
నవతెలంగాణ నసురుల్లాబాద్
అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు లో రాష్ట్రం ఆదర్శంగా నిలసిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా గురువారం బాన్సువాడ గ్రామీణ మండలం కొల్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను శాలువతో సన్మానించిన స్పీకర్. అభివృద్ధి లో భాగంగా కొల్లూరు గ్రామంలో రూ. 60 లక్షలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 6 అదనపు తరగతి గదులను , 20 లక్షలతో నిర్మించే సిసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నాగారం గ్రామంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనానికి, రూ. 5 లక్షలతో నిర్మించే ముదిరాజ్ సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలలో దేశంలోఅగ్ర స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. గ్రామాలలో అభివృద్ధి, మౌళిక సౌకర్యాల కల్పన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులను మంజూరు చేస్తుందన్నారు. 2004 నుండి 2014 వరకు గత ప్రభుత్వాలు గ్రామాలలో మౌళిక వసతుల కోసం రూ. 12, వేల కోట్లు ఖర్చు చేస్తే , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలలో 58 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీళ్ల సరఫరా ట్యాంకర్ పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం, వైకుంఠ దామాలు, నూతన గ్రామ పంచాయతీ భవనాలు, 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, ఇందులో 4.70 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. పక్కన ఉన్న మహారాష్ట్ర లో రూ. 1000, కర్ణాటక రూ. 600, గుజరాత్ లో రూ. 600, ఉత్తరప్రదేశ్ రూ. 400, పశ్చిమ బెంగాల్ రూ. 1000 మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో 80 ఏళ్ళు దాటితే మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి కళ్యాణలక్ష్మీ , షాదీముబారక్ పథకం ద్వారా నగధు సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గర్భవతి లకు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నాము. డెలివరీ తరువాత తల్లి, బిడ్డలకు అవసరమైన 14 రకాల వస్తువులను కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. గురుకులాలలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయని అన్నారు. నియోజకవర్గంలో పేదల కోసం 100 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఇందులో కిరాయి కేవలం అయిదు వేల రూపాయలు మాత్రమే అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు11 వేల డబుల్ బెడు రూముల నిర్మాణం లో ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అదనంగా 300 తరగతి గదులు నిర్మించామన్నారు. 150 అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, బాన్సువాడ ఆర్డీఓ రాజా గౌడ్, డిఎస్పీ జగన్నాధ రెడ్డి, మండలాధ్యక్షురాలు దొడ్ల నీరజావెంకట్రాంరెడ్డి, గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్థులు, విద్యార్థులు. తదితరులు పాల్గొన్నారు.