లింలపై దాడులు చేసారు. భూములను అక్రమంగా లాక్కున్నారు. వీటన్నింటికి పరాకాష్టగా చిట్యాల ఐలమ్మ పోరాటం సాయుధ పోరాటానికి అగ్నికణంలా పనిచేసింది.
కమ్యూనిస్టుపార్టీ ఏర్పాటు
తెలుగుభాష విస్తరణ కోసం తెలంగాణలో గ్రంధాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రాజారావిశెట్టి రంగారావు సహాయంతో హైదరాబాదులో ‘శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయాన్ని’ ఏర్పాటు చేసారు. ప్రతియేటా గ్రంధాలయ మహాసభలు జరుపుతూ తెలుగు ప్రజలను ఏకంచేసారు. నిజాం రాష్ట్రంలో ‘ఆంధ్ర జనసంఘం’ మొదటి సమావేశం 14.02.1922న కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. క్రమంగా ఈ సంఘంలో వామపక్షశక్తుల బలం పెరగడమేకాక, అతివాది అయిన రావి నారాయణరెడ్డిని 1944లో భువనగిరిలో జరిగిన మహాసభలో అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సభ్యత్వం 6 పైసలు ఉండేది. మితవాదులు మరో సంఘం పెట్టుకున్నారు. క్రమంగా సంఘంపేరుతో పోరాటాలు కొనసాగించారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనర్సింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, దేవులపెల్లి వెంకటేశ్వరరావు, బద్దంఎల్లారెడ్డిలు సంఘంలో చేరి కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసారు.
1934 సెప్టెంబర్‌లో కాకినాడలో 7గురితో ఆంధ్రప్రాంత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. చలసాని వాసుదేవరావు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్యలు కమిటీలో ఉన్నారు. 1934లో పార్టీపై నిషేధం విధించి 1948లో తొలగించారు. 1936 ఏప్రిల్‌ 11న లక్నోలో ‘అఖిలభారత కిసాన్‌సభ’ ఏర్పడింది. భూస్వామ్య విధానం రద్దుకావాలని, ‘దున్నేవాడికే భూమి’ నినాదం ఇచ్చింది. 1939 డిసెంబర్‌ 13న హైదరాబాదులో ముగ్దుం మోహియుద్దీన్‌ నాయకత్వాన ‘కామ్రేడ్స్‌ అసోషియేషన్‌’ ఏర్పడింది. ఇందులో ఆలంకుంద్‌మీరీ, రాజ్‌బహద్దుర్‌గౌర్‌, ముర్తుజాహైదర్‌, సయ్యద్‌ ఇబ్రహీంలతో కలిసి ఏర్పాటు చేసారు. ఈ కమిటీ ఏర్పాటుకు బూర్గుల రామకృష్ణారావు అభినందనలు తెలిపారు. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ నైజాం ప్రాంతంలో సంఘం పేరుతో కార్యకలాపాలు కొనసాగించింది. తెలంగాణలో 1941లో పెరవల్లి వెంకటరమణయ్య, ఎ.గురువారెడ్డి, రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి నాయకత్వాన ‘కమ్యూనిస్టు పార్టీ’ ఏర్పడింది. కమ్యూనిస్టు పార్టీలో సర్వదేవభట్ల రామనాధం, చంద్రగుప్తచౌదరి, అబీబుద్దీన్‌, గంగసాని గోపాలరెడ్డి, బి.డి.దేశ్‌పాండేలు కమిటీలో ఉన్నారు. ఆ విధంగా తెలంగాణలో మొదట కమ్యూనిస్టు పార్టీని ముస్లింలు ఏర్పాటు చేసారు. నిజాంను గద్దెదించేవరకు పోరాటంలో ముందుపీఠిన ఉన్నారు.
వీరనారి ఐలమ్మ పోరాటం
నేటి వరంగల్‌ జిల్లాలోని విసునూరు గ్రామానికి 3 కి.మీల దూరంలో గల పాలకుర్తిలో చిట్టేటి ఐలమ్మ తమ కుటుంబంతో నివసిస్తూ ఉంది. ఆమె పొలంలోని పంటను కాజేయడానికి విసునూరు దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి గూండాలు ప్రయత్నించారు. ఇది గమనించి భీంరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వాన గూండాలను తరిమివేసారు. తిరిగి గూండాలు ఐలమ్మ ఇంటికి వచ్చి ధాన్యాన్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించారు. భీంరెడ్డితో పాటు చల్లా ప్రతాపరెడ్డి, కె. రాంచంద్రారెడ్డి, గంగులసాయిరెడ్డి, మనోహర్‌రావుల నాయకత్వాన 30 మంది వాలంటీర్లు గూండాలను తరిమివేసారు. దీన్ని అవమానంగా భావించిన దేశ్‌ముఖ్‌ నైజాంసైన్యంతో పాటు గూండాలను పోగుచేశాడు. నిజాం సైన్యాన్ని, జమీందారు గూండాలను తరిమివేసిన వార్తకు ప్రజలు పెద్దఎత్తున దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఊరేగింపు చేశారు. 200 మందితో ఊరేగింపు బయలుదేరి విసునూరు గ్రామానికి చేరుకుంటుండగా ఊరేగింపుపై గూండాలు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమురయ్య చనిపోయాడు. దొడ్డి కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్యకు తుపాకీతూటాతో గాయమయ్యింది. ఈ కాల్పులతో ఆగ్రహించిన ప్రజలు గడీపై దాడి చేసారు. దొడ్డికొమురయ్య మృతదేహంతో ఊరేగింపు చేశారు. అనేక గ్రామాలలో దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఊరేగింపులు జరిగాయి. రాంచంద్రారెడ్డి కొడుకు బాపురెడ్డి హైదరాబాదు పారిపోతుండగా జనగామ రైల్వేస్టేషన్‌లో చంపివేశారు. ప్రజల ప్రతిఘటన 300-400 గ్రామాలకు వ్యాపించింది. కమ్యూనిస్టుపార్టీ పత్రిక విస్తృత ప్రచారం చేసింది. పోలీసులు 156 కేసులు నమోదు చేసారు. వారాలు, నెలలతరబడి దాడులు సాగాయి. రాజాకార్లు, పోలీసులు ఇండ్లు లూఠీ చేసారు. వీరి దౌర్జన్యాలను ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. కమ్యూనిస్టు పార్టీ 11.09.1946న ‘సాయుధ పోరాటానికి’ పిలుపిచ్చింది. గెరిల్లా దళాలు ఏర్పడి ఎక్కడికక్కడ తిరుగుబాటు చేశాయి. క్రమంగా ఈ సాయుధపోరాటం నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహాబూబ్‌నగర్‌ జిల్లాలకు వ్యాపించింది. పోరాటంలో ప్రజలు 10 లక్షల ఎకరాల జమీందార్ల భూములను ఆక్రమించారు. 3వేల గ్రామాలలో ‘గ్రామరాజ్యాలు’ ఏర్పాటు చేసారు. ఈ పోరాటంలో 1,500 మంది కార్యకర్తలు కాల్చివేయబడ్డారు. బైరాన్‌పల్లి, కూటిగల్లు పోరాటాలు చారిత్రాత్మకమైనవి. ఈ పోరాటాన్ని వర్గపోరాటంగా చూడాలి. పీడితులు భూస్వామ్య, జమీందారులకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం. నిరంతరం కమ్యూనిస్టు పార్టీ సూచనలు, సలహాలు ఇస్తూ పోరాటాన్ని నడిపింది. ఆంధ్రప్రాంతం నుండి పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య గార్లతో సహా ఉద్యమానికి నాయకత్వం వహించడమేకాక అనేకమంది కార్యకర్తలు వచ్చి పోరాటంలో ఆత్మాహుతికి గురయ్యారు. పెద్దఎత్తున నిధులు సమీకరించి పోరాటానికి అండగా ఉన్నారు. చివరికి సైనికులలో పనిచేసేవారుకూడా వచ్చి పోరాట కార్యకర్తలకు శిక్షణలు కల్పించారు. ఈ పోరాటం ప్రపంచ చరిత్రలోనే గుర్తింపు పొందినది.
కేంద్ర సైన్యాలరాక
పోరాటం ప్రారంభమై 11 మాసాలు గడుస్తుండగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించింది. నెహ్రూ ప్రభుత్వం నైజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఇష్టంగా లేదు. రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. భారత స్వాతంత్య్రానంతరం మరో 13 మాసాలపాటు సాయుధపోరాటం సాగింది. మొత్తంగాను 2 సంవత్సరాల 2 మాసాలు పోరాటం జరిగినప్పటికీ ఉద్యమం అణచడంలో నిజాం సైన్యాలేకాక జమీందార్ల గూండాలు, కాశీంరజ్వీ రజాకార్లు విఫలమైన సంగతిని గుర్తించి నెహ్రూ ప్రభుత్వం తెలంగాణకు సైన్యాలను పంపించింది. 1948 సెప్టెంబర్‌ 13న ఔరంగాబాదు వైపు నుండి ఒకసైనికదళం, కోదాడవైపు నుండి మరొకదళం తెలంగాణలో ప్రవేశించాయి. సైన్యంతో జరిగిన ప్రతిఘటనలో 490 మంది నిజాం సైనికులు మరణించారు. పరిస్థితిని గమనించిన నిజాం నెహ్రూ ప్రభుత్వంతో రాజీపడి 1948 సెప్టెంబర్‌ 17న నెహ్రూసైన్యాలకు లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. నైజాంను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వాన వచ్చిన సైన్యాలు హైదరాబాదులోని బొల్లారంలో భారత స్వాతంత్య్ర జెండాను ఆవిష్కరించారు. నెహ్రూ ప్రభుత్వం నిజాంను ‘రాజ్‌ప్రముఖ్‌’గా ప్రకటించింది. దీనిని బట్టి నెహ్రూ ప్రభుత్వానికి నిజాంపైగల విశ్వాసం బట్టబయలైంది.
నెహ్రూ సైన్యాలు తెలంగాణను స్వాధీన పర్చుకున్నప్పటికీ పోరాటంలో సాధించుకున్న భూములకు కేంద్రం రక్షణ కల్పించేవరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. సైన్యంతో జరిగిన గెరిల్లా పోరాటంలో 2,500 మంది కార్యకర్తలు మరణించారు. పోరాటంలో 4000 మంది కార్యకర్తలు, నాయకులు కాల్పులకు బలయ్యారు. అందులో హిందువులు, ముస్లింలు వున్నారు. మిలిట్రీ కాన్సెన్‌ట్రేషన్‌ క్యాంపులు పెట్టి ప్రజలను చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ మహిళలు, కార్మికులు, విద్యార్థులు, యువకులు పోరాటాలు కొనసాగించారు. 1950 జనవరి 26 వరకు నైజాంను రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగించారు. చివరికి కేంద్రం సాయుధ పోరాటాన్ని అణచలేమని నిర్ణయానికి వచ్చి ‘రక్షిత కౌలుదారీచట్టాన్ని”ప్రకటించింది. ప్రజలు స్వాదీనం చేసుకున్న 10 లక్షల ఎకరాల భూములకు హక్కులు కల్పించారు. ఈ ప్రకటనతో 1951 అక్టోబర్‌ 21న ”సాయుధ పోరాటాన్ని ముగిస్తున్నట్లు” కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. పోరాటం ద్వారానే అనుభవాన్ని సంపాదించుకున్న ప్రజలు శిక్షణ పొందిన నిజాం, రజాకార్ల సైన్యంతోపాటు, మిలటరీ సైన్యాలకు వ్యతిరేకంగా 5 సంవత్సరాలపాటు సుధీర్ఘ పోరాటం చేసారు. ఇంత సుదీర్ఘకాలంపాటు ప్రపంచంలో ఏ పోరాటమూ, యుద్ధమూ సాగలేదు.
జన సంఘం పారీ ్ట(బిజెపి మాతృక పార్టీ) ఏర్పాటు
21.10.1951న భారతీయ జనసంఫ్‌ు పార్టీని స్థాపించారు. సాయుధ పోరాటం ముగింపు రోజున జనసంఘం పార్టీని స్థాపించిన నేటి బిజెపివారు ఇది విముక్తి పోరాటమని, హిందువులకు-ముస్లింలకు జరిగిన పోరాటంలో హిందువులు విజయం సాధించారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవ చరిత్ర గమనిస్తే భూస్వాములు, జమీందారులు హిందువులు కాగా, నిజాం కాశీంరజ్వీ ముస్లింలు. ఈ కూటమికి వ్యతిరేకంగా హిందూ, ముస్లిం రైతులు కలిసి పోరాటాలు చేసి ప్రాణాలర్పించారు. వాస్తవ చరిత్రను వక్రీకరించటం, నేడు బిజెపి చేస్తున్న పనిని తీవ్రంగా ఖండించాలి. నాడు ఉద్యమంతో సంబంధంలేనివారు కూడా నేడు పోరాటం యెడల ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పటికైనా వాస్తవ చరిత్రను గుర్తించాలి. ఈ పోరాటంలో నైజాం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. కానీ ముస్లింల నుండి విముక్తి కలిగిన ప్రచారం దుర్మార్గం. భారతసైన్యం నైజాం విలీనమైన తరువాత సైన్యాలను ఉపసంహరించకుండా కమ్యూనిస్టులను అణిచివేయడానికి 3 సంవత్సరాలకుపైగా ప్రజలపై హింస కొనసాగించింది. సైన్యం చేయని ఆకృత్యమంటూలేదు. చివరికి పోరాటాన్ని అణచలేమనే నిర్ణయానికి వచ్చిన తరువాతనే కేంద్రం వెనుకడుగు వేసింది. ఇది చారిత్రక వాస్తవం.
– సారంపల్లి మల్లారెడ్డి, 9490098666