నిజాం నిరంకుశ పాలన నాటి కాలంలోని స్థితిగతులను తెలిపే, గ్రామాల్లో దొరల పెత్తనం, తెలంగాణ సంస్కతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే వస్తు వైవిధ్యంతో సాగే కథలను ‘కథా కచ్చీరు’ పేరుతో విశ్లేషిస్తూ తెలంగాణ ముఖచిత్రాన్ని మన ముందుంచే ప్రయత్నం చేసారు. శ్రీధర్ వ్యాసాలను చదువుతుంటే కథా రచయితలు స్త్రీలు, బడుగు జీవితాలపై, ఆదివాసీ గిరిజన జీవితాలపై ప్రత్యేక దష్టి సారించారని తెలుస్తుంది. అలాగే వైవిధ్యంతో కూడుకొని సమకాలీన రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను వెలుగులోకి తెస్తాయి. ఇందులోని వ్యాసాలు చాలా వరకు ‘సారంగ’ వెబ్ మ్యాగజైన్ కాలమ్‌లో వచ్చినవి. జింబో రాసిన ‘చెప్పులు’ కథ ఒకవైపు దళితుల మీద దొరల పెత్తనాన్ని తెలుపగా, ఆదివాసీలపై అటవీ అధికారుల దోపిడీ, దౌర్జన్యాన్ని బి.ఎస్.రాములు కథ ‘అడవిలో వెన్నెల’లో చూడవచ్చు. తెలంగాణలో బలహీన వర్గాలపైన పెత్తందారీ వ్యవస్థలే కాదు ప్రభుత్వాధికారుల అతి ప్రవర్తన కారణంగా ప్రజలు ఎలాంటి పీడనకు గురయ్యేవారో ఈ కథలు తెలుపుతాయి. సామాజికపరమైన సమస్యలు ఒక వైపు, కుటుంబ వ్యవస్థలోని పురుషాధిక్యతలు, మహిళలపై చూపే వివక్షలు, కుటుంబ హింస కూడా బాధకు గురిచేస్తాయి. ఈ దష్టి కోణంతో రాసిన అన్వర్ కథ ‘బక్రి’. భాగ్యలక్ష్మి ‘జంగుబాయి కథ’ గిరిజన స్త్రీల సమస్యలపై దష్టి పెట్టగా దిలావర్ ‘ఉరితాళ్లు’ చేనేత కార్మికుల సంక్షుభిత జీవితాలకు అద్దం పడుతోంది. తెలంగాణ కథకుల్లో అల్లం రాజయ్యది ఒక ప్రత్యేకమైన శైలీ, శిల్పం. ఈ పుస్తకంలో ‘ఎద్దు’ కథను ప్రస్తావించడం జరిగింది. ఈ కథ గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని, వారిపై జరుగుతున్న ఆధిపత్య వర్గాల ప్రచ్ఛన్న దాడిని ప్రతీకాత్మకంగా దర్శింపజేస్తుంది. భండారు అచ్చమాంబ ‘స్త్రీ విద్య’ కథ, పి.వి.నరసింహారావు కథ ‘గొల్ల రామవ్వ’, సి. వి.కష్ణారావు ‘నోటీసు’ కథ, దాశరథి ‘నిప్పపూలు’, బిరుదురాజు ‘పీడకల’, ముదిగంటి సుజాతా రెడ్డి ‘విసుర్రాయి’ కథల నుండి శీలం భద్రయ్య ‘లొట్టపీసు పూలు’ కథ వరకు వైవిధ్యంతో కూడిన వివేచనాత్మక వ్యాసాలున్నాయి.
తెలంగాణ పాత తరం, కొత్త తరం కథకుల కథలను పరిచయం చేయడంతో తెలంగాణ కథను ఏ విధంగా చూడవచ్చు, కథా వస్తువు ఎన్నిక, సమస్యను చూపడంలో రచయితల మనోభావన, వ్యక్తీకరణలు ఒక్క చోట చదవగలిగే అవకాశం వుంది. వర్తమాన కథాసాహిత్య పరిశోధకులకు, విమర్శకులకు తెలంగాణ కథా సాహిత్య కాన్వాసును ఒక్క చోట చూసే అవకాశం ఉంటుంది. రెండు తరాల మధ్య స్థల కాలాదుల ప్రభావం కథల్లో ఏ విధంగా ప్రతిఫలించాయి అన్నది కూడా గమనించవచ్చు. లబ్దప్రతిష్ఠులైన కథకుల కథలు, యువ రచయితల కథల పైన విమర్శ, సమీక్షా వ్యాసాలతో సాహిత్యాన్నీ అధ్యయనం చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణ కథాకథనంపై కచ్చీరు పెట్టిన అఫ్సర్ చక్కటి ముందుమాట రాశారు. తను చెప్పినట్లుగా కథానిర్మాణం, కథా విస్తతిని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడే మౌలికమైన అంశాలను ఇందులో అన్వేషించవచ్చు. శ్రీధర్ ప్రతి వ్యాసానికి కథా వస్తువు వివరణ, శిల్ప వైవిధ్య ప్రస్తావన చేయడంతో పాటు కథకుల నేపథ్యాన్ని స్పర్శించడం అభినందించదగిన విషయం.
డా.రూప్‌కుమార్ డబ్బీకార్
9177857389