టెలివిజన్ ఛానళ్లు..వార్తాపత్రికలలో ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయాలి

 – నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు 
 – కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలలో  ఉన్నందున అన్ని టెలివిజన్ ఛానళ్లు, వార్త పత్రికల లో  ప్రభుత్వ పథకాల పై  ప్రకటనలు ప్రసారం చేయడం, ప్రచురించడం వంటివి నిలిపివేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం కేంద్ర ఎన్నికల  సంఘం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలమేరకు ఎన్నికల షెడ్యూల్  వెలువడిన 72 గంటలలోపు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని రకాల ప్రకటనలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయటం, ప్రచురించడం నిలిపివేయాలని, అలాగే ప్రభుత్వం సాధించిన  విజయాలను సైతం ప్రచురించవద్దని, అలా కాదని  ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, ప్రభుత్వం సాధించిన విజయాలు వంటివి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచురించడం వంటివి నిలిపివేయాలని స్పష్టం చేశారు.