మీ విధులు మీకు చెప్పాల్సి రావడం… అవమానకరంగా ఉంది

Your duties have to tell you…
– గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న వ్యాఖ్య
– పెద్ద నోట్ల రద్దు బ్లాక్‌మనీ ఉన్న వారికే లాభించింది
– సామాన్యులు ఇబ్బంది పడ్డారు
హైదరాబాద్‌ :
కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా తమ వద్దే అట్టే పెట్టుకోవడాన్ని ఆమె ప్రశ్నించారు. మీ విధులు మీరు నిర్వర్తించండంటూ గవర్నర్లకు చెప్పాల్సి రావడం న్యాయస్థానాలకు అవమానకరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ‘సమీక్షలో కోర్టులు, రాజ్యాంగం’ అనే అంశంపై నల్సార్‌ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ నాగరత్న మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దును తప్పు పట్టారు. ఈ చర్య బ్లాక్‌మనీ ఉన్న వారికి ఉపయోగపడిందని, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు.’ఇవాళ దేశంలో గవర్నర్లు కొత్త ధోరణులు ప్రదర్శించడాన్ని చూస్తున్నాం. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా మీ విధులు మీరు నిర్వర్తించండని, బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యం చేయవద్దని వారికి చెప్పాల్సి రావడం అవమానకరంగా ఉంది. గవర్నర్లను కోర్టుకు లాగడం రాజ్యాంగ పరంగా ఆరోగ్యకరమైన పరిణామం కాదు. వారు నిర్వర్తిస్తున్నవి రాజ్యాంగ బద్ధమైన పదవులు. వారు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది’ అని జస్టిస్‌ నాగరత్న చెప్పారు. పెద్ద నోట్ల రద్దును సమర్ధిస్తూ తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్‌ నాగరత్న కూడా ఒకరు. అయితే కేంద్ర ప్రభుత్వం తొందరపాటుతో నిర్ణయం తీసుకొని అమలు చేసిందంటూ ఆమె తన అసమ్మతి నోట్‌లో తెలిపారు. ధర్మాసనంలో ఆమె ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంపై తన అసమ్మతిని వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను జస్టిస్‌ నాగరత్న తన ప్రసంగంలో ప్రస్తావించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ‘మహారాష్ట్రకు సంబంధించి (2023 మేలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం పతనమైన తర్వాత శాసనసభలో జరిగిన బలపరీక్ష) శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాల ని కోరడానికి గవర్నర్‌ వద్ద సమాచారం ఏమైనా ఉన్నదా అనేది ప్రశ్న. ఠాక్రే ప్రభుత్వం శాసనసభ్యుల విశ్వాసం కోల్పోయిందని భావించడానికి ఆయన వద్ద ఆధారాలేవీ లేవు’ అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య సంస్థల సమగ్రతను కాపాడడానికి, వాటి వారసత్వాన్ని పరిరక్షించడానికి గత సంవత్సరం సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిందని జస్టిస్‌ నాగరత్న గుర్తు చేశారు. పంజాబ్‌ గవర్నర్‌ నాలుగు బిల్లుల్ని ఆమోదించకుండా తన వద్ద అట్టే పెట్టుకున్నారని అంటూ బిల్లులను నిరవధికంగా ఆమోదించకుండా మీ వద్దే ఉంచుకోకూడదని సుప్రీంకోర్టు ఆయనకు గుర్తు చేసిందని చెప్పారు. ‘బిల్లులపై హఠం వేసుకొని కూర్చోవడం ద్వారా ఆయన వ్యాజ్యాలకు కారణమయ్యారు’ అని వ్యాఖ్యానించారు.
పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నల్లధనాన్ని రూపుమాపడమే అయినప్పటికీ దానిని హడావిడిగా అమలు చేసిన తీరు చట్ట ఉల్లంఘనులకు ప్రయోజనం చేకూర్చిందని, వారు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకున్నారని జస్టిస్‌ నాగరత్న చెప్పారు. అంతేకాక ప్రభుత్వ చర్య సామాన్యులకు ఇబ్బంది కలిగించిందని, వారు తమ వద్ద ఉన్న పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోవడానికి అనేక కష్టాలు పడ్డారని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై ఏ స్థాయిలోనూ సంప్రదింపులు జరగలేదని ఆమె ఎత్తిచూపారు. విధాన నిర్ణయ ప్రక్రియ కూడా కన్పించలేదని అన్నారు. ఓ సాయంత్రం వేళ ప్రభుత్వ విధానాన్ని సంబంధిత శాఖలకు తెలియజేశారని, అది ఆ మరునాటి సాయంత్రమే అమలులోకి వచ్చిందని జస్టిస్‌ నాగరత్న చెప్పారు.