తెలంగాణ రైతాంగ పోరాటం – కళా సాహిత్యాల వికాసం

Telangana Peasant Struggle - Development of Kala Sahityaతెలంగాణ ప్రపంచ చరిత్రకు పరిచయ మైంది రైతాంగ పోరాటంతోనే. బతుకులు ఎల్లీఎల్లని సామాన్యజనం బందూకులు పట్టి నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన సాయుధపోరాట చరిత్ర చరిత్రకెప్పుడూ సరికొత్తదే. అధ్యయనా నికెప్పుడూ ఉద్వేగ భరితమే. నిజాం, బ్రిటీష్‌, ప్రైవేట్‌ రజాకార్లు, గుండాల సైన్యాలకు వ్యతిరేకంగా, దేశ్‌ముఖ్‌లకు, జాగీర్దార్లకు, జమిందార్లకు తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా వీరోచిత సమరం నడిపిన భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సామాజిక పరిణామక్రమాన్ని ఆధునిక వెలుగుల వైపు పురోగమింపచేసింది. ”భారత ప్రజాతంత్ర విప్లవానికి తెలంగాణ పోరాటం డ్రెస్‌ రిహార్సల్‌ వంటిది”. అని వర్ణించాడు మాకినేని బసవపున్నయ్య.
తెలంగాణ రైతాంగ ఉద్యమ నిర్మాణంలో కళా సాహిత్యాల పాత్ర ప్రత్యేకమైంది. ‘కాల్మొక్త బాంచెన్‌’ అనేంతగా లొంగదీసుకున్న ప్యూడల్‌ వ్యవస్థను ఎదిరించేంతగా పేదజనాన్ని కూడగట్టటంలో, మేలుకొల్పటంలో సాహిత్యం, కళలు విశేషంగా వికసించాయి.పోరాటం ఎంత చరిత్రాత్మకమైందో కళాసాహి త్యాలు కూడా అంతగా చరిత్రస్థాయి నందు కున్నాయి. వర్త మానంలో కొన్ని కుసంస్కార శక్తులు తెలంగాణ పోరాట చరిత్రను తారుమారు చేసి, వక్రీకరించి, ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆ ప్రయత్నాల్ని విఫలం చేయగల ఆధారాల్లో కళాసాహిత్యాలే కీలకం. నిజాం సంస్థానం నాటి స్థితి గతులకు, క్రమ పరిణామాలకు అద్దం పట్టేవి, సాక్ష్యంగా నిలిచేవి చరిత్ర గ్రంథా లతో పాటు కళాసాహిత్య రూపాలే. చరిత్రను తమ కోణంలోంచి మార్చి తిరగ రాసుకోగలరేమో కాని – కళా సాహి త్యాల్ని మార్చటం, తిరగరాయటం ఎవరికీ సాధ్యం కాదు.
తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపువల్ల వివిధ భాషల్లో ఉద్వేగ భరితమైన సాహిత్యం వెలువడింది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల, కన్నడ, మరాఠీ, మళయాళ భాషల్లో సాయుధ పోరాట ప్రభావంతో రచనలు రావడం విశేషం. తెలుగులో యాభైకి పైగా కథలు, పదహారు నవలలు, పదిహేను నాటకాలు, ఇరవైకి పైగా కవితా సంకలనాలు, నాలుగు కావ్యాలు, తొమ్మిది పాటల సంకలనాలు, ఎనిమిది బుర్రకథలు, కళాప్రదర్శనలు ముప్పయి దాకా ఆత్మకథలు వచ్చాయంటే పోరాటం యొక్క ప్రత్యేకత, నిరంతరత, ప్రజల ఆదరణ స్పష్టంగా తెలుస్తుంది. వీటన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించడం, లోతుగా విశ్లేషించడం గతం నుంచి నడిచివచ్చిన పరిణామ క్రమాన్ని, కళాసాహిత్యాల్ని ఎప్పటికప్పుడు వర్తమానంలోకి ప్రసరింపజేయటం సులువైన పనికాదు.
నిజాం సంస్థాన కాలంలో ఫ్యూడల్‌ దొరల చేతుల్లో ప్రజలు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. వేలాది ఎకరాల భూములు ఆధీనంలో ఉంచుకొని దేశముఖ్‌లు, జాగీర్దార్ల దౌర్జన్యాలకు లెక్కలేదు. గడీలకు బారాఖూన్‌ మాఫ్‌. పన్నెండు హత్యల వరకు అడిగేవాడు లేడు. భూమిలేమి, వెట్టిచాకిరి, అడ్డగోలులెవీ, రకరకాల మాల్గుజారి పన్నులు, షాదిపట్టి, సమర్తపట్టి, బైస్‌పట్టి, పుడితే, చస్తే పన్ను, చుట్టాలు వస్తే, పోతే పన్నులు తలచుకుంటేనే భయమేసే ఎనభై రకాల పన్నులు, వీటికి తోడు చదువులేకపోవటం నిజంగా చీకటి బతుకులు. అచ్చంగా బానిసజీవితాలు. భరించలేక రోదన. పంటచేను, పాడిఆవు, పడుచు బిడ్డ ఉంటే పాపం. అన్నీ దొరల పాలే. మనుషులు, కోళ్లు, గొర్లు, సరుకులు వెట్టికింద సమర్పించుకోవాలి.”హైదరాబాద్‌ సంస్థానం బందిఖానాను పోలి ఉండేది” అని వర్ణించాడు రాజ్‌ బహుదూర్‌ గౌర్‌.
హైదరాబాద్‌ సంస్థానంలో 1921 లో మొదలైంది వెలుగు. భాషా చైతన్య ంతో ‘ఆంధ్రజనసంఘం’ ఏర్పడింది. ఆ క్రమంలో వర్తకసంఘం, రైతుసంఘం, గ్రంథాలయోద్యమం, అట్లావిస్తరించి 1930లో ‘ఆంధ్ర మహాసభ’ ఆవిర్భవిం చింది. వరుససభల్తో వరుస పనుల్తో అది ‘సంఘం’గా ప్రజల గుర్తింపు పొందింది. మరొక పక్క ఆర్యసమాజం కార్యకర్తలు, ఆ వెనుక స్టేట్‌ కాంగ్రెస్‌, భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థానంలో అడుగుపెట్టి ప్రజల్లో అల్లుకుపోయాయి. భువనగిరి సభలనాటికి ‘ఆంధ్రమహాసభ’ను అతివాదులు అందుకున్నారు. కడవెండి ప్రజల ఊరేగింపులో దొడ్డికొమురయ్య అమరత్వం తర్వాత ‘గుత్పలసంఘం’ అవతరించింది. చిట్యాల అయిలమ్మ పోరాటం భూమీ, పంట స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రజల్లో ధైర్యసాహసాలు వెల్లవెత్తాయి. కొద్దిరోజుల్లోనే సాయుధ పోరాటం ఊపందుకున్నది. ఎటువిన్నా ప్రజల్లో పోరాటపటిమ. ఎటుచూసినా జనబాహుళ్యంలో ”సంఘం” ఒక్కటే. పశువుల కాపరిని ”చదువెందుకు” అని అడిగితే – ”చదువు సంఘం కరపత్రాలు చదువుకోవటానికి” అని సమాధానమిచ్చేంతగా సంఘం చైతన్య పరిచింది. ”సంఘం” తెలంగాణ పోరాట సంకేతం.
ప్రజల్ని మేల్కొల్పటంలో, చైతన్య పరచటంలో, పోరాట భావనలు పెంపొందించటంలో పత్రికల పాత్ర స్మరించవలసిందే. ఒద్దిరాజు సోదరులు నడిపిన ‘తెనుగు’ పత్రిక, సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన గోలకొండ పత్రిక, మందుమాల నరసింగరావు సంపాదకత్వంలో రయ్యత్‌, అడవి బాపిరాజు సంపా దకత్వంలో ‘మీజాన్‌’, షోయబుల్లాఖాన్‌ సంపాదకత్వంలో ‘ఇమ్రోజ్‌’ ఉర్దూపత్రికలు, కాకతీయ, భాగ్యనగర్‌, దేశబంధు, షౌకత్‌ ఇస్లాం వంటి పత్రికలు వార్తలు, వివరాలతో పాటు కథలు, కథనాలు, కవితలు, పాటలు ప్రచురించాయి. పత్రికల వైఖరి మీద కన్నెర్ర చేసిన ఉస్మానలీ ‘ఎకరార్‌నామా’ పద్ధతితోపాటు నిషేధ చట్టాలు తీసుకొచ్చాడు. గస్తీనిషాన్‌-53, రాజద్రోహ నేరం, ప్రజారక్షణచట్టం, హైదరాబాద్‌ రక్షణచట్టం పేర్లతో కళా సాహిత్యాలను, పత్రి కలను, ప్రచురణ సంస్థలను, పుస్తకాలను నిషేధించాడు. అయినా సాహిత్యం ప్రజలను చేరుకున్నది. ప్రచురణలు ఆగలేదు. ప్రదర్శనలు ఆగలేదు.
అణాగ్రంథమాల అణాకొక గ్రంథం అందించింది. దేశోద్ధారక గ్రంథమండలి, ప్రత్యూష ప్రచురణలు, ఆంధ్రకేసరి గ్రంథమాల, స్వశక్తి గ్రంథమాల మరెన్నో సంస్థలు పుస్తకాలు ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఆంధ్ర సారస్వత్‌ పరిషత్‌ కవిసమ్మేళనాలు ప్రజలకు చేరువయ్యాయి.
”ఓ నిజామూ పిశాచమా… నా తెలంగాణ కోటి రత్నాల వీణ”, ”రైతుదే-తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబుదక్కునే” అని దాశరథి అగ్నిధార కురిపించాడు. ఇది పండితుల్ని పామరుల్ని ఆకట్టుకున్నది. ప్రకృతి, పల్లెలు, కూలీలు, సహకరించక పోతే ‘ప్రభువులెట్లా ఏలుతారో చూద్దామని’ పొట్లపల్లి రామారావు పిలుపు నిచ్చాడు. నలుగురు కలిసిన దగ్గరల్లా పాటలు అల్లుకున్నాయి..”పల్లెటూరి పిల్లగాడా, పసులగాచే మొనగాడా” జీతగాళ్ల కన్నీటి గాధలు సుద్దాల హనుమంతు గానం చేశాడు. వెట్టి కథలు పాడుతుంటే ప్రజలు తమ కష్టాలు తడుముకుని, కారణాలు తెలుసుకున్నారు. ప్రజలు తండోపతండాలుగా కదిలారు. గడీలు విడిచిపెట్టి దొరలు పరారీ కాకతప్పలేదు. అప్పుడూ పాటే ”బండెనక బండికట్టి పదహారు బండ్లుకట్టి ఏ బండ్లెపోతవు కొడుకో, నా కొడుక ప్రతాపరెడ్డి” అంటూ వెంటపడ్డారు జనం. పాటరాసిన యాదగిరి బండి యాదగిరయి బందూక్‌ పట్టాడు. కొమరయ్య అమరు డయ్యాడు. ‘అమరజీవివి నీవు కొమురయ్యా’ అని పాడుకున్నారు ప్రజలు. పోరాటం పెరిగిన కొద్దీ నిర్భంధం పెరిగింది. దొరలు నిజాముకు ఫిర్యాదయ్యారు. నిజాం సైన్యాలు, రజాకార్లు పల్లెల మీద పడ్డారు. గృహదహనాలకు, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ”నల్లగొండలో నాజీ శక్తుల నగ నృత్యమింకెన్నాళ్లు?” అని కాళోజీ ధైర్యంగా పోలీసుల్ని నిలదీశాడు.
తెలంగాణలో జరుగుతున్న ప్రజాపోరాట ప్రకంపనలు పొరుగు రాష్ట్రాన్ని సైతం కుదిపివేశాయి. ఆరుద్ర ‘త్వమేవాహం” రాస్తే కుందుర్తి ”తెలంగాణ” రాశాడు. సోమసుందర్‌ ”వజ్రాయుధం” ఝుళిపించాడు. గంగినేని వెంకటేశ్వరరావు స్వయంగా సాయుధపోరులో పాల్గొని యుద్ధరంగం నుంచి ప్రియురాలికి బహిరంగలేఖ రాస్తూ ”మహావిప్లవ విజయోత్సవం నాడు మన వివాహ మహోత్సవం జరుపుదాం” అన్నాడు.
తెలంగాణ పోరాటాన్ని ఆవాహన చేసుకొని హరీంద్రనాథ్‌ ఆంగ్లంలో దీర్ఘ కవిత రాస్తే ఫైజ్‌ అస్మద్‌ ఉర్దూలో కవిత రాశా డు. మగ్దుం ఉద్యోగం విడిచి పోరాటంలో కలిసి తెలం గాణను కవిత్వీకరించాడు.గద్దెలింగయ్య సంకలనం చేసిన పాటల పుస్తకం ‘క్రాంతిగీతాలు”,మరాఠీ పాటల పుస్తకం ”సావదా” రెండింటిని నిజాం ప్రభుత్వం నిషేధించింది. సుంకర సత్యనారా యణ రాసిన గెరిల్లా శతకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.
రైతాంగ పోరాట అవసరాలకనుగుణంగా ప్రజల్ని విప్లవీకరించడానికి ప్రదర్శనాకళలు ముందుకొచ్చాయి. తెలంగాణలో శారద కథ జానపద కళారూపం కథ మార్చి రేణికుంట రామిరెడ్డి అమరత్వాన్ని గానం చేశారు. శారద కాళ్లు రజాకార్‌ ఆకృత్యాలు వర్ణిస్తూ ‘రజాకార్లు’ కథ, ఆరుట్ల రామచంద్రారెడ్డి సాహసగాథ, కళగా ప్రదర్శించారు.
శారద కథ, జంగం కథ, జమాకుల కథ రూపాలు మేళవించి ”బుర్రకథ” ముందుకొచ్చింది. సుంకర సత్య నారాయణ ”కష్టజీవి”, ”తెలంగాణ” బుర్రకథలు రచించాడు. షేక్‌నాజర్‌ బుక్రరకథకు కొత్త సొగసులు అద్ది కొత్త రాగాలు కూర్చి ఉన్నతీ కరించాడు. విశేషాదరణ లభించింది. ‘బండ్లనిండాజనం’ బుర్రకథను అటు మద్రాస్‌ ప్రభు త్వం, ఇటు నిజాం ప్రభుత్వం నిషేధించింది. తిరునగరి రామాంజనేయులు పోరాటంలో భాగస్వామిగా మారి దాన్ని ”హరికథ”గా మార్చి ”తెలంగాణ వీరయోధులు” కళారూపం ప్రదర్శించాడు. ఎక్కడికక్కడ సంచార రాజకీయ బృందాలు బయలుదేరి వివిధ కళారూపాలు రహస్య బుర్రకథలు ప్రదర్శించాయి.
సుంకర సత్యనారాయణ బుర్రకథ ‘వీల్లేదుగనుక’ నాటకరూపం రూపొందించాడు. ”ముందడుగు” ”మాభూమి” నాటకాలు రచించి ప్రదర్శింపజేశాడు. మాభూమి బందగీ ఇతివృత్తంతో మొదలై సంఘం అండతో యువకుల పోరాటం, అమరత్వంతో ముగుస్తుంది. 130 బృందాలు ‘మాభూమి ” నాటకాన్ని రెండువేల ప్రదర్శనలు ఇవ్వటం విశేషం. ఆ తర్వాత మరో పదిహేను నాటకాలు వచ్చాయి. అమిత ప్రజాదరణ పొందాయి. విలీనానంతరం నెహ్రూ పటేల్‌ సైన్యాలు మరింత విధ్వంసం సాగించాయి. నిరసనగా ‘నెహ్రూ భారతం’ నాటిక ప్రదర్శించారు.
తెలుగులో విద్యా పరిమితులను ప్రభావితం చేయటం కథ నవల ప్రధానమైనవి. పి.వి.నరసింహరావు ‘గొల్లరామయ్య’, ఆవుల పిచ్చయ్య ”ఊరేగింపులు”, ”వెట్టిచాకిరి దినచర్య”, కేశవ స్వామి ”యుగాంతం”, ఉప్పల లక్ష్మణ రావు ‘గెరిల్లా’, ఆళ్వారు స్వామి ‘అంతా ఏకమైతే’ వంటివి యాభైకి పైగా కథలు ప్రాచు ర్యం పొందాయి. వట్టికోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’, దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్లు’, ‘జనపదం’, తిరునగరి రామాంజ నేయులు ‘సంగం’, మహీధర రామ్మోహన్‌ రావు ‘రథచక్రాలు’, లక్ష్మీకాంతమోహన్‌ ‘సింహగర్జన’ నవలలు ప్రభావితమైనవి. ప్రఖ్యాత రచయిత కిషన్‌చందర్‌ ఉర్దూలో రచించిన ‘జబ్‌ ఖేత్‌ జాగే’ నవలకు తెలంగాణ పోరాటమే ఇతివృత్తం.
‘చిల్లరదేవుళ్లు’ నవల ఆధారంగా అదే పేరుతో వచ్చిన సినిమా, ‘జబ్‌ ఖేత్‌ జాగే’ ఆధారంగా బి. నరసింగరావు తీసిన ‘మాభూమి’ సినిమా, ఆర్‌.నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘వీర తెలంగాణ’ వంటివి తెలంగాణ పోరాట ఇతివృత్తంతో వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. బందూక్‌, జైబోలో తెలంగాణ, ఇంకెన్నాళ్లు, రాజన్న, మనసు మాంగళ్యం, సినిమాలలో పోరాటం పాక్షికంగా భాగమైంది. ఇటీవల ‘రజాకర్‌’ సినిమా పోరాట గాధను వక్రీకరించే ప్రయత్నం చేస్తే తిరస్కరించటం తెలంగాణ సమాజ పరిణతికి నిదర్శనం.
సాయుధ పోరాట కాలం నాటి అరుదైన సన్నివేశాల్ని, శిక్షణా దృశ్యాల్ని ప్రముఖ ఫొటో జర్నటిస్ట్‌ సునీల్‌ జనా ఛాయాచిత్రాల్లో ఎక్కించి శాశ్వతత్వం చేకూర్చాడు. ఇవాళ అందుబాటులో ఉన్న ఫొటోలు అవే. అదే విధంగా ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్‌ భట్టాచార్య నాటి పోరాట దృశ్యాల్ని రేఖా చిత్రాలుగా రచించి మాస్కో, అండన్‌ మ్యూజి యాల్లో భద్రపర్చాడు. కాగా-నాటి చిత్రకారుడు యం.రంగా చారి పోరాట చిత్రాలు గీస్తూ పార్టీ సంబంధాలు కొరియర్‌గా పనిచేస్తూ పట్టుబడి అమరుడయ్యాడు. ఆయన చిత్రాలు మాస్కోలో ఉన్నట్లు తెలుస్తున్నది. పోరాటం ఆగినా కళాసాహిత్యాలు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. కళా సాహిత్యాలకు జీవం పోసి చారిత్రక విలువను సమకూర్చి పెట్టిన తెలంగాణ పోరాటం తెలుగుజాతికి గర్వకారణం.కళా ప్రమాణాలతో పోరాటానికి శాశ్వతత్వం చేకూర్చిన కళాసాహిత్యాలు జాతికి తరగని సంపద.
– నందిని సిధారెడ్డి