కుల గణనకు తెలంగాణ సర్కార్‌ రూ.150 కోట్లు కేటాయించింది

– సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్రవణ్‌ కుమార్‌ వాదనలు
– తదుపరి విచారణ ఏప్రిల్‌ 3 కు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించిందని తెలంగాణ స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్రవణ్‌ కుమార్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ జనాభా లెక్కలు ఆధారంగా ఆయా వర్గాలకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తమ కులాలను ఓబీసీ జాబితా నుంచి తప్పించారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆనాటి తెలంగాణ సర్కార్‌ కొప్పుల వెలమ, శెట్టి బలిజ సహా దాదాపు 28 వెనకబడిన కులాలు రిజర్వేషన్లను తొలగించింది. ఈ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయంటూ ఆయా వర్గాలకు చెందిన పలువురు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారానికి సంబంధించి 2016లో మరికొంత మంది, ఆర్గనైజేషన్స్‌ పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు మరోసారి మంగళవారం జస్టిస్‌ సుధాంశు ధులియా, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకొచ్చాయి. తొలుత జస్టిస్‌ సుధాంశు ధులియా జోక్యం చేసుకొని… ఈ కేసు ఓబీసీలకు సంబంధించినదా? తెలంగాణాకా? ఆంధ్ర ప్రదేకా? అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన ఓబీసీల కేసు అని, విభజన తర్వాత పలు కులాలను ఓబీసీల నుంచి తప్పించారని పిటిషనర్‌ తరఫు అడ్వకేట్‌ బెంచ్‌కు వివరించారు. తదుపరి విచారణ ఏప్రిల్‌ 3 కు వాయిదా పడింది.