తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌ 2024-25 : పది సూచనలు

తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌ 2024-25 : పది సూచనలుకొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణా బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. మొదటనే చెప్పాలంటే ఇది పర్యావరణ అనుకూల బడ్జెట్‌ కాదు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఉన్న బడ్జెట్‌ అని ఆర్థిక మంత్రి చెప్పినా ‘అభివృద్ధి’కి బలి అయిన సమాజ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో ఎట్లాంటి నిధులు లేవు.ఆ ‘అభివృద్ధి’ మార్గంలో పయనిస్తున్న ఈనాటి సర్కార్లు దానికి సమిధలు అవుతున్న బడుగు, బలహీన వర్గాల గురించి, వారికీ జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న నష్టాల గురించి, కష్టాల గురించి పట్టించుకోవడం లేదు.
అటవీ పర్యావరణ శాఖకు కేటాయింపులు ఇదివరకంటే తగ్గాయి. హరిత హారం వన మహోత్సవంగా నామకరణమైంది. దీనికి కేటాయిం పులు ఏనాడో అటకెక్కినాయి. అడవులు పెంచడానికి, చెట్ల పెంపకానికి, మొక్కల నాటడానికి, పచ్చదనం విస్తృతం చేయడానికి వంటి కార్యక్రమాలకు తగిన నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల ఎండలకు, వేడికి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు విరుగుడు మార్గాలలో ఒకటి అటవీ విస్తీర్ణం పెరగడం. వన్యప్రాణులు, ఎక్కువగా కోతులు, జింకలు, చిరుతలు, పులులు, ఇంకా ఇతర జంతువులు, తరుచుగా వ్యవసాయ క్షేత్రాలలో తిరగడం వల్ల రైతులు ఆహార పంటలను మానుకోవడమే కాకుండా కొందరు వ్యవసాయమే మానేయాల్సి వస్తుంది. తెలంగాణా అడవుల కింద భూమి విస్తీర్ణం తగ్గిపోతున్న దరిమిలా, ఉన్న అడవులలో ఆహారం, నీళ్లు దొరక్క వన్యప్రాణులు బయటకు వస్తున్నాయి. బడ్జెట్‌లో అడవుల పునరుద్ధరణకు కేటాయింపులు పెరిగితే వివిధ గ్రామీణ ఉపాధి, ఆహార ఉత్పత్తి మీద సానుకూల ప్రభావం ఉంటుంది. అడవుల్లో చెంచులను, కోయలను, ఇంకా ఇతర ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయించడానికి వెనుకాడని అటవీ శాఖ అటవీ భూమి పరిరక్షణకు తగిన నిధులు లేవు అంటున్నది. సిబ్బంది సరిపోతలేరు అంటున్నది. అడవుల్లో జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి కారణాల మీద ఆధ్యయనాలు లేవు. పట్టణ ప్రాంతాలలో ఉన్న అటవీ భూములకు కబ్జాల నుంచి రక్షణ లేదు. అడవి ఒక వనరు. దాని నుంచి వచ్చే సహజ ఉత్పత్తులు జి.డి.పికి దోహదపడవచ్చు. తెలంగాణా ఆర్థిక రంగానికి, సర్కారు ఆదాయానికి అడవులను సుస్థిరంగా ఉపయోగించుకునే ఆలోచనలు రావాలి.
తెలంగాణా ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత అనేక ప్రాజెక్టుల కోసం గ్రామాల్లో వ్యవసాయ భూమి సేకరణ జరిగింది. ఈ భూసేకరణ సరైన పద్ధతుల్లో జరగలేదు. భూములు కోల్పోయిన రైతులు, స్వచ్చందంగా భూములిచ్చిన రైతుల పట్ల గతంలో అమానవీయ స్పందన సర్కార్‌ నుంచి వచ్చింది.త్యాగమూర్తులు అని ఓవైపు పొగుడుతూ వారి జీవనాన్ని స్థానభ్రంశం చేసి తగిన విధంగా పునరావాసం కల్పించలేదు. వీళ్లే కాదు గ్రామాలు మొత్తం ఖాళీ చేసి వెళ్లినా భూమి లేని కుటుంబాలకు కూడా న్యాయం జరగలేదు. అసలు తెలంగాణా రాష్ట్రంలో పునరావాసం మీద ఒక విధానమే లేదు. తెలంగాణా బడ్జెట్‌లో గత పదేండ్లుగా ప్రాజెక్టుల ఏర్పాటుకిచ్చిన ప్రాముఖ్యత ఈ ప్రాజెక్టులకు భూములిచ్చి, ఊర్లు ఇచ్చి, ఇండ్లు వాకిలి వదిలిపెట్టిన కుటుంబాల పునరావాసానికి ఏమీ ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వ బడ్జెట్‌లో కూడా నిర్వాసితులు అయిన కుటుంబాలకు, నిర్వాసితులు కాబోతున్న కుటుంబాలకు తగిన నష్ట పరిహారం, పునరావాసానికి నిధులు కేటాయించలేదు. ప్రస్తావన అసలే లేదు.
గ్రామీణ ఉపాధికి, సుస్థిర అభివృద్ధికి నిధులు లేవు. గ్రామీణ ఉపాధిలో కీలక పాత్ర పోషించే చేనేత, పశుపోషక, మత్స్య, వస్తు ఉత్పత్తి వర్గాలకు ప్రత్యక్ష కేటాయింపులు అవసరం. కులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి, అసలు గ్రామీణులకు బడ్జెట్‌ కేటాయింపులు ఎగ్గొట్టిన ఘనత గత ప్రభుత్వానిది. వ్యవసాయ కూలీల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఉపాధి హామీ పథకం డొల్ల అవుతున్నది. వాణిజ్య పంటలు విస్తఅతం అయినందుకు రైతు కుటుంబాలకు, ఇతర భూమి లేని కుటుంబాలకు ఆహారం దొరకడం లేదు. గ్రామాలలో పంటలు మినహా ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. వైవిధ్యం గల ఆహారం అందుబాటుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాలలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇంకా ఇతరులు కొంత పరిణతి చూపించి గ్రామీణ ప్రాంతాలలో సంతోషంగా జీవించగలిగే వాతావరణ అభివఅద్ధికి నిధులు ఇస్తూ, క్రమంగా పెంచాలి.
ఈ ఏడాది బడ్జెట్‌ గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉన్నట్టు కనపడ్డా సర్కారుకు వస్తున్న ఆదాయం పైన భారం కొనసాగుతున్నది. గత అప్పులు, అప్పుల కోసం తాజా రుణాలు, ఆరు గ్యారెంటీలు (హామీల), ఆరు హామీల వ్యవధి గురించి అనిశ్చితి, చేస్తున్న రాజీలు, ‘చెడు’ మార్గాల నుండి నిరంతర ఆదాయాన్ని పొందడం వంటి కనపడని విషయాల పట్ల ఆందోళనలైతే ఉన్నది. మద్యం, మైనింగ్‌ వంటి ఆదాయ మార్గాలు సమాజాన్ని, పర్యావరణాన్ని గుల్ల చేస్తాయి.ఈ మార్గాల ఆదాయం గురించి సమీక్ష చేయాలి. ఎల్లకాలం ఇటువంటి పద్ధతుల ద్వారా వచ్చే ఆదాయం మీద ప్రభుత్వం ఆధారపడటం భావ్యం కాదు. పర్యావరణం, వాతావరణ మార్పుల (క్లైమేట్‌ చేంజ్‌) గురించి ప్రస్తావన లేదు. వాటి వినాశనం వల్ల, అధిక వర్షాల వల్ల, అధిక ఉష్ణోగ్రతల వల్ల కోల్పోయిన ప్రాణాలు, ప్రాప్తిస్తున్న అనారోగ్యం పట్ల ప్రభుత్వ దృష్టి లేదు. ఇది దార్శనిక బడ్జెట్‌ కాదు. నిరంతరంగా ఆహారం, నీరు, జీవనోపాధికి సహాయపడే సహజ వనరుల మూలధన నిర్మాణం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది.
ఈ బడ్జెట్‌లో ఆందోళన కలిగించే విషయాలు అనేకం ఉన్నాయి. ఒకటి: రైతాంగానికి అవసరమైన రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకాలు. ఈ నగదు పథకాలు ఎన్నాళ్లిస్తారు?వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా కింద రూ.906 కోట్లు కేటాయించారు. భరోసా అంటూ కేవలం నగదు ఇవ్వడంతో సరిపోదు. తగిన ప్రోత్సాహక విధానాలు రావాలి. రెండు: ప్రభుత్వ నిధులు, పెట్టుబడులు అసమానతలను పెంచే అభివృద్ధికి దారితీయడం. మూడు: అప్పుల భారం తీర్చే మార్గం గురించి ప్రస్తావన కాని ఆలోచనలు కాని ఆర్థిక మంత్రి ప్రసంగంలో చెప్పలేదు. ఇప్పటికే చేసిన అప్పులు, ఆ అప్పులు, వాటి వడ్డీలు తీర్చటానికి చేస్తున్న, చేయబోతున్న అప్పులు, వెరసి అప్పుల మీద ఒక ప్రత్యేక బడ్జెట్‌ పుస్తకం ప్రచురించి, అవి తీర్చే మార్గం గురించి ఆలోచించాలి. శాసనసభ్యుల సలహాలు తీసుకోవాలి. నాలుగు: ప్రభుత్వ ఆదాయ మార్గాల మీద సమీక్ష చేయలేదు. గత పదేండ్లలో ప్రభుత్వం సమాజానికి, వనరులకు చెడు చేసే ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టింది. ప్రధానంగా మద్యం, భూములు, మైనింగ్‌, జీఎస్టీ, ఇంధనాల, వాహనాల మీద పన్నుల ద్వార ఆదాయం పెంచుకున్నది. ఈ మార్గాలు అన్నింటికీ పరిమితులు ఉన్నాయి. ‘ఎంత పిండుకుంటే అంత’ అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ఉపయోగం ఉండదు. మద్యం వల్ల ఇప్పటికే అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వ భూములు అమ్మడం అంటే భవిష్యత్తులో ప్రజల అవసరాలను విస్మరించడం. విచ్చలవిడి మైనింగ్‌ వల్ల తెలంగాణా సుస్తిరత్వానికి, ఆర్థిక రంగానికి దీర్ఘకాలికంగా తీవ్ర నష్టం. జీఎస్టీ, ఇంకా ఇతర పరోక్ష పన్నులు కూడా సమాజంలో అట్టడుగు వర్గాల మీద భారం అవుతున్నాయి. కాబట్టి, ఈ మార్గాల ద్వార ఆదాయం ఎంత వరకు సమంజసం? ఎన్నాళ్లు తీసు కుంటాం వంటి ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఐదు: భారీ ప్రాజెక్టుల మీద పెట్టుబడులు. ప్రజల కష్టాలు తీర్చే సులువైన పరిష్కారాలు వదిలిపెట్టి భారీ ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడితే వాటి నిర్మాణానికి, నిర్వహణకు నిధులు లేక పెట్టిన నిధులు మృగ్యం అయిపోయి వ్రతం చెడినా ఫలితం దక్కని చందంగా రాష్ట్రంలో కనీసం పది ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని అట్లే వదిలివేయక, ఉన్న పరిస్థితులలో మంచి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఏర్పడింది.
ఆరు: కాలుష్యం చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం. తెలంగాణాలో నీటిని, గాలిని, భూమిని కలుషితం చేసే పరిశ్రమలు అనేక ఉన్నాయి. ఇవి ఉద్యోగాలు ఇవ్వవు. కాని ఉన్న ఉపాధిని చెడగొడుతున్నాయి. వీటిని తగ్గించే మార్గం మీద దృష్టి పెట్టాలి. ఎవడు సూటు వేసుకు వచ్చినా వానికి రెడ్‌ కార్పెట్‌ పరవడం మంచిది కాదు.వనరులను బట్టి, ఉద్యోగార్ధులను బట్టి పరిశ్రమల స్థాపనకు విధానం అవసరం ఉన్నది. ఏడు: ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాల భారం పెరుగుతున్నది. బడ్జెట్‌లో సింహభాగం వీటికే. ఇంకొక వైపు, తగినంత సిబ్బంది లేక పని చెయ్యని శాఖలు, సంస్థలు ఉన్నాయి. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగాల మీద ఒక సమీక్ష అవసరం ఉన్నది. ఎక్కడ అవసరం ఉన్నది, ఎక్కడ తగ్గించాలి వంటి విషయాలు గురించి సంప్రదింపుల ప్రక్రియ మొదలు పెట్టాలి. ఎనిమిది: విద్య, వైద్య రంగాల్లో కూడా నిధులు లక్ష్యం మేరకు, సమస్య మేరకు కాకుండా కాంట్రాక్టులకు ఎక్కువ పోతున్నది. ఈ రంగాల్లో ప్రభుత్వ నిధులు ఎక్కడ అవసరం ఉన్నవి గుర్తించి, ప్రభుత్వ నిధులు ప్రాధాన్యత మేరకు కేటాయించాలి. తొమ్మిది: విద్యుత్‌, రవాణా రంగాలు చాల ముఖ్యమైనవి. విద్యుత్‌ రంగంలో అప్పులు, రెండు గుదిబండ ప్రాజెక్టులు ఉండడం వల్ల వెసులుబాటుకు అవకాశం తక్కువగా ఉన్నది. డిస్కంలకు రూ.16 వేల కోట్లు రాయితీ ఉపయోగకరమే. అయితే, దీర్ఘకాలిక ప్రణాళిక కూడా అవసరమే. తాత్కాలిక నిర్ణయాలతోఎక్కువ రోజులు కాలం నెట్టుకురాలేము. రవాణాలో రోడ్లు వేయడం మీద ఉన్న శ్రద్ధ వీటి ఉపయోగం గురించి, ప్రయోజనాల గురించి లేదు. పది: హైదరాబాద్‌, ఇతర పట్టణాల విస్తృతి మీద తెలంగాణా ప్రభుత్వం ఆలోచనలు సరిగా లేవు. పట్టణీకరణ అంటే రియల్‌ ఎస్టేట్‌ అనే విధంగా భూమి వినియోగ ఉత్తర్వులు, ప్రాజెక్టులు తెస్తున్నారు. పట్టణాల పెరుగుదల తీరుని మార్చే ప్రక్రియల గురించి ఆలోచించడం లేదు. అస్తవ్యస్త, అవినీతిమయ పెరుగుదల వల్ల వేల కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడులు కూడా ఎవరిని సంతోషపెట్టడం లేదు. పైగా, పట్టణ జీవనం దుర్భరమవుతున్నది. హైదరాబాద్‌ కోసం ఇచ్చిన కేటాయింపులు ఈసారి కొంత మెరుగ్గా ఉన్నా ఇంకా లోతుగా అలోచించి నగరాలలో మౌలిక వసతుల మీద పెట్టుబడి పెడుతూ, నగరీకరణ కేంద్రీకృతం కాకుండా పెట్టుబడులు పెట్టాలి.
దొంతిరెడ్డి నర్సింహారెడ్డి
9010205742