వారసత్వ వారధి తెలంగాణ భాష

Telangana language is the bridge of heritageభాషా వైవిధ్యంతో నిండిన నేల తెలంగాణ. తన భాష, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవడంలో ప్రశంసనీయమైన మార్పును, పురోగతిని సాధించింది. ప్రతియేటా సెప్టెంబర్‌ 9న కాళోజీ జయంతి సందర్భంగా జరుపుకునే తెలంగాణ భాష దినోత్సవం ఈ నిబద్ధతకు నిదర్శనం. ఇంకా భాషాభివృద్ధిలో అనేక స్థాయిలో పలు మార్పులు జరగాల్సిన అవసరమైతే ఉంది. భాషా జాతీయీకరణ నేపథ్యంలో తెలంగాణ భాష అయిన తెలుగు ప్రత్యేకతను కాపాడేందుకు అన్ని వర్గాల నుంచి కృషి పెరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక కీలకమైన ముందడుగు తెలంగాణ పదకోశం లేదా సమగ్ర తెలంగాణ నిఘంటువు అభివృద్ధి. దీనికోసం కొంతమంది రచయితలు ప్రశంస నీయమైన ప్రయత్నాలు చేశారు. అయితే తెలంగాణ మాండలికంలోని సూక్ష్మ నైపుణ్యాలను ప్రతిబింబించే అధికార నిఘంటువు ఎంతయినా అవసరం. తెలంగాణ భాష కేవలం భాషా సంపదగా మాత్రమే కాకుండా విద్యా సంస్థలకు, పరిశోధకులకు, భాషాభిమానులకు పునాదిగా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా తెలంగాణ మాండలికం ఉపయో గంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వప్రచురణలు, వార్తాపత్రికలు, ప్రచురణలలోకి తెలంగాణ పదాలు ప్రవేశించాలి. తెలంగాణ భాషను మాధ్యమాలలోకి చేర్చడం ద్వారా, మాండలికం రోజువారీ జీవితంలో ఒక శక్తివంతమైన భాగంగా ఉండేలా చూసుకోవచ్చు. పరిపాలనా సమాచారంలో తెలంగాణ యాసను ఉపయోగించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలి. తద్వారా ప్రజల్లో తమదైన భావాన్ని పెంపొందించవచ్చు.
తెలంగాణ రాష్ట్రం అవతరణ తరువాత, తెలంగాణ భాష, సంస్కృతి వివిధ రకాల మాధ్యమాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నది. చలనచిత్ర రంగంలో ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో తెలంగాణ భాషను కేవలం హాస్య నటులు, చిన్న పాత్రలకుల పరిమితం అయినప్పటికీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సినిమారంగంలో ప్రముఖ హీరో పాత్రలలో తెలంగాణ మాండలికం వాడటం భాష ఎదుగుతున్న తీరును చూస్తుంటే కొంత అభివృద్ధి దిశగా కనిపిస్తోంది. అయితే ఇది ఒక్క సినిమాకే పరిమితం కాకూడదు. టెలివిజన్‌, వార పత్రికలు, ఇతర రకాల మీడియా స్థానిక మాండలికాన్ని స్వీకరించడం, వాటిని ప్రచారం చేయడం వంటివి చాలా అవసరం. భాష కేవలం పదాలు మాత్రమే కాదు, సమాజం సంస్కృతి, సంప్రదాయం, ఏకీకరణకు తోడ్పాటునిస్తుంది, ప్రజల మనసుకు భాష కీలకమనే విషయం గుర్తించాలి. ఈ భాషను సంరక్షించడం అంటే సంప్రదాయాలు, ఆచారాలు, జానపద కథలు, చరిత్ర గొప్పతనాన్ని రక్షించడం. అంతే కాకుండా తెలంగాణ ప్రజల ప్రత్యేక సాంస్కృతిక వ్యక్తీకరణలు, విలువలను వ్యక్తీకరించే మాధ్యమంగా పని చేస్తుంది. పైలం, పైసలు, దూప, నిరుడు లాంటి తెలంగాణ పదాలతో పేరుమోసిన కవులు గుప్పెడుమంది తప్ప తెలంగాణ భాషయాసను ఉపయోగించి సాహిత్య రచనలు చేసే వారు అరుదు. ఈ తరుణంలో తెలంగాణ భాష ఉనికి కాపాడుకోవలిసిన అవసరం అందరిపైనా ఉంది.
ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్‌ వాడుకం పెరుగుతున్నప్పటికీ బడిపిల్లలకు ప్రారంభదశలో మాతృ భాషలో బోధనా ద్వారా బాగా నేర్చుకుంటారని పలు పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలోనూ సహాయపడుతుంది. వారికి భవిష్యత్తులో అదనపు భాషలను నేర్చుకోవడానికి పునాది అవుతుంది. తెలంగాణ యాసతో కూడినటువంటి తెలుగు భాషను పాఠ్యప్రణాళికలో చేర్చి విద్యార్థుల్లో ప్రారంభ దశనుంచి భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భాషపై ఉర్దూ ప్రభావం ఉన్నప్పటికీ విభిన్నంగా దాని స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. భాషను ఉపయోగించడంలో కాళోజీకి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయన దృష్టిలో భాషా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ”బడి పలుకుల భాష” రెండవది జనం నిత్య వ్యవహారాల్లో వాడే భాష ”పలుకు బడుల భాష’, ఏ భాషకైనా ప్రాతిపదికత మండలికమే అంటారాయన. కాళోజీ కవిత్వం బలమైన సామాజిక, రాజకీయ సందేశాలను కలిగుంటాయి. ఆయన కవితలు సామాజిక అస మానత, పేదరికం, సామాన్య ప్రజల పోరాటాలు వంటి అంశాలను ప్రస్తావించాయి. ”నా గొడవ,” ”ఏకవీర”, ”కాల పూర్ణోదయం” ప్రముఖ సాహిత్య రచనలలో కొన్ని. అతని కవిత ”దేశ చరిత్రలు” (దేశాల చరిత్రలు) దేశాల బాధలు, స్థితిస్థాపకత చిత్రణకు విస్తృతంగా ప్రశంసించబడింది.
కాళోజీ వారసత్వం తెలంగాణ రచయితలు, కవులు, ఉద్యమకారులను ప్రేరేపిస్తుంది, భారతీయ సాహిత్యం, తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ప్రముఖవ్యక్తిగా చేసింది. కాళోజీ నారాయణరావు తెలంగాణ రాష్ట్రంలోని మడికొండ గ్రామంలో 9 సెప్టెం బర్‌ 1914 జన్మించాడు. అయన జన్మదినాన్ని నేడు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపు కోవడం తెలంగాణ సమాజానికి గర్వకారణం. సమగ్ర తెలంగాణ నిఘంటువును రూపొందించడం, మాండలికాన్ని అధికారికంగా ఉపయోగించడం, వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేయడం తెలంగాణ భాషా సారాన్ని పరిరక్షించడంలో కీలకమైన దశలు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, భాష అనేది కేవలం కమ్యూనికేషన్‌ సాధనం మాత్రమే కాదని గుర్తుచేసుకుందాం. అది మన వారసత్వం, గుర్తింపునకు వారధి.
(నేడు తెలంగాణ భాషా దినోత్సవం)
– దన్నంనేని సంపత్‌ కృష్ణ, 9849097835