– మంత్రులు జగదీష్ రెడ్డి, దయాకర్ రావు
– గ్రామీణ వాతావరణంలో పల్లె ప్రగతి పండుగ
నవతెలంగాణ-కల్చరల్
గ్రామీణ వికాసంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ 30 విభాగాల్లో గ్రామ అభివృద్ధికి ప్రతి ఏటా అందించే బహుమతుల్లో 13 తెలంగాణకు రావటం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక పంచాయతీ రాజ్ సంస్కరణలే కారణమని అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం పంచాయతీ రాజ్ శాఖ నిర్వహణలో పల్లె ప్రగతి ఉత్సవాలు, గ్రామీణ నృత్య సంప్రదాయ సందడి మధ్య జరిగిన ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హాజరై మాట్లాడారు. దశాబ్ది ఉత్సావాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. కేంద్రం ప్రకటించిన 13 అవార్డుల్లో ఏడు మహిళా సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకే వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామ వికాసం అభివృద్ధి పథకాలు తెలంగాణతో పోల్చుకోవాలని హితవు చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టి కృషితో గ్రామ ప్రాంతాలు ప్రగతి సాధిస్తున్నాయని కొనియాడారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కండ్లు, చెవులు ముసుకున్న ప్రతిపక్ష నాయకులకు గ్రామాల్లోని అభివృద్ది తెలియదన్నారు. నేడు సర్పంచులు, గ్రామాధికారులు వారి హయాంలో అభివృద్ధి జరుగుతున్నందుకు గొప్ప అనుభూతి పొందుతారన్నారు. సీఎస్ శాంతి కుమారి మట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత తేడా చూడాలన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో పంచాయతీ రాజ్ చట్టం 2018 తీసుకురావడంతో గ్రామాల్లో ప్రగతి సాధ్యమైనదని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఇతర అధికారులు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.