తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలు

– ఏపీకి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు
– కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
న్యూఢిల్లీ : తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలను కేంద్రం కేటాయించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాని మోడీ అధ్యక్షత కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని 19 రాష్ట్రాల్లో 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఏడు నవోదయాలు ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో జగిత్యాల, నిజమాబాద్‌, కొత్తగూడెం భద్రాద్రి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబుబ్‌నగర్‌, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 28 కొత్త నవోదయాలను ఏర్పాటు చేయనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌(8), అసోం (6), మణిపూర్‌ (3), కర్ణాటక (1), మహారాష్ట్ర (1), పశ్చిమ బెంగాల్‌ (2) రాష్ట్రాలలో ఈ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తారు. మొత్తం ఈ 28 నవోదయ విద్యాలయాలకు ఏర్పాటుకు 2024-25 నుంచి 2028-29 మధ్య రూ. 2,359.82 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి, వలసపల్లె (చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలం), పాలసముంద్రం (శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం), తాళ్లపల్లి (గుంటురు జిల్లా మాచర్ల మండలం), నందిగామ (కష్ణా జిల్లా), రొంపిచర్ల (గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్‌), నూజీవిడ్‌ (ఏలూరు జిల్లా), థోన్‌ (నంద్యాల)లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
ఏపీతో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌ (1), అసోం (1), ఛత్తీస్‌గఢ్‌ (4), గుజరాత్‌ (3), హిమాచల్‌ప్రదేశ్‌ (4), జమ్ముకాశ్మీర్‌ (13), జార్ఖండ్‌ (2), కర్ణాటక (3), కేరళ (1), మధ్యప్రదేశ్‌ (11), మహారాష్ట్ర (3), ఢిల్లీ (1), ఒడిశా (8), రాజస్థాన్‌ (9), తమిళనాడు (2), త్రిపుర (2), ఉత్తరప్రదేశ్‌ (3), ఉత్తరాఖండ్‌ (4) రాష్ట్రాల్లో కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించనున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో కెవి శివమొగ్గలో కేంద్రీయ విద్యాలయాన్ని విస్తరణకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మొత్తం ఈ 86 కేంద్రీయ విద్యాలయాలకు ఏర్పాటుకు 2025-26 నుంచి ఎనిమిదేండ్లలో రూ. 5,872.08 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఢిల్లీ మెట్రో నాలుగో విడత ప్రాజెక్టుకు ఆమోదం
ఢిల్లీ మెట్రో నాలుగో విడత ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రిథాలా నుంచి కుండ్లీ వరకు 26.468 కిలో మీటర్ల మేర ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తారు. దేశ రాజధాని, పొరుగన ఉన్న హర్యానా మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందని కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.6,230 కోట్లతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) అమలు చేస్తుంది. ఈ వ్యయాన్ని కేంద్రం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ), ఢిల్లీ ప్రభుత్వం 50్ణ50 నిష్పత్తిలో భరిస్తాయి.