మహిళా శిశు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే మెచ్చా

నవతెలంగాణ – అశ్వారావుపేట
మహిళా,శిశు సంక్షేమానికి గతంలో లేని విధంగా సి.ఎం కేసీఆర్ నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక పథకాలను అమలు చేస్తుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.స్థానిక గిరిజన భవన్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గ స్థాయి తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ప్రత్యేక అధికారి డి.ఆర్.డి.ఎ పి.డి మధుసూధన్ రాజు అద్యక్షతన ఘనంగా నిర్వహించారు.ముందుగా ఎమ్మెల్యేకు అంగన్వాడీ టీచర్లు కోలాటం ఆడుతూ ఘన స్వాగతం పలికారు.అలాగే పోషకాహార స్టాల్ లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మహిళలు,తల్లిబిడ్డ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మీ, బాలామృతం ప్లస్, ఫోర్టిఫైడ్ బియ్యం,ఈ నెల నుంచి ఫోర్టిఫైడ్ సన్న బియ్యం,గిరిజన ప్రాంతాల్లో గిరి పోషణ,ఫ్రీ స్కూల్ విద్య,న్యూట్రి గార్డెన్ల తోపాటు అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వివరించారు.ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లు వేతనాలు తక్కువగా ఉండేవని,వీటిని రెట్టింపు చేసి వారికి సముచిత గౌరవాన్ని కల్పించినట్లు చెప్పారు. ఈ పథకాలను అమలు చేయడం ద్వారా శిశు, మాతృ మరణాల రేటు తగ్గించుకో గలిగామని అన్నారు. వీటితోపాటు మైనర్లు, మహిళల రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకొచ్చి నట్లు చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, సిబ్బందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానించి, జ్ఞాపికలను అందించారు.  ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ మండలాల తహశీల్ధార్లు, ఎం.పి.డి.ఒ లు,ప్రజాప్రతినిధులు, సి.డి.పి.ఒలు పాల్గొన్నారు.