వ్యవసాయ రంగంలో తెలంగాణే నెంబర్‌ వన్‌

– ఎడిక్స్‌ ఏర్పాటు చరిత్రలో కొత్త అధ్యాయం
– అగ్రికల్చర్‌ డేటా ఎక్స్చేంజ్‌
– ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి అగ్రికల్చర్‌ డేటా ఎక్స్చేంజ్‌(ఎడిక్స్‌), అగ్రికల్చర్‌ డేటా మేనేజ్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఏడీఎంఎఫ్‌)ను హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నోవాటెల్‌లో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎడిక్స్‌తో భారతీయ వ్యవసాయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కతమైందన్నారు. వ్యవసాయ రంగానికి డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా దీన్ని అభివద్ధి చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించామని చెప్పారు.
గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని, ఇప్పుడు లేవని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణ నుంచి వస్తున్నదని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించామనన్నారు. వ్యవసాయ డేటాను సరళంగా, సమర్ధవంతంగా ఉపయోగించుకు నేందుకు ఎడిక్స్‌, ఏడీఎంఎఫ్‌ రెండూ సరైన ప్లాట్‌ఫారమ్‌లేనని కేటీఆర్‌ ఈ సందర్బంగా తెలిపారు. ప్రత్యేకంగా అగ్రి సెక్టార్‌లో డేటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తోందని అన్నారు. ఆహార వ్యవస్థల పరివర్తనను నడపడానికి, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికివీలుగా ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించ డంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండిస్టియల్‌ రివల్యూషన్‌ హెడ్‌ పురుషోత్తం కౌశిక్‌ మాట్లాడుతూ ‘వ్యవసాయ రంగంలో బాధ్యతాయుతమైన ఆవిష్కరణలకు డేటా, డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థలు కీలకం. వ్యవసాయ డేటా మార్పిడి, డేటా నిర్వహణ ఫ్రేమ్‌వర్క్‌ అనేది బహుళ-వాటాదారుల శక్తిని హైలైట్‌ చేస్తుంది. వ్యవసాయ రంగంలో సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించేందుకు సంఘాలు, సమిష్టి చర్యగా కృషి చేయాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌ డైరెక్టర్‌ రమాదేవిలంక, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ చీఫ్‌ అడ్వైజర్‌ జె.సత్యనారాయణ, ఐఐఎస్‌సీ డైరెక్టర్‌ జి.రంగరాజన్‌, ఐయూడీఎక్స్‌ సీఈవో డాక్టర్‌ ఇందర్‌ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.