– ప్రజాస్వామ్య పరిరక్షణ..
– ఉద్యమ స్ఫూర్తే ఇతివృత్తంగా ప్రదర్శనకు సిద్ధం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ‘స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి’ ఇతివృత్తంతో తెలంగాణ శకటం సిద్ధం అయింది. 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో జనవరి 26న కర్తవ్య పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించనున్నారు. నిరంకుశ విధానాలు, రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన ఎన్నో ప్రజా ఉద్యమాలను గుర్తు చేస్తూ రూపొందించిన శకటం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నది. దాదాపు మూడేండ్ల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015, 2020 సంవత్సరాల అనంతరం ఈ సంవత్సరమే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే మరో రెండేండ్ల పాటు కూడా తెలంగాణా శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. నిరంకుశ విధానాలు, రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి. దీనిలో భాగంగా కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులు ఎందరో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వయం పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణకై తమ తమ పంథాలో పోరాటాన్ని చేశారు. ఈ స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి తెలియచేసే విధంగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలో ప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాతో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోడ్పాటుతో అతి స్వల్ప సమయంలో ఈ శకటం ఏర్పాటైంది.
కొమురంభీం, రాంజీ గోండ్, చిట్యాల ఐలమ్మల వీరోచితమైన పోరాటాలు ఈ ప్రాంత సామాన్య ప్రజల జీవితాలపై అత్యంత ప్రభావాన్ని చూపాయి. వీరి పోరాటాలు జానపద కళలు, సాహిత్యంలోనూ ప్రతిబింబించాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ విప్లవకారులు స్వయం పాలన, ప్రజల ప్రజాస్వామ్య (లోక్ తంత్ర) పునరుద్ధరణ, మా భూమిలో మా రాజ్యం అంటూ చేసిన వీరోచిత పోరాటాలు ఇక్కడి పౌర సమాజానికి ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య పోరాట వారసత్వాన్ని అందించాయి. ఆదివాసీ గిరిజనుల స్వేచ్ఛ, గౌరవం, హక్కుల కోసం కొమరంభీం, రాంజీ గోండ్‌లు పోరాటాలు చేశారు. వారి లక్ష్య సాధన కోసం తమదైన పద్ధతుల్లో గెరిల్లా యుద్ధ వ్యూహాలను అవలంబించారు. ”జల్, జంగల్, జమీన్” (నీరు, అటవీ, భూమి) అనే నినాదాలతో పోరాటాలు చేశారు. రైతులు, రైతు కూలీలపై భూస్వాములు చేసిన దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మగా పిలువబడే చిట్యాల ఐలమ్మ చేసిన పోరాటం అమోఘమైనది. అచంచల సంకల్పంతో, అట్టడుగు వర్గాల తోడ్పాటుతో భూస్వాములను ఎదుర్కొనడం ద్వారా సామాన్య గ్రామీణులలో అవసరమైన ధైర్యాన్ని కల్పించింది. ఈ వీరోచిత పోరాట యోధుల త్యాగాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ప్రస్తుత సమాజంలో అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేందుకు, అందరికి సమ న్యాయం అందేందుకు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాలు పునాదులు వేసాయి. సామాజిక, ఆర్థిక న్యాయం, గౌరవనీయమైన జీవనం, అవకాశాల కల్పన, వ్యక్తిగత గౌరవాలు పెంపొందించేలా చేశాయి. సమకాలీన కాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామసభలు, గ్రామ పంచాయితీల ఏర్పాటుకు దారితీసింది. గిరిజనులకు అధికారాలను అందించింది. ”జల్, జంగల్ జమీన్” నినాదంతో అట్టడుగు వర్గాల భూములకు రక్షణ కల్పించడం జరిగింది. ఈ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, అట్టడుగు వర్గాల్లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించేలా తెలంగాణా ప్రభుత్వ నిబద్ధతకు ఈ శకటం ప్రత్యేకంగా నిలవనున్నది.