‘తెలుగుదనం’ అనే మాట ఈమధ్య చాలా ప్రసిద్ధికెక్కింది. ఒకరు దానికి కళ తప్పిందంటే, మరొకరు దాన్ని ఆధిపత్య ముసుగుగా అభివర్ణించారు. ఇంకొక అరవైమందికి పైగా సాహితీమిత్రులు అందులోంచే పెత్తనం, దాష్టీకం, వివక్షా వగైరాలను తవ్వి తీశారు. తెలుగు అనే పదాన్ని నన్నయ, నన్నెచోడుడు, తిక్కన, పాల్కురికి ఏ విధంగా ఎక్కడ వాడారో, అది జాతి వాచకమో దేశవాచకమో ఈ చర్చకు ప్రాధాన్యం కాదు.
ఆంధ్రా, తెలంగాణ ప్రజలు మాట్లాడేది తెలుగు భాషే (లేక తెలంగాణ భాషే) అనుకున్నప్పుడు ఒక జాతిగా వాళ్ళకున్న సారూప్యతలేమిటి? నిర్మాణ పరంగా ఈ తెలుగు (లేదా తెలంగాణ) జాతిలో వైరుధ్యాలేమున్నాయి? అన్న ఆలోచన మెదుల్తుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఏవి తత్సమాలు, ఏవి తద్భవాలో కూడా ఇప్పుడు విశదీకరించడం లేదు. విషయమల్లా కె.శ్రీనివాస్ గారు (15.8.24) ‘సాంస్కతిక జీవనంలోనూ, విలువల పాటింపులోనూ కొత్త పతనస్థాయిని, లేకితనంలో కొంగ్రొత్త పతాకస్థాయిని అందుకుంటున్న ప్రయాణం తెలుగువారిదన్న’ మాట గురించి. లేకితనం అనే పదాన్ని ఎంత దుబారాగా వాడేసేడీయన. ఆయన విమర్శించిన తెలుగుదనంలో సంగిశెట్టివారికి (25.08.24) బ్రాహ్మణాధిపత్య ‘థాట్ పోలీసింగ్’ (భావజాల నియంత్రణ) కనిపించింది. విరసం పాణి (వసంతమేఘం – 1.9.24) దీన్ని పాపులిస్టిక్ ధోరణి అన్నారు. ఆనందాచారిగారు నవతెలంగాణలో ‘మన సాహిత్యరంగం ఇలా ఎందుకుంది’ అని ప్రశ్నించారు. ఇవన్నీ ఒకెత్తైతే మన తెలంగాణలో (2.9.24) పసునూరి రవీందర్ రాసిన వ్యాసం/ ప్రకటన మరొకటి. వీటన్నింటికీ ఒక ఏకసూత్రత ఉంది. అది ఈ మధ్యే బెంగళూరులో జరిగిన ‘బుక్ బ్రహ్మ’ సాహిత్య కార్యక్రమం.
ఉదారవాద ప్రజాస్వామ్య ప్రేమికులైన మేధావులకి దేన్నన్నా/ ఎవర్నన్నా సరిపోల్చడంలో ఒక సరదా ఉంటుంది. లేకపోతే ఆ అవలక్షణరీత్యా ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా పేర్లు తీసుకోకపోదురు. తీసుకున్నారుపో, తమ కులపువాళ్ళని, ఉపకులపువాళ్ళనీ, లేదా సొంత ముఠాదార్లనీ ఎంచుకోక తప్పదు కామోసు. సంగిశెట్టివారన్నట్టు ‘నేం డ్రాపింగ్ కూడా ఒక కళే’. బహుజన వాదానికి ఆంధ్రా, తెలంగాణ అభేదం పాటించి సంగిశెట్టి ప్రశంసార్హుడైనాడేమో గానీ కులప్రాతినిధ్యం పట్ల సంగిశెట్టి చూపిన శ్రద్దకీ, సోకాల్డ్ బ్రాహ్మణాధిపత్య ప్రమోషనల్ లక్షణానికీ తేడా ఏమున్నది? సరే ఉన్నదిపో, దానికి తెలుగుదనానికి ఎందుకు ముడిపెట్టాలి? సాంస్కతికంగా తెలుగు భాషా ప్రాతినిధ్యం తెలిసి కూడా, వాళ్ళెవరో రాష్ట్రం బయట చేసుకుంటున్న ‘సాహిత్య మేళా’కి ఏ బీసీనీ పిలవలేదు, ఏ తెలంగాణావారినీ పిలవలేదని ఎందుకు ఆక్రోశించాలి? ఆ కార్యక్రమ నిర్వాహకుల పిలుపుల్లో సామాజిక వర్గ కోణాన్ని ఎత్తిచూపుతూనే ‘తెలుగుదనాన్ని’ విమర్శించడం అసంబద్ద చర్య.
వీరికి ప్రాధమికంగా కేంద్ర సాహిత్య అకాడెమీతో పేచీ ఉందని అర్థమవుతోంది. అకాడెమీ తెలంగాణాలో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో తెలంగాణేతరులుండరాదని వీరి ప్రతిపాదన. చెప్పగలిగితే దీనికి సలహా మండలి కన్వీనర్లూ/ సభ్యులుగా ఉన్నవారు సమాధానం చెప్పాలి. అకాడెమీలో అన్ని ప్రాంతాల భాగస్వామ్యం ఉంది కదా. ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకి అకాడెమీ ఎలా పదవులూ, పురస్కారాలూ పంచాలో అది ప్రత్యేకమైన చర్చ. అకాడెమీలో భాషాపరంగా కాక రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం కావాలనడంలో ఔచిత్యం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పలుకుబళ్ళు వేరు గావచ్చు, మూలం తెలుగే. ఈ రెండు ప్రాంతాల నాగరికత, సాంస్కతిక చరిత్రల్లో, తెలుగు భాషని విడదీసి చూసేంత ప్రలోభానికి ఏ సామాన్యుడూ గురి కాడు. మీ కథలూ కవిత్వాలూ ‘ఆంధ్రా’ పేరిట అచ్చేసుకోమని చెప్పడం తొందరపాటు తప్ప మరొకటి కాదు. అదీగాక తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, లేక ఇతర ప్రదేశాల్లో తెలుగు మాట్లాడేవాళ్ళని తమ భాషకి ఏ పేరు పెట్టుకొమ్మని చెబుదాం? సాహిత్యకారులు వ్యక్తివాదులుగా మారకూడదు. సైద్ధాంతిక గందరగోళం ప్రమాదకరమైనది.
”మీ సాహిత్యం క్యారెక్టర్ వేరు. నేచర్ వేరు. ఫంక్షన్ వేరు. బిహేవియర్ వేరు. లక్ష్యం వేరు. కాబట్టి మీరు వేరు” అంటాడు మిత్రుడు. జాషువా మొదలు, శివసాగర్, మద్దూరి, కలేకూరి రచనల క్యారక్టర్ (వ్యక్తిత్వం) ఏమిటి? వాళ్ళ రచనల బిహేవియర్ (స్వభావమూ) లక్ష్యం ఏమిటి? కావడి కుండల సంకలనాన్ని మర్చిపోయారనుకుంటాను. మేమైతే తెలంగాణ ఉద్యమం బట్టబయలు చేసిన సత్యాలకి రుణపడి ఉంటాం. అసమానతలు తెలిశాయి. అయితే తెలంగాణ వచ్చాక ఈ పదేళ్లలో రెండు ప్రాంతాలలో పెరిగిన కలివిడితనాన్ని కలుషితం చేయకండి.
‘ప్రధాన వేదికలపై అందరూ ఆధిపత్య కులాల వాండ్లే కదా’ అనడంలో ఔచిత్యం ఏమిటి? ఏవి ప్రధాన వేదికలు? పదేళ్ళ కాలంలో తెలంగాణలో సాహిత్య అకాడెమీ ఏర్పాటయ్యింది. చక్కటి భాషోత్సవాలు చేశారు. తెలంగాణ సారస్వత పరిషత్తు సాహితీవేత్తల్ని సముచితంగా గౌరవిస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయం మీకే పుస్తక గ్రాంట్లు ఇస్తోంది. కీర్తి పురస్కారాలనూ ప్రకటిస్తోంది. ఇవిగాక భాషా సాంస్కతిక శాఖ పనితీరు చాలా బాగుంది. కథా, కవితా వార్షికలు ఒక్క ఆంధ్రా ప్రాంతం నుండే కాదు, తెలంగాణ నుంచీ విరివిగా వస్తున్నాయి కదా. బహుజన కథా కచ్చీరులు, కూడళ్ళు, తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్లు మంచి పనే చేస్తున్నాయి కదా. ‘ఇప్పుడు హైద్రాబాద్ కేవలం తెలంగాణ ప్రజల ఆస్తి’ అనడం వెనుక హైదరాబాద్ నగర కేంద్రీకత రాజకీయం కనిపిస్తోందంతే. ఆంధ్ర ప్రాంతంలో ఒక బలమైన సాంస్కతిక నగరావసరాన్ని నొక్కి చెప్పినందుకు కతజ్ఞతలు. దానికి తెలుగుని, తెలుగుదనాన్ని ఫణంగా పెట్టకండి. తెలంగాణం అంటేనే తెలుగు స్థానం, తెలుగు మాటల మాగాణం అన్న నలిమెల భాస్కర్ గారి మాటలు మననీయమైనవి.
ఫ్రీవర్స్ ఫ్రంట్, ఉమ్మడిశెట్టి, రంగినేని, రొట్టమాకురేవు, సినారె పురస్కారాల్ని గమనించండి. కవిసంగమం కషిని తలుచుకోండి. సాహిత్యప్రేమ తప్ప వేరు పక్షపాతం కనబడదు. ఖమ్మం ఈస్థటిక్స్, ముల్కనూర్ గ్రంథాలయం కథల పోటీలు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొ. కాశిం గారి నేతత్వంలో జరిగిన తెలుగు సాహిత్య మహాసభలు స్పూర్తిదాయకమైనవి. విశాఖ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వరుసగా తండా హరీష్ గౌడ్, బండారి రాజ్ కుమార్లని గౌరవించింది. ఇబ్రహీం నిర్గుణ్ గారికి అనంతపురంలో విమలాశాంతి పురస్కారం, ఏనుగు నరసింహా రెడ్డి గారికి ఒంగోలులో నాగభైరవ పురస్కారం ఇచ్చారు. కరీంనగర్ అసిస్టెంట్ కలెక్టరు శ్యాంప్రసాద్ లాల్ చిత్తూరు జిల్లాకు చెందిన మేఘనాధ్ రెడ్డిని తన తండ్రి పేర సత్కరించారు. ఖమ్మంకు చెందిన ఫణిమాధవి విజయనగరంలో రాధేయ పురస్కారం అందుకున్నారు. ఎటువంటి ప్రాంతీయ వివక్ష లేకుండా తిరుపతి నుండి కంచర్ల సుబ్బానాయుడు ‘సేవ’ పేరుతో ఏడాదిపాటు నిర్వహించిన ఆన్లైన్ కార్యక్రమాలు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. మిత్రులారా ఇంకా విశాల దక్పధాలకు కాలమున్నది. ఇదొక మంచి పరిణామం. ఇప్పటికీ తెలుగు వాడి ప్రస్తావన వస్తే మేం సి.నారాయణరెడ్డి కవితే ఉదహరిస్తాం. అందుకే మిత్రులు మాకు సిగ్గులేదంటున్నారు కదా.
ఎక్కడో ఆఫ్గనిస్తాన్, ఉక్రెయిన్, పాలస్తీనా వంటి దేశాల సమస్యలపై రచనలు చేసే మనం విభజనకు ముందే ఈ రెండు రాష్ట్రాల్లో రక్తసంబంధీకులున్నారు, స్నేహితులున్నారని, మన అనుకున్న ప్రజలున్నారని మరచిపోలేదు కదా. మీడియా హౌస్‌ల, సాహిత్య పేజీ ఇన్‌చార్జుల కులాధిపత్యాన్నే సాకుగా చూస్తున్నాం గానీ దేశంలో అన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు ఏ పార్టీ కనుసన్నల్లోకి వెళ్ళి పోయాయో తెలియడం లేదా? మనలో మనం వేదికల భాగస్వామ్యం కోసం ఇలా అల్లరి పడటం వలన ఉమ్మడి శత్రువుకు పలుచనైపోవడం లేదూ? దేశంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జోరుగా జరగట్లేదా? తెలుగు ఇతర ద్రవిడ భాషల మధ్య, అధికారిక హిందీ మధ్య ఎంతో నలిగిపోతోంది.List of rationalised content పేరిట పాఠ్య పుస్తకాల్లోంచి సామాన్యుడి పోరాటాలు కనుమరుగవుతున్నాయి. సెప్టెంబరు 17 ఎంత రాజకీయమైపోయింది చూడండి? వీటిని మనం తెలుగు భాషతోనే కదా ఎదుర్కొనగలం?
పాణి ఒకే భాష మాట్లాడుతూ ఒక్కటి కాలేకపోయిన తెలుగు ప్రజలు ప్రపంచ మానవులు కావడానికి తెలుగుదనం కంటే వేరే ప్రాతిపాదికలు ఎక్కువ ఉపయోగపడతాయేమో చూడాలన్నాడు. ఆలోచించాల్సిన మాటే. తెలుగుదనంలోని సంప్రదాయ కంఠస్వరం పోయేది కాదు. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ తమ తమ సాంస్కతిక వారసత్వాలున్నాయి. అది తెలుగుదనంలో భాగంగా ఉంది. తెలుగుదనానికి కోస్తాలో సంక్రాంతి సంబరాలెంత ముఖ్యమో, తెలంగాణా మహంకాళీ బోనాలు, ఖైరతాబాద్ వినాయకుడూ అంతే ముఖ్యమైనవి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమెంత ప్రాణప్రదమైనదో, శ్రీకాకుళ గిరిజనోద్యమమూ అంతే మరువలేనిది. అయితే ప్రగతిశీల భావజాలం కోసమని సామాన్యుడు తన జీవన శైలిని, ఆచార వ్యవహారాలని సులువుగా మార్చుకోలేడని ఎన్నో అనుభవాలు చెబుతున్నాయి. బాబాల భజనలూ, మండల పూజలు చేస్తున్న నేటి యువతరాన్ని గమనించండి. హిపోక్రసీ లేకుండా ముందు వీటన్నింటినీ అంగీకరించాలి. ఆపై మన సాంస్కతిక పరిణతిని అంచనా వేద్దాం. కళ జీవితాన్ని ప్రతిబింబిస్తుందనుకున్నప్పుడు ఏది దేన్ని దాటి ప్రవర్తిస్తున్నదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే ఒక తరాన్ని ప్రభావితం చేసే రచనల ప్రస్తావన, తెలుగుదనాల గురించీ వ్యాఖ్యానం చేయాలి. తెలంగాణా నుడికారం విద్యా పరిపాలనా రంగాలకు మరింత విస్తరించాలన్న కాంక్షలో మీ భాష ఆంధ్రా, తెలుగు కాదనేంత కాఠిన్యం ఉంటుందనుకోలేదు. మీ ప్రకటనలో దౌర్జన్యం ధ్వనిస్తోంది. కలుపుకుంటే రెండు తెలుగులు ఒకటే (ఉపకారి -2022) అన్నాడు మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు. ప్రాంతం పేరుతో వేర్పాటువాద విధానాలకు స్వస్తి పలుకుదాం. ఎందుకంటే తెలుగు భాష పట్ల ‘మన’ అనే మమకారం మనందరికీ వుండాలి.
– అనిల్ డ్యానీ, సుంకర గోపాల్,
పాయల మురళితో కలసి శ్రీరాం పుప్పాల