కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం పై తెలుగు రాష్ట్రాల ఇరువురు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు,అనుముల రేవంత్ రెడ్డి లు చొరవ చూపాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకరరావు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ సభ్యత్వ నమోదు ను శనివారం అశ్వారావుపేట ఆయన ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ మంజూరు భూసేకరణ ప్రక్రియలో గత ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహనరెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ – ఏపికి అనుసంధానంగా ఉండే ఈ రైల్వే లైన్ ఏర్పాటు అయితే 200 గ్రామాలకు ప్రయాణ సౌకర్యం సులభతరం అవుతుందని అన్నారు. విశాఖపట్టణం – హైదరాబాదుకు 175 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు.గత పాలకుల హయాంలో ఆర్థిక అరాచకం తప్పా అభివృద్ధి జరగలేదని ఎద్దేవ చేశారు. కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు నేడు రేవంత్ సర్కారులో వడ్డీలు చెల్లించేందుకే సరిపోతుందని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్,కేటీఆర్ రేవంత్ రెడ్డి ని విమర్శించడం మాని అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాకబ్,సత్యనారాయణ లు పాల్గొన్నారు.