తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌కు సై

Sai for Telangana Premier League– ప్రతి జిల్లాకు రూ. 1 కోటి అభివృద్ది నిధులు
– హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌: ప్రతిభావంతులైన గ్రామీణ యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌)ను నిర్వహిస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వెల్లడించారు. గ్రామీణ క్రికెట్‌ అభివద్ధికి ప్రతి జిల్లాకు రూ. 1 కోటి నిధులు ఇవ్వనున్నారు. శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జగన్‌మోహన్‌ రావు అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశమైంది. ‘క్రికెట్‌ అభివద్ధికి హెచ్‌సీఏ కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఐపీఎల్‌ ముగిశాక టీపీఎల్‌ నిర్వహణ ప్రక్రియ మొదలెడతాం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో క్రికెట్‌ అభివద్ధికి రూ.1 కోటి నిధులతో మౌళిక వసతులు కల్పించనున్నాం. ఈ సీజన్‌లో సత్తా చాటిన ఉత్తమ క్రికెటర్లకు హెచ్‌సీఏ అవార్డులు ఇవ్వనుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు త్వరలో టెండర్లను పిలవనున్నాం’ అని జగన్‌మోహన్‌ రావు తెలిపారు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ భారత జట్టుకు మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌ను సహచర అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు అభినందించారు. ఉపాధ్యక్షుడు ఎస్‌.దల్జిత్‌ సింగ్‌, కార్యదర్శి ఆర్‌.దేవ్‌రాజ్‌, కోశాధికారి సీజే శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి టి.బసవరాజు, కౌన్సిలర్‌ కె.సునీల్‌ అగర్వాల్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది మార్చిలో వార్షిక అవార్డుల వేడుక, వార్షిక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేయనున్నారు.