కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధ్యం..

– కాంగ్రెస్ మోసపు మాటలతోనే తెలంగాణ ఉద్యమం ఎగిసింది
– తెలంగాణ చెట్టు తల్లి వేరు కేసీఆర్
– తెలంగాణ, కేసీఆర్ వేర్వేరు కాదు
– పీకేయడానికి కేసీఆర్ మొక్కకాదు.. వటవృక్షం
– తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు చేరిపేయడం ఎవరివల్ల కాదు
– సీఎం రేవంత్ రెడ్డి ఒక బుడర్ ఖాన్
– కేసీఆర్ ది ఫైటర్స్ ఫ్యామిలీ
– నేడు కాంగ్రెస్ ను బొంద పెట్టే బ్రహ్మాస్త్రం దీక్షా దివస్: మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జి ఫారూక్ హుస్సేన్, మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, మాజీ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కెసిఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని,కాంగ్రెస్ మోసపు మాటలతోనే తెలంగాణ ఉద్యమం ఎగిసింది అని మాజీ ఎమ్మెల్సీ, దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జి ఫారూక్ హుస్సేన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ సాధన కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివస్ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీక్షాదివస్ కర్మ,కర్త,క్రియ అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్ష దివస్ నిజామాబాద్ జిల్లా ఇంచార్జి ఫారూఖ్ హుస్సెన్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రోశయ్య వరకు అందరూ తెలంగాణ ద్రోహులే అన్నారు. దీక్ష కాంగ్రెస్ వారి మోసపు మాటలను తట్టుకోలేక తాను కాంగ్రెస్ ను వీడి కేసీఆర్ వెంట టీఆర్ఎస్ లో చేరి ఉద్యమ బాటలో పాల్గొని తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ కూడా అదే మోసపు మాటలతో తెలంగాణ ప్రజలను వంచిస్తూ మోసపు హామీలను ప్రకటిస్తూ తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేవలం తన సొంత జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని మిగితా జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలం చెల్లిందని, మళ్ళీ రాబోయేది కేసీఆర్ పాలనేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల నుంచి రైతన్నల వరకు కష్టాలు పెడుతూ వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందివ్వకుండా కనీసం వృద్ధుకు, వృద్ద మహిళలకు పెన్షన్లు అందివ్వని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నికార్సయిన పార్టీ అని, సీఎం రేవంత్ పై ప్రజలు తిరగబడుతున్నారన్నారు. ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారని, రేవంత్ రెడ్డి కి మూడింది తెలంగాణ లో చిల్లర ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. దీక్షా దివస్ రోజు మీడియా డైవర్షన్ కోసమే మంత్రులు పర్యటనలు పెట్టుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల కోసం నాడు కేసీఆర్ దీక్షతోనే నాడు కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. నాడు తెలంగాణ కాంగ్రెస్ చేతిలో బందీ అయిందని, నేడు రేవంత్ చేతిలో బందీ అయ్యిందన్నారు. 11 నెలల్లో తెలంగాణ ను అస్తవ్యస్తం చేశారని, 2027 లో జమిలీ ఎన్నికల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్ దేనని అన్నారు. గతంలో జరిగిన తప్పులు పొరపాట్లు సవరించుకుంటామని, పోలీసు కేసులకు భయపడమని, కాంగ్రెస్ నేతల కండ్లు నెత్తికెక్కాయని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మొక్కకాదని, వటావృక్షమని స్పష్టం చేశారు. తెలం గాణ, కేసీఆర్ ను వేర్వేరుగా చూడలేమన్నారు.తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ది ఎప్పటికీ చేరిపేయలేని సంతకమన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టిన దీక్షా దివస్, చరిత్రలో చెరిగిపోని సంతకమని, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన దమ్మున్న నేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన యోధుడు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29,2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిందన్నారు . ఇది స్వరాష్ట్ర కల సాకారానికి పునాది పడిన రోజు అని, కేసీఆర్ దీక్ష సూర్య చంద్రులున్నంత వరకూ నిలిచిపోయే శుభదినమన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను 36 పార్టీలను ఒప్పించి, మెప్పించి రాష్ట్రం సాధించిన గొప్ప ఉద్యమ నేత కేసీఆర్. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అదే అంధకారం వచ్చిందన్నారు.నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త మాట్లాడుతూ.. కెసిఆర్ ఇచ్చిన మాట కొరకు నిజామాబాద్ జిల్లాలోని ధర్నా చౌక్ లో వంటావార్పు నిరాహార దీక్ష, రైల్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అడ్వకేట్లు సైతం రోడ్లపై వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఉద్యమాన్ని ఆపడానికి ఆంధ్ర ప్రయత్నాలు చాలా జరిగాయని గుర్తు చేశారు. యూనివర్సిటీలోని హాస్టల్స్ బంద్ చేస్తే సొంత డబ్బులతో భోజనం అందించడం జరిగిందన్నారు. ఏ పోలీస్ స్టేషన్ కు అయితే వెళ్ళామో కెసిఆర్ దయతో ఎమ్మెల్యేగా గెలిచి అదే పోలీస్ స్టేషన్ నుంచి గౌరవ వందనం స్వీకరించామని గుర్తు చేశారు. కెసిఆర్ తో కలిసి ఢిల్లీకి వెళ్లి రెండు నెలలు అక్కడే ఉండడం జరిగిందని ఎన్నో ఆటంకాల మధ్య కేసీఆర్ తో ఉండడం జరిగిందన్నారు.
సమరోత్సవంతో దీక్షాదివస్..
జై తెలంగాణ నినాదాల హోరుతో సమరోత్సవంతో నిర్వహించిన దీక్షాదివస్ కార్యక్రమంలో గులాబీ శ్రేణులు వెల్లువలా తరలి వచ్చారు. దీక్ష దివాస్ సందర్భంగా వినాయక్ నగర్ లో గల అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దీక్షాదివస్ కర్మ, కర్త, క్రియ అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, ఫోటో ఎగ్జిబిషన్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,దీక్షా దీవాస్ ఇంచార్జ్ ఫారుఖ్ హుస్సేన్,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా,బాజిరెడ్డి గోవర్దన్,బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్,మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు,సీనియర్ నాయకులు రాంకిషన్ రావు,రాజారాం యాదవ్,అలీం,బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ కారులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.