వెలుగు నీడల తెలంగాణ

సిరుల మాగాణం నా తెలంగాణ లో
అభివృద్ధి అన్నింటా కనబడుతుంది బాగుంది
కానీ అదుపు తప్పిన అవినీతి లేకుంటే బాగుండు
అలవిమాలిన అప్పులు లేకుంటే ఇంకా బాగుండు
రైతు బంధు బాగుంది …
కానీ అది భూమి ఊన్నోడికి కాకుండా
దున్నేటోడికి ఇస్తే మరింత బాగుండు
దళిత బంధు బాగుంది…
కానీ మధ్యన దళారీలు లేకుంటే ఎంత బాగుండు
ఎడా పెడా ఉద్యోగ ప్రకటనలొస్తున్నాయి – బాగుంది
కానీ కొంతమందికైనా ఉద్యోగాలొస్తే సుంత బాగుండు
సర్కారు ఆదాయం పెరిగింది – బాగుంది
కానీ అందులో సింహ భాగం
మద్యానిది కాకుంటే చాలా బాగుండు.
నేలతల్లి మెడలో హరిత హారం అధ్భుతంగా ఉంది
కానీ మేడల కోసమో, విలాసాల జాడల కోసమో
గట్టుల, గుట్టల గుండెలు చీల్చ కుంటే మరింత బాగుండు
వనరులనిచ్చి, ఒజ్జల నిచ్చి …
పాఠ శాలల రూపు రేఖలు మార్చుతున్నారు బాగుంది
కానీ పాఠం చెప్పే పంతుళ్లను బదిలీ చేసి,
మొగుడు పెళ్లాన్ని ఒక్కింట్లోనే కాపురం చేయనిస్తే మరింత బాగుండు.
పంట పొలాలు ప్లాట్లైనై, భూమి బంగారమయింది
కానీ, భూమ్మీద బతికేటోడి బతుకు సింగారమైతే బాగుండు
రక్త మోడని తెలంగాణా బహు సుందరంగా ఉంది
కానీ, రక్తాశ్రువులు శ్రవించని బడుగులు లేకుంటే ఎంత బాగుండు
ఆకాశమంత ఎత్తున విగ్రహాలు పెట్టిండ్రు – బాగుంది
కానీ, ధర్మాగ్రహాలను పట్టించుకునే నిగ్రహం
పాలకులకు ఉంటే ఎంత బాగుండు.
మరో పదేళ్ళకైనా, నా తెలంగాణ
స్వేచ్చగా, స్వచ్చంగా,
సమంగా, సమున్నతంగా ఎదిగితే బాగుండు
అమరుల ఆత్మ బలిదానాల సాక్షిగా,
తెలంగాణ ఆత్మ గౌరవ పతాకం
సముజ్వలంగా ఎగిరితే ఎంతో బాగుండు.
– కె . పరాబ్‌ కుమార్‌, 994 826 7839