తెలుగు వీర ఆపవా

తెలుగు వీర ఆపవాఏం చేయాలనుకుంటున్నావు అని మిత్రుడి కొడుకుని అడుగుతాడు ఒక ప్రకాష్‌ రాజు. ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ కాకుండా బి.ఎ. బి.కాం చేస్తానంటాడు ఆ మిత్రుడి కొడుకైన కథానాయకుడు వెంకీ. ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ అంటున్నప్పుడు అవతలవైపు ఉన్న పాత్ర వేసే నటుడు అదోలా చూస్తాడు కథా నాయకుడిని. నీకంత సీనుందా అన్నట్టు. అందుకే డైలాగు మారుస్తాడు. నిజానికి ఏదైనా చేయగల సీను అందరికీ ఉంటుంది. కాని చేయాలన్న పట్టుదలే ఉండదు. ఆ పట్టుదల మస్తుగా ఉన్నవాళ్ళ గురించి తెలుసుకుందాం. గొప్పకార్యాలు సాధించాలంటే గొప్పగా పనిచేయాలి మరి.
తెలుగు తేజాలు అన్ని చోట్లా విజృంభిస్తున్నారు. ఒక పక్క ఐ.ఎ.ఎస్సులు, ఐ.పి.ఎస్సులు, ఫారెస్టు సర్వీసుల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఐ.ఐ.టి.లు ఇతర ఇంజనీరింగు కోర్సులు, వైద్య విద్యకు సంబంధించి ఒకటి, ఒకటి, రెండు, రెండు అలా ఎన్నో రెండులు, మూడులూ, నాలగులు అంతే ఒక్కోటి పది సార్లు టీవీల్లో చెబుతున్నారు, పేపర్లలో ప్రకటిస్తున్నారు. ఇలా ర్యాంకుల మీద ర్యాంకులు తెలుగు తేజాలు తెస్తున్నారు. ఇన్ని మంచి ర్యాంకులు వస్తున్నాయి వీళ్లకు పోటీదారులు లేరా అనుకుంటే పొరబాటే. వాళ్ల మధ్య యమ పోటీ ఉంటుంది. ఏమేమి చదివావు అనడిగితే మాత్రం అబ్బే ఫలానావి చదవనేలేదస్సలు అని చెప్పొచ్చు. నిజం చెప్పకపోవచ్చు. అయితే ఎవరి చదువు వాళ్లు చూసుకుంటారు కాని ఇతరులను చదవకుండా చేయడం, ఇతరులను రెచ్చిపోయేలా మాట్లాడడం చేయరు వాళ్లు. అలాంటి వాటికోసం సమయాన్ని వృధా చేయనే చేయరు. అది నిజమైన పోటీ అంటే. పరుగు పందెంలోనో, అలాంటి ఇంకో పోటీలోనో ఎవరి సామర్ధ్యం వాళ్లు చూపిస్తుంటారు. పక్కవారిని చూస్తుంటారు కాని వారికి ఆటంకం కలిగించరు. ఒకరిని చూసి ఒకరు ఇంకా ఎక్కువగా చదివి తమని తాము నిరూపించుకుంటారంతే.
ఇక రాజకీయ పోటీదారుల గురించి చూద్దాం. ఎవరైనా సరే ఒకరిని తిట్టాలన్నా, ఓ మాట అనాలన్నా పెద్దగా చదువు అవసరమే లేదు. కాస్త నిర్మొహ మాటం కావాలంతే. ఇతరులు ఏమనుకుంటున్నారన్న ధ్యాసను కాస్త, కాదు కాదు పూర్తిగా పక్కన పెట్టాలంతే. అప్పుడు నోరు, బుద్ధి అన్నీ సమాజాన్ని, మనుషులను మరచిపోయి తమ అరివీర భయంకరమైన ప్రతాపాన్ని చూపిస్తాయి, ఇప్పుడు ఎండ చూపిస్తున్నట్టు. అసలు ఇన్ని సందర్భాలు, ఇన్ని పదాలు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని ప్రయోగాలు ఒక్క తెలుగు రాజకీయ వీరులకే సాధ్యమా లేక అన్ని భాషలవారూ ఇలాగే ఉన్నారా అన్న అనుమానమూ వస్తుంది. అలా కనుక్కున్నప్పుడు తేలిందేమిటంటే కేరళ, పంజాబు, కర్నాటక, మహారాష్ట్ర ఆ జాబితా కిందికి వస్తాయి. ఇదంతా కూడా గూగుల్‌ తల్లి అందించిన సమాచారం. మరి ఇవే తెలుగు తేజాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఒక్కసారి చూస్తే విసుగొస్తుంది. ఓ దేశమంతా ఇలానే ఉంది, విలువలు పడిపోతున్నాయని సర్దుకుంటే మనమేమీ చేయలేము. వాళ్లకి ఎవరు చెప్పాలి మరి మంచి విషయాలు. అధికారం మినహా ఇతర విలువల గురించిన ధ్యాసే ఉండదు. ప్రపంచం వేడెక్కిపోతోంది, మన దేశం, మన రాష్ట్రాలు కూడా. మొదట మనల్ని మనం సరిదిద్దుకుందాం అనుకొని చెట్లను పెంచడం, నీటిని జాగ్రత్తగా భూమిలోకి పంపడం ఇలా ఇంకెన్నో చర్యల గురించి ఒక్క పార్టీ వారైనా తమ మ్యానిఫెస్టోల్లో పెట్టారా?
పైన చెప్పుకున్నట్టు ఎవరి చదువులు వాళ్లు చదివినట్టు ఇతరులను తిట్టకుండా లేదా తగుమాత్రం తిట్టి ప్రజల కోణంలో ఎవరైనా మాట్లాడుతున్నారా? అసలు తిట్లకి విమర్శకి తేడా తెలుసుకోవాలి వీళ్లు. ప్రజల పార్టీలు మినహా ఇతరులు నిజంగా ప్రజలకేమి కావాలి అని ఆలోచించే క్రమంలో ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. ఎంతసేపూ సభల్లో, సమావేశాల్లో ఇతరులను మొదట తిట్టి ఆ తరువాత సమయం మిగిలితే తామేమి చేస్తామో చెబుతున్నారు కాని అసలు ప్రజలకు తామేమి చేస్తాము, నిజంగా వారి జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలి అన్న ఆలోచన రాదు. తమ, తమ కుటుంబ, తమ పార్టీల్లో వెలుగులు నింపడమే ప్రధానం అని తెలిసిపోతూనే ఉంటుంది. ఇంతకు ముందు పాలించినోళ్లు సరిగా ఉద్యోగాలివ్వలేదు, మేము ఉద్యోగావకాశాలను బాగా కల్పిస్తామని చెబుతారు. ఉద్యోగం ఇవ్వడానికి, ఉద్యోగావకాశం కల్పించడానికి తేడా దండిగానే ఉంది. మనం జాగ్రత్తగా వింటుండాలి వీళ్ల మాటలు. మొదట వాళ్లు చేయలేదని చెప్పి మరీ తామేం చేస్తామో చెబుతారు. పైకలా చెప్పినా మొదటిదే ముఖ్యం ఓట్లు అటుపక్క పోకుండా చూసుకోవడానికి.
ప్రజల తరపున మాట్లాడేవారిని ట్రోలింగ్‌ చేస్తున్నారు. సభ్య సమాజంలోనివారు చదవలేని, దిగజారిన భాషలో సందేశాలు పెడుతూ తమ నైజం చూపుతున్నారు. క్రికెట్‌ మైదానంలో కొన్ని దేశాల క్రీడాకారులు ప్రత్యర్ధులను నానా మాటలూ అంటుంటారు. దాన్ని స్లెడ్జింగ్‌ అంటారు. ఇప్పుడు అన్ని టీముల వాళ్లు ఒక్కో జట్టుగా ఏర్పడి ఐ.పి.ఎల్‌ ఆడుతున్నారు. తమ తమ జట్లలో కొట్టుకున్నంత పని చేసినోళ్లు కూడా ఇక్కడ ఐకమత్యంగా ఆడాలి. ఇక్కడ రాజకీయాల్లోనూ అలాగే ఉంది అన్ని పార్టీలు చుట్టేసుకొచ్చినోళ్లు ఇప్పుడు తమకవసరమైన పార్టీలో చేరి దోస్త్‌ మేరా దోస్త్‌ అని కలిసిపోయి పనిచేస్తున్నారు. ఈ పార్టీకే ఓట్లేయమని మరీ అడుగుతున్నారు. మీరు తిట్టుకునే తిట్లు ఆపితేనే ఓట్లేస్తామని ప్రజలు బెదిరిస్తేనన్నా బాగుండు కొద్దిగా మారతారు. అసలు ప్రతి ఓటరు పేరు లేకుండా తమ తమ అభిప్రాయాలను ఒక చీటీ రాసి దాన్ని ఒక బాక్సులో వేస్తే ఎలా ఉంటుంది? వాటిని కనీసం వచ్చే ఎన్నికల్లో అమలు పరిచేలా చేస్తే ఎలా ఉంటుంది?
తెలుగువాళ్లు మాత్రమే కాదు మొత్త దేశమే ఇలా ఉందని అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో ఇది సహజమని మన తెలుసువాళ్లనే అనడం బాగాలేదని ఎవరైనా అనొచ్చు. వాళ్లకు చెప్పేదొకటే. మంచి ఎవరి దగ్గరైనా సరే నేర్చుకోవాలి. మొదట చెప్పుకున్న తెలుగు తేజాల నుండి కాస్త గ్రహించమని, పాటించమని మనవి. తెలుగువీరులు ఇకనైనా తిట్ల దండకాలు ఆపి ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడతారని కోరుకుందాం.
జంధ్యాల రఘుబాబు
9849753298