– రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
– సురవరం విగ్రహం వద్ద నివాళి
నవతెలంగాణ-అడిక్‌మెట్
తెలుగు భాషకు, తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేసిన త్యాగధనులు, తెలంగాణలో భాషా, సాంస్కతిక, సామాజిక రాజకీయ చైతన్యాన్ని రగిలించడంలో ప్రధాన పాత్ర పోషించిన తెలంగాణ వైతాళిక తేజోమూర్తి సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కతిక, పురావస్తు, యువజన సర్వీ సుల శాఖల మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక చరిత్ర కారుడు, రచయిత, కవి, పండితుడు, సంపాదకులు సురవరం ప్రతాప రెడ్డి 127వ జయంతి సందర్భంగా మంత్రులు ట్యాంక్ బండ్‌పై ఉన్న సురవరం ప్రతాప రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులు, కవులు, సాహితివేత్తలు, కళాకారులు, సామాజిక వేత్తలను గుర్తించి వారి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. వారు అందించిన సేవలను భవిష్యత్తు తరాలకు తెలియచెప్పేలా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుంద ని మంత్రులు వెల్లడించారు. తెలుగు భాషా సంస్కతుల వికాసానికి ఎనలేని కృషి చేసిన సురవరం రచనలను భవిషత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహానీయుని ఆశయాలకు పునరంకితం కావడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి సాహితి వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు డా.ఎల్లూరి శివ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, కార్యదర్శి సురవరం పుష్పలత రెడ్డి, కోశాధికారి డా.సురవరం కృష్ణ వర్ధన్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు సురవరం విష్ణువర్ధన్ రెడ్డి, సురవరం అనిల్ కుమార్ రెడ్డి, సురవరం కపిల్ తదితరులు పాల్గొన్నారు.