తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు నల్లగొండ ఉమ్మడి జిల్లా కేంద్రంలోని యూటిఎఫ్ భవన్‌లో ఈనెల 3వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆరు విభాగాలుగా నిర్వహించారు. ముఖ్యంగా సాహితీ కార్యక్రమాల్లో యువతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సుమారు నెల రోజుల పాటు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీలతోపాటు మహాత్మాగాంధీ యూనివర్శిటీలోని విద్యార్థులను, ఉపాధ్యాయులను కలిసి కవితా పోటీలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 147 మంది యువతీ, యువకులు తమ కవితలను పోటీకి పంపారు. దశాబ్ది ఉత్సవాల్లోనూ పాత, కొత్త కలయికలా యువతీ యువకులతో పాటు సీనియర్ కవులు, రచయితలు సుమారు వంద మంది పాల్గొన్నారు. ఉదయం ఎలా ఉత్సాహ పూరిగంగా ప్రారంభమైందో సాయంత్రం 6గంటల వరకుఅదే ఉత్సాహంతో కార్యక్రమం జరగడం సంతోషదాయకం. కవితా పోటీల్లో విజేతలకు బహుమతులు, అందజేయడమే కాకుండా కవిసమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలు ఇవ్వడం విశేషం.
నూతన ప్రయోగాలతో తెలంగాణ సాహితి
తెలంగాణ సాహితి ఓ కొత్త ప్రయోగానికి పూనుకొంది. గతంలో ఓ అంశం ఇస్తే వారు దానిపై మాట్లాడాల్సి వచ్చేది. కానీ నేడు ఎంపిక చేసిన విధానం చాలా బాగుంది. ఎవరు రాసిన సాహితీ ప్రక్రియలపై వారినే విశ్లేషించమనడంలోనే దీనిపై ఓ స్పష్టమైన, నిర్థిష్టమైన విషయ పరిజ్ఞానాన్ని సాహితీ మిత్రులకు అందజేయాలనే ఆలోచన బాగుంది. ఎవరి అంశం వారే మాట్లాడటంతో ఆ విషయం పట్ల పూర్తి పరిపక్వత వస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది గేయాలే. సమాజంలో అసమానతలు ఉన్నాయి. సామాజిక స్పృహ లేని వారిని విజ్ఞాన వంతులుగా చేయాల్సిన బాధ్యత సాహిత్యకారులపై ఉంది. అందుకు తెలంగాణ సాహితి విద్యార్థులను ఉత్సాహ పరిచి కవితల పోటీలు నిర్వహించి, కవిసమ్మేళనం నిర్వహించి తన కర్తవ్యాన్ని నిర్వహించడం అభినందించదగింది.
– పెరుమాళ్ల ఆనంద్
పీడనకు గురైన వారి గొంతుక తెలంగాణ సాహితి
తెలంగాణ సాహితి ఏర్పడిన ఈ దశాబ్ధ కాలంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాము. లిటరరీ పెస్ట్, పాటకు జేజే.. వంటి ఆనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాము..ఉన్నతులుగా ఎదగడానికి సాహిత్యం చదవాలి. సాహిత్యం అమ్మలాంటిది. వ్యక్తి ఉన్నతిని, అభివృద్ధిని కోరుకుంటుంది. ఇప్పుడు యువత మనసుల్లో విషబీజాలు నాటుతున్నారు. వారిని చైతన్య పరిచే బాధ్యత అభ్యుదయ రచయితలు, కవులపై ఉంది. ప్రేమ, మానవత్వం ఉన్న వారే కవిత్వాన్ని రాస్తున్నారు. సమాజం సమూహం నుండి చీలి ఒంటరితనంలోకి వెళ్ళిపోవటం చాలా ప్రమాదకరం. కవులు, రచయితలు స్తబ్దత నుండి బయటపడి సరికొత్త సజనకై ఉపక్రమించాలి. అందుకోసం సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మనిషి రాను రాను ప్రేమ భావన నుండి వెదొలిగి కాటిన్యం వైపు ఆలోచించడం ఆందోళనకరం. పుట్టుక నుండి చావు వరకు పాటమనకు తోడుగా ఉంటుంది. వేదన, ఆవేదన, సుఖం, దు:ఖం అన్నిటినీ పాట రూపంలో చెప్పవచు. పాలస్తీనాపై జరుగుతున్న దాడిని మీడియా చూపడం లేదు. దానిని కవులు, రచయితలు మాత్రం కొద్ది మొత్తంలో వెలుగులోకి తీసుకొస్తున్నారు. అనేక మంది ఆకలి, ఆవేదన, అనారోగ్యంతో అలమటిస్తున్నారు. యుద్ధం వలన ప్రజల జీవనం ఛిద్రం అవుతుంది. ఇలాంటి జీవన బీభత్సాన్ని ఒక్క సాహిత్యం మాత్రమే చూపగలుగుతుంది. ఆకలి, కష్టాలు, దారిద్య్రం, సుఖ, సంతోషాలన్నీ అందరికీ ఒక్కటేననీ దానికి మతం ఉండదు. వట్టికోట ఆశ్వారు స్వామి పుట్టిన గడ్డ నల్లగొండ. ఈ గడ్డపై నుండి ఇంకా అనేక మంది కవులు, రచయితలు తయారు కావాల్సిన అవసరం ఉంది. అందుకు ఈ తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలు నాంది పలకాలి.
– కె. ఆనందాచారి
మనువాదాన్ని మరో మారు రుద్దే ప్రయత్నం
‘సమాజం- సాహిత్యం ‘ అనే అంశం పై ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ కవి, రచయిత, పరిశోధకులు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాహితి స్థాపించిన తర్వాత అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించింది. తెలంగాణ సాహితి యువరచయితలను తయారు చేస్తున్నది. సాహిత్య రంగంలో అభ్యుదయ సాహిత్యం నుంచి ఇప్పటివరకు వచ్చిన సాహితీ సంస్థలు, వాటి దష్టి కోణాలు, పరిమితులను వివరించారు. ఇన్నాళ్లు అణగారిన వారి జీవితాలపై ఆధిపత్యం చేసిన మత దురహంకారం మళ్లీ పడగా విప్పి విజంభిస్తున్నదని, ఇది సాధారణ ప్రజల జీవితాలకు ప్రమాదం అని, అందువల్ల వాటిని ప్రశ్నించే వైఖరితో రచయితలు, కవులు స్పందించాలి.. ముఖ్యంగా విద్యార్థులైన యువ రచయితలు ఈ పనికి పూనుకోవాలని తెలియజేశారు. సమాజంలో మహిళలు, దళితులు, గిరిజనులు ఇలా విభిన్న వర్గాలు, జాతుల వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో సాహిత్య ప్రక్రియల ద్వారా వెలుగులోకి తేవాలన్నారు. సాహిత్యం ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అలనాటి రాజుల కాలంలో ప్రేమ, యుద్ధాలు ఉన్నవి తప్ప ఆనాటి సాహిత్యం సామాన్యుల జీవన పరిస్థితులు కనిపించలేదన్నారు. మనువాదం ఈ సమాజాన్ని శాసించింది. సాహిత్యం మాత్రం మానవ వాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. ఇప్పుడు తిరిగి మనువాదాన్ని మరోమారు మనపై రుద్దేందుకు తీసుకొస్తున్నారు. శ్రీశ్రీ, గురజాడ వంటి వారు సాహిత్యంలో కొత్త కోణాలను వెలుగులోకి తీసుకొచ్చారు. సమాజంలో కాల క్రమంలో జరిగే పరిణామాల వల్ల విప్లవ, దళిత, స్త్రీవాద, బహుజన వాద సాహిత్యాలు వచ్చాయి. ఏ వాదమైన సమాజాన్ని చైతన్య పరచడమే లక్ష్యంగా ఉండాలి.
– సుంకిరెడ్డి నారాయణరెడ్డి
అనుభవాల్లోనుండి కథలు రావాలి
నా బాల్యం మొత్తం కష్టాల మయంగానే గడిచింది. వీధిబాలల కష్టాలు నేను పడ్డాను. చదువు మాత్రమే మన బతుకులు మార్చుతుందని అర్ధం చేసుకున్నాను. బాగా చదివి ఈ స్థాయికి వచ్చాను. నా కథ, నవలల్లో నేను ప్రస్థావించిన అంశాలన్నీ నా చుట్టూ ఉన్న సమాజంలోనివే. నేను అనుభవించిన పరిస్థితులే కథా వస్తువులుగా తీసుకొని రచనలుగా వెలుగులోకి తెచ్చాను. అందుకే నా కథల్లో అణచివేతకు గురైన వారి జీవనచిత్రణ ఉంటుంది. నేను రాసిన వాటిలో నాకు బాగా నచ్చిన కథ మీనా. – భూతం ముత్యాలు
ప్రజా సాహిత్యం ఎప్పటికీ సజీవం
సమాజంలో రెండు రకాలైన సాహిత్యాలు ఉన్నాయి. ఒకటి వ్యాపార సాహిత్యం రెండు ప్రజా సాహిత్యం. వ్యాపార సాహిత్యం అప్పటి కప్పుడు ఉత్తేజ పరచొచ్చు. ఉదృతంగా రావచ్చు. కానీ తర్వాత అది కనిపించదు. కానీ ప్రజా సాహిత్యం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. సమాజంలో నిలబడి ఉంటుంది. శ్రీశ్రీ మహాప్రస్థానం చదివిన తర్వాత నాలో ఉత్సాహం పెరిగింది. అలా సాహిత్యంపై ఆసక్తి కలిగింది. రిక్షా కార్మికునికి సంబంధించిన ఓ కథ నాలో అలజడి రేపింది. ఇప్పటికీ అది నన్ను వెంటాడుతూ ఉంటుంది. రాస్తే అలా అణగారిన వర్గాలకు సంబంధించిన కథలు రాయాలని అప్పుడే అనుకున్నాను. అలా 1987లో ఉద్యోగంలో చేరిన తర్వాత కాటిపాపల జీవితాల గురించి కథ రాసాను. ఆ కథ చదివిన చాలా మంది ప్రశంసించారు. అలా గ్రామీణ నేపధ్యం, అట్టడుగువర్గాల సమస్యలను తీసుకొని రాసిన కథలతో ‘జీవితచిత్రం’ సంకలనం తీసుకొచ్చాను. ఇలా సీరియస్ కథల వైపు నుండి బాల సాహిత్యం వైపు మళ్లడానికి కారణం సమాజంలో దోపిడీకి గురయ్యేవారు బాలలు,స్త్రీలు. బాలలు వారి సమస్యలను కూడా చెప్పుకోలేరు. వారి సమస్యలను కథల రూపంలో వెలుగులోకి తీసుకు రావడం కోసం ఇప్పటి వరకూ వెయ్యికి పైగా బాలల కథలు రాశాను. నేను రాసిన కథలను 1990లో ప్రజాశక్తి దినపత్రిక ప్రతివారం ప్రచురించి ప్రోత్సహించింది. ఆ తర్వాత నవతెలంగాణ పత్రిక కూడా కథలలను ప్రచురించడమే కాకుండా సంకలనాలుగా తీసుకొచ్చింది. – పుప్పాల కృష్ణమూర్తి
ఉత్పత్తి కులాల భాషను కవిత్వం చేయాలి
ఉత్పత్తి కులాల భాషను కవిత్వమయం చేసినప్పుడు అది జీవిస్తుంది. కవితలో చిత్రకారుడు కనిపిస్తాడు. జ్ఞానోదయం అయిన బుద్దునిలా ఉండాలి కవిత్వం. ఇప్పటికీ కవిత్వ సభలే నాకు పండుగ దినాలు. విప్లవ కవిత్వంతో మొదలై హేతువాద ఉద్యమాన్ని బలంగా ప్రచారం చేశాను. చుండూరు, కారంచేడు ఘటనల తర్వాత బహువచనం అనే కవితా సంకలనం వచ్చింది. తర్వాత ‘మేమే’, ‘మొగి’ లాంటి కవితా సంకలనాలు తీసుకొచ్చాం. గోసంగి మిత్రులమైన అంబటి వెంకన్న, దుర్గాప్రసాద్, వేముల ఎల్లయ్య లాంటి వారు దళిత, బహుజన కవిత్వాన్ని స్థానిక భాషల్లో రాశారు. కాలానుగుణంగా సాహిత్యంలో మార్పులు వస్తున్నాయి. ఎన్ని మార్పులు వచ్చిన సామాన్యుల కష్టాలను, దు:ఖాలను, బాధలను వారి భాషలో వ్యక్తం చేయగలిగితేనే కవిత్వానికి ఓ సార్థకత ఉంటుంది.
– మునాసు వెంకట్
అనుభవాల్లోంచి వచ్చే పాటలకు ఆదరణ
‘దోమలపెల్లి బడిలో చదువుకున్న విద్యార్థులం.. బతుకు బడి నేర్చుకొని మా భవితకు బాటలు వేసుకున్నం.. ఎవరికి వారు వేరై పోయి.. ఒకటిగ నేడు కలిసిన తరుణం… చెప్పన్నా నాది అనందం.. చెరిగిపోని అనుబంధం’ అని పాటను రాసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ వేదికపైకి రాలేదు. కానీ నేడు తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సాహిత్య కార్యక్రమానికి హాజరయ్యాను. 1996 నుండి సాహిత్యం అంటే ఆకళింపు చేసుకున్నాను. కథ, కవిత కన్నా పాట సామాన్య ప్రజల వరకూ వెళుతుందని నమ్మి జీవితానుభవంలో నుంచి ఎన్నో పాటలు రాశాను. తెలంగాణ ఉద్యమ కాలంలోఎన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచాను. ఇప్పుడు సమాజం విభజించబడి ఉంది. దళితులు, గిరిజనులు, అగ్రవర్ణాల వారు, వృత్తి దారులు ఇలా ఎన్నో రకాలుగా విభజించబడిఉంది. వృత్తి దారులను గౌరవించాలి. కాళోజీ సాహిత్యం, జయశంకర్‌సార్ పుస్తకాలు, మునాసు వెంకట్ వంటి వారి పుస్తకాలు చదివితే జీవితం తెలుస్తది. జీవితాన్ని అనుభవించి అనుభవంలోంచి రాస్తున్నాను. పాటను పాడటం వేరు పాటను ప్రదర్శించిడం వేరు. – అంబటి వెంకన్న,
ప్రారంభ సభకు తెలంగాణ సాహితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్దన్ అధ్యత వహించారు. ఈ సభలో గౌరవ అతిథితులుగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహనకృష్ణ, బాలసాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సృజన సాహితి ప్రధాన కార్యదర్శి సాగర్ల సత్తయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు పాల్గొన్నారు. ప్రారంభ సభ అనంతరం మొదటి సమావేశంలో ‘స్వీయ కవితల్లో వస్తువు’ అంశంపై కవి, గాయకుడు ఏభూషి నరసింహ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ప్రధాన వక్తగా ప్రముక కవి మునాసు వెంకట్ ప్రసంగించారు. ఆత్మీయ అతిథిగా కవి వేముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రెండవ సమావేశం ‘స్వీయ కథల్లో సామాజిక జీవిత చిత్రణ’ అంశంపై ప్రముఖ కథా రచయిత శీలం భద్రయ్య అధ్యక్షతన జరిగింది. ప్రధాన వక్తగా ప్రముఖ రచయిత భూతం ముత్యాలు ప్రసంగించారు. ఆత్మీయ అతిథిదిగా బాలసాహితీ వేత్త పుప్పాల కృష్ణమూర్తి మాట్లాడారు. మూడవ సమావేశం ఉనికి సాహిత్య వేదిక అధ్యక్షులు బండారు శంకర్ అధ్యక్షతన జరిగింది. ‘స్వీయ గీతాల్లో సామాజిక స్పృహ’ అనే అంశంపై ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ వాగ్గేయ కారుడు అంబటి వెంకన్న మాట్లాడారు. ఆత్మీయ అతిథిగా సృజన సాహితి అధ్యక్షులు పెరుమాళ్ల ఆనంద్ పాల్గొని ప్రసంగించారు. కవి సమ్మేళనానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ హసేన అధ్యక్షత వహించగా ఆత్మీయ అతిథిగా కవి, రచయిత మోత్కూరు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. తండు కృష్ణ కౌండిన్య సమన్వయం చేశారు. ప్రముఖ కవులు, రచయితలు విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ముఖులను సన్మానించి, మెమొంటోలతో సత్కరించారు.
– పుప్పాల మట్టయ్య