గ్రూప్‌-1 మెయిన్స్‌లో తెలుగు అర్హత పరీక్ష నిర్వహించాలి

– టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌కు అభ్యర్థుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌లో తెలుగు అర్హత పరీక్షను నిర్వహించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ మహేందర్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో అభ్యర్థులు శివానందస్వామి, శ్రీనివాస్‌, అనిల్‌రెడ్డి, ఎస్‌ కిశోర్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రూప్‌-1 రాసేందుకు 13 ఏండ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. అయితే గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఇంగ్లీష్‌కు మాత్రమే అర్హత పరీక్షను నిర్వహించి మాతృభాష తెలుగు లేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తెలుగు మాధ్యమం అభ్యర్థులు ఎక్కువగా ఉంటారని తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్‌లో 300 మార్కులకు తెలుగు అర్హత పరీక్ష ఉందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ఉద్యోగాల్లో మెయిన్స్‌ విభాగంలో వారి మాతృభాషను అర్హత పరీక్షగా ఉందని పేర్కొన్నారు. ఏపీలోనూ గ్రూప్‌-1 మెయిన్స్‌లో 150 మార్కులకు తెలుగు అర్హత పరీక్ష ఉందని తెలిపారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు అర్హత పరీక్షను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తద్వారా అభ్యర్థులు సాధారణ పరిపాలన వ్యవహా రాల్లో రాష్ట్ర ప్రజలతో మమేకమవుతారని వివరిం చారు. అనంతరం ఇదే విషయంపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీని వారు కలిసి వినతి పత్రం సమర్పించారు.