కథ ‘చెప్పు’

'tell' the storyరమ్యకు కథలంటే చాలాచాలా ఇష్టం. రోజూ వాళ్ళ నాయనమ్మతో కథలు చెప్పించుకుంటూ ఉండేది. కథ చెప్తూ ఒక్క నిమిషం ఆగినా ‘ చెప్పు.. చెప్పు’ అంటూ అడిగేది. ఇంకా రమ్యకు కొత్త వస్తువులు ఏమైనా చాలా ఇష్టం. అందుకే వాళ్ళ నాన్న ఏ ఊరు వెళ్ళినా అక్కడ ప్రత్యేకంగా దొరికే వస్తువులను రమ్య కోసం కొని తీసుకొస్తారు. ఈసారి కూడా బట్టలు, బొమ్మలు, చెప్పులు ఇలా చాలా తెచ్చారు. నాన్న తెచ్చినవన్నీ ఎంతో ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చూసుకుంది. రాత్రి అన్నం తింటూ నాయనమ్మతో కథ చెప్పించుకుంటోంది. అలవాటుగా చెప్పు చెప్పు అంటోంది. సంచిలో చెప్పులు వాటినే పిలిచిందనుకున్నాయి. ఎందుకు పిలిచిందో తెలుసుకోవాలంటే అవి బాక్సులోనే ఉండిపోయాయి. రమ్య బయటకు తీస్తే గానీ అవి బయటకు రాలేవు. రమ్య ఎప్పుడు బయటకు తీస్తుందా అని ఎదురుచూస్తున్నాయి.
మరుసటి రోజు రమ్య తన స్నేహితులకు చూపించడానికి కొత్త చెప్పులు వేసుకుంది. వాటితో రెండు అడుగులు వేసేసరికి ఎవరో తనను పిలిస్తున్నారనిపించి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మళ్ళీ రమ్య అన్న పిలుపు వినపడడంతో కిందకు చూసేసరికి ఆశ్చర్యపోయింది. ”నిన్న అన్నం తింటూ మమ్మల్ని పిలిచావెందుకు?” అని చెప్పులు అడిగాయి. రమ్య కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యపోయి చూస్తోంది. ”మాట్లాడవేంటి?” అని మళ్ళీ అడిగాయి. ”నేను మిమ్మల్ని ఎప్పుడు పిలిచాను?”అంది అయోమయంగా. ”నిన్న అన్నం తింటూ చెప్పు చెప్పు అని పిలుస్తూనే ఉన్నావుగా” అన్నాయి చెప్పులు.
” ఓ.. అదీ కథ చెప్పమని అడుగుతూ ‘చెప్పు చెప్పు’ అన్నాను” అంది రమ్య.
”నీకు కథలంటే ఇష్టమా? నాతో వస్తే నేనొక కథ చెప్తా. వస్తావా?” అని అడిగాయి. కథలంటే అసలే ఎంతో ఇష్టమైన రమ్య ఆనందంగా సరేనంది.
ఆ కొత్త చెప్పులు రమ్యను కొబ్బరి తోటకు తీసుకువెళ్లాయి. ఇక్కడికెందుకు తీసుకొచ్చాయో అనుకుంది రమ్య. ”మేమేలా తయారయ్యామో తెలుసా? ఈ కొబ్బరి కాయల పీచు నుండే. ఈ పీచు పనికిరాదని పడేస్తారు కదా. కానీ ఈ పీచుతో ఎన్నో రకాల వస్తువులు తయారు చేస్తారు. అందులో మేము ఒకటి” అని చెప్తుంటే ఆశ్చర్యపోయి వింటోంది రమ్య.
”మాలో అమర్చిన కొబ్బరి పీచు పాదాలకు పరుపులాగా పని చేస్తుంది. ఎక్కువ దూరం నడిచినా నీ కాళ్ళకు నొప్పి లేకుండా చూస్తుంది” అని చెప్పాయి. రమ్యకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంతలో కొబ్బరి చెట్టు ఊగుతూ ”చెప్పులొకటే కాదు ఇంకా చాలా రకాల వస్తువులు తయారు చేస్తారు. ఇలా తయారుచేసినవి వాడి పడేసిన తరువాత కూడా పర్యావణానికి ఏ హాని చేయకుండా మళ్ళీ భూమిలో కలిసిపోతాయి. మీకు, మాకు కూడా మేలు” అంది. ఈ కొత్త విషయాలన్నీ నాయనమ్మతో పంచుకోవాలని ఉత్సాహంగా పరుగుతీసింది రమ్య.
– డా|| హారిక చెరెకుపల్లి, 9000559913