ఎవరెవరికిస్తారో చెప్పండి..

KTR VS CM– గ్రామాల వారీగా జాబితా తయారు చేయాలి
– రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– షరతుల పేరిట ఆ పథకాన్ని ఎగ్గొట్టేందుకు కుట్రలంటూ విమర్శలు
– స్వీయ ధ్రువీకరణ అడిగితే నిలదీయాలంటూ రైతులకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతు భరోసా పథకం కింద ఎంతమంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తారో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సర్కారుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇందుకు సంబంధించి గ్రామాల వారీగా జాబితా రూపొందించి, విడుదల చేయాలని సవాల్‌ విసిరారు. షరతులు, సాకుల పేరిట రైతు బంధు (రైతు భరోసా) పథకాన్ని బొంద పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను కట్టిపెట్టి శనివారం నిర్వహించబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం ద్వారా రైతులను శాసించే స్థితికి తీసుకొస్తే, నేటి కాంగ్రెస్‌ సర్కారు వారిని యాచకులుగా మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 11 సీజన్లలో రూ.73 వేల కోట్లను రైతు బంధు కోసం విడుదల చేశామని తెలిపారు. కానీ ఏడాది కాలంగా రేవంత్‌ సర్కారు ఒక్క అరపైసా కూడా విడుదల చేయలేదని వాపోయారు. ఎన్నికల ముందు ‘వరంగల్‌ రైతు డిక్లరేషన్‌’ పేరిట బిల్డప్‌లిచ్చి, మ్యానిఫెస్టోలో అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్‌, ఇప్పుడేమో రైతు భరోసా కోసం అన్నదాతలే ప్రమాణ పత్రాలు, స్వీయ ధృవీకరణ పత్రాలను ఇవ్వాలంటూ కోరటం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్‌ సర్కారు అధికారంలోకి రాగానే నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం ద్వారా రైతులు, వారి భూముల వివరాలను సేకరించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆరు లక్షల అర్జీలు వచ్చాయంటూ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. మళ్లీ ఇప్పుడు దరఖాస్తులు, ప్రమాణ పత్రాలను అడగటమేంటని నిలదీశారు. రైతు బంధు పథకంలో రూ.22 వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నేతలు… అది ఎక్కడెక్కడ జరిగిందో చెప్పగలరా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏడెనిమిది నెలల పంట కాలపరిమితి ఉండే పత్తి, కంది, మిరప, చెరుకు తదితర పంటలకు కూడా రెండు సీజన్లలో రైతు బంధునిచ్చామని తెలిపారు. వాటికి రెండు దఫాలు డబ్బులెలా ఇస్తారంటూ ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతు రుణమాఫీ, బోనస్‌, ఎక్కడెక్కడ ఎంతెంత ధాన్యం కొన్నారనే దానిపై గ్రామ గ్రామాన లిస్టులు తయారు చేసి పంచాయతీ ఆఫీసుల వద్ద ప్రదర్శించాలని డిమాండ్‌ చేశారు. ‘బీఆర్‌ఎస్‌ హయాంలో అసలు కౌలు రైతులను గుర్తించలేదు కదా? ఆ విషయంలో ఇప్పుడు మీ విధానమేంటి?’ అని అడగ్గా…’వరంగల్‌ డిక్లరేషన్‌లో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామంటూ కాంగ్రెస్‌ ప్రకటించింది, దాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. అదే ఇప్పుడు మా విధానం…’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రైతు భరోసాకు ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ విధి విధానాలను ప్రామాణికంగా తీసుకునేందుకు సర్కారు యోచిస్తోందనీ, అదే జరిగితే రాష్ట్రంలోని 75 శాతం రైతులకు రైతు భరోసా దక్కదని ఆందోళన వ్యక్తం చేశారు, నియమ నిబంధనలు, కొర్రీలు, సాకుల పేరిట రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రైతు భరోసా పేరిట ఒక్కో ఎకరాకు రూ.17,500 బాకీ పడిందని తెలిపారు. సంబంధిత వివరాలతో కూడిన వాల్‌ పోస్టర్లను ఊరూరా వేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.