వెలుగు జిలుగుల తెలంగాణ‌

– విద్యుత్‌ సరఫరాలో నెంబర్‌వన్‌… 18,453 మెగావాట్లకు పెరిగిన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం
– 5,741 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి

– మరో మూడేండ్లలో అదనంగా 12,677 మెగావాట్లు
– కేంద్ర ప్రభుత్వం కుట్రలను, విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించాం
– తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా నవతెలంగాణతో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ రంగంలో గణనీయమైన పురోగాభివృద్ధి సాధించిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవతెలంగాణ విలేకరి ఎస్‌కె.జహంగీర్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశ దిశలా వ్యాపించిందని అన్నారు. 2014కు ముందు విద్యుత్‌ కోతలతో సహా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కోగా..నేడు మిగులు విద్యుత్‌ దశకు రాష్ట్రం చేరుకున్నదని అన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగానికి సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.36,890 కోట్లు విడుదల చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 26.96 లక్షల వరకు ఉన్నాయని… దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని సంతోషం వ్యక్తం చేశారు. కరెంటు కోతలు, పవర్‌ హాలీడేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ముగింపు ఇచ్చిందని తెలిపారు.
18,453 మెగావాట్లకు పెరిగిన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను కూడా మెరుగుపర్చిందని జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు స్థాపిత సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగిందని వెల్లడించారు. ఇప్పుడు 16 వేల మెగావాట్లకు పైగా అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ వేసవిలో 15 వేల మెగావాట్లకు పైగా డిమాండ్‌ వచ్చినా విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశామని చెప్పారు. నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంతో పరిశ్రమలు, కంపెనీలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తుండటం వల్ల కార్మికులు నిరంతరం ఉపాధి పొందుతున్నారని అన్నారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం రూ.38,070 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
మరో మూడేండ్లలో అదనంగా 12,677 మెగావాట్లు..
తెలంగాణలో పెరిగే విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిని 28 వేల మెగావాట్లకు తీసుకుపోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రామగుండంలోని ఎన్‌టీసీసీ ద్వారా 4 వేల మెగావాట్లకు కేంద్రం నుంచి ఆమోదం తీసుకున్నదని తెలిపారు. ఇప్పటికే మొదటి దశలలో 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. 4వేల మెగావాట్ల యాదాద్రి ప్లాంటు నిర్మాణ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఛతీస్‌గఢ్‌ నుంచి రెండో దశలో మరో 1000 మెగావాట్లు, సింగరేణి నుంచి మరో 800 మెగావాట్లు, సీఎన్‌జీ ద్వారా 90 మెగావాట్లు, సోలార్‌ ద్వారా 1,584 మెగావాట్లు, హైడెల్‌ ద్వారా 90 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వీటన్నింటి ద్వారా వచ్చే మూడేండ్లలో 12,677 మెగావాట్లు అదనంగా వచ్చి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2,126 యూనిట్లకు పెరిగిన తలసరి విద్యుత్‌ వినియోగం..
తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందని జగదీశ్‌రెడ్డి అన్నారు. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేదని అది 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది మరిన్ని యూనిట్ల వరకు తలసరి వినియోగం పెరిగే అవకాశం ఉందన్నారు.
యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం..
రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిని చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి అన్నారు. గతంలో కరెంటు కోతల నుంచి ఇప్పుడు మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా రెండు పవర్‌ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. భద్రాద్రిలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. 800 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం ప్లాంట్‌లోనూ ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన ప్లాంటు కూడా ప్రారంభమైందని తెలిపారు. దీనికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్‌ జెన్‌కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.
5,741 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి..
రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్‌ పవర్‌లో కేవలం 74 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉండేదని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో 5,741 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తి జరుగుతున్నదన్నారు.
కేంద్రం కుట్రల నుండి విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించాం…
తెలంగాణలో కరెంట్‌ లేకుండా చేయాలని కేంద్రం చేసిన కుట్రలను, విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. సింగరేణి ప్రైవేటీకరణ అనేది కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న సీఎం కేసిఆర్‌ సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బ తీయాలన్న కేంద్రం కుట్ర ఇందులో దాగి ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, గౌరవాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక పోతోందన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీసి.. తద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కరెంట్‌ లేకుండా చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను తెలంగాణ బలంగా అడ్డుకోవడం, మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పడంతో కేంద్రం దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందన్నారు. రాష్ట్ర అవతరణ తరువాత విద్యుత్‌ రంగంలో తెలంగాణకు పెద్ద దెబ్బ తగులుతుందన్న వాళ్లే.. ఇప్పుడు కరెంట్‌ కోతలు లేని తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న 16 ప్రధాన రాష్ట్రాల్లో సగానికి పైగా బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయన్నారు. తెలంగాణలో అప్పుడప్పుడు ట్రిప్పింగ్‌, ట్రాన్స్‌మిషన్‌ తో చిన్నపాటి అంతరాయాలు మినహా పెద్దగా కరెంట్‌ సమస్య లేదన్నారు.