తెలుగు వెలుగుల వేమన్న

తెలుగు వెలుగుల వేమన్నవేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటి మీదనే నిలిచి ఉన్నాయి. 1816లో భారతదేశం వచ్చిన చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ వేమన సాహిత్యం మీద 18 ఏళ్లపాటు పరిశోధన చేసి కొన్ని వందల పద్యాలను సేకరించాడు. అంతేకాదు బ్రౌన్‌ దొర తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్ద కోశాన్ని ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. అదే బ్రౌన్‌ డిక్షనరీగా పేరొందిన నిఘంటువు. ఈయన వేమన పద్యాలను సేకరించడమే కాదు, వాటిలోని గొప్పతనాన్ని గ్రహించి, వాటన్నింటినీ లాటిన్‌, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు కూడా. తెలుగువారు సిపి బ్రౌన్‌ కు ఎంతో రుణపడి ఉంటారు. విలియం హోవర్డ్‌ కాంబెల్‌ (1910), జి. యు. పోప్‌, సి. ఇ. గోవర్‌ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోక కవిగా కీర్తించారు. తెలుగువారిలో వేమన కీర్తి అజరామరం చేయటానికి కృషి చేసిన వారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి రామలింగారెడ్డి కృషి ఎంతో ఉన్నది. 1839లో తొలిసారిగా బ్రౌన్‌ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి.
వేమన కాలం గురించి, ఆయన జీవితం గురించి, సిపి బ్రౌన్‌, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాథ శర్మ, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్‌.గోపి పరిశోధనలు చేశారు. సుమారు 1652-1730 మధ్యకాలంలో వేమన జీవించి ఉండవచ్చునని అభిప్రాయ పడతారు.
కులమత బేధాలను నిరసించిన వేమన కులం గురించి పరిశోధకులు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. సి.పి.బ్రౌన్‌ వేమన జంగం (శైవ సంస్కర్తల కులం) కులానికి చెందిన వాడని, వేమన రెడ్డి కులానికి, కాపు కులానికి చెందినవాడు అని కూడా మరికొందరు భావించారు. ఆయన పద్యాలను బట్టి కొందరు భావించినా కాపు, రెడ్డి అనే కులాలు దత్త మండలాలలో పర్యాయపదాలుగా వాడబడుతున్నాయి. కావున ఏ కులమని నిర్ధారించలేకపోయినా పద్యాలలో కనిపించే వ్యవసాయ పరిజ్ఞానం వలన ఆయన రైతు కుటుంబానికి చెందిన వాడిగా నిర్ధారించవచ్చు అని అంటారు మరి కొందరు. వేమన ఏ కులం వాడు అన్నది అప్రస్తుతం. ఆయన ఒక నిండైన మనిషి. ఆయన లోకానికి అందించిన అపూర్వ సాహిత్యం ఒక సత్యనిఘంటువు.
వేమన పద్యాలలో వాడిన ప్రాంతాన్ని సూచించే పదాలు (పచ్చ, దుడ్డుట, బిత్తలి లాంటివి) రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలో ఉన్నందున ఆయన రాయలసీమ వాడు అని చెప్పవచ్చు.
పరిశోధనలు కొనసాగిన క్రమంలో వేమన వాడిన మక్కా, అల్లా, మహమ్మద్‌, గులాము, బిక్కలు, జింజిరీలు వంటి పరిష్యా పదాలు వాడకం వల్ల ఇతడు 17వ శతాబ్దం వాడని, రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడని తేలిందని అంటారు.
ప్రాపంచిక జీవితంలో ఎంతో మోసం, కపటం, నాటకం, డంబం గ్రహించిన వేమన, వాటిని రూపుమాపటానికి సన్యాసులు చూపించే పరిష్కారాలు వట్టి బూటకం అని, ఆ సన్యాసుల బతుకులలో కూడా అవే లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. వారి మోసాన్ని ఎలుగెత్తి చాటాడు. వేమన పద్యాలు లోకనీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృజించని అంశం లేదు. పట్టించుకోని పార్శ్యం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లో దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించటం, కుహానా గురువులు, దొంగ సన్యాసులు… ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అవకతవకల మీద వేమన్న కలం ఝులిపించాడు. సమాజానికి పట్టిన చీడపీడను, బూజును దులిపివేశాడు. పద్యాలన్నీ ఆటవెలదిలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి మూడోపాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదాహరణకు
”అల్పుడెపుడు పలుకు నాడంబరముగాను/ సజ్జనుండు పలుకు చల్లగాను/ కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినురవేమ”.
కొన్ని పద్యాలలో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ”అనగ అనగ రాగ మతిశయించునుండు/ తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన”
వేమన గొప్ప గొప్ప ప్రబంధాలను, పురాణాలను రాజులను కీర్తిస్తూ సంస్కృతంలో కవిత్వాన్ని రాయలేదు. అతి సామాన్య ప్రజానీకానికి సులభమైన తెలుగులో చాటు పద్యాలలోని తత్వాన్ని, సమాజంలో ఉన్న మురికిని వదలగొట్టటానికి ప్రయత్నం చేశాడు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే ఉదాహరణలు తీసుకోవడం, హాస్యస్ఫూరకతను జోడించడం, సమకాలీన అంశాల ప్రస్తావన, వాటిలో ఎత్తిపొడుపులు ఉండటం, సమాజంలో కరుడుగట్టి ఉన్న సాంప్రదాయాల పట్ల నిరసన ధ్వనించడం వేమన పద్యాలలోని ప్రత్యేకత.
మితిమీరిన విగ్రహారాధన, అవివేకంతో కూడిన సంప్రదాయాలు, పాటింపవీలులేని, కొన్ని వర్గాలకే పరిమితమైన విజ్ఞానం వంటివి వేమనకు నచ్చలేదు. వేదం చదివామని చెప్పే వారిలో వివేకం శూన్యం అని వేమనకు తెలుసు. దేవాలయాల ముసుగులో జరిగిన దారుణాలు, వ్యాపారాల వంటి చీకటి దృశ్యాలను నాటి సమాజంలో ఆయన చూశాడు. స్త్రీలను పురుషాధిక్యతతో దేవదాసీలుగా చిత్రించటం వెనుక స్వార్థపరుల కుట్రలను గ్రహించాడు. వేశ్యల వెనుకబడి విత్తం (సొమ్ము) పోగొట్టుకుని వెర్రివారైన విటుల జీవితాలు, వారి కుటుంబాల్లోని విషాదం ఇలాంటివన్నీ ఆయన గ్రహింపు కొచ్చిన అంశాలు. ఒక వైపు స్త్రీ ఔన్నత్యం గురించి ఘోషిస్తూ, మరోవైపు ఆమెను భోగ వస్తువుగా పరిగణించిన చౌకబారుతనాన్ని, విషాదాన్ని, ఆ శాస్త్రాలలో ఆనాటి సమాజపు సహజరీతిగా చలామణి కావటానికి గర్హించాడు.
దేవుడంటే ఎవరు? ఎక్కడున్నాడు? కనిపించని దేవుని గురించి గొప్పగా కీర్తించి, కళ్ళ ముందు కనిపించే మనిషిని జాతి, కుల, మత, వివక్షలతో, ఆర్థిక అసమానతలతో వేధించే మనుషులను వేమన దూషించాడు, ద్వేషించాడు. తన హేతువాద భావాల తూటాల వర్షం కురిపించాడు. అసలు దేవుడు ఎక్కడున్నాడు అని నిలదీశాడు. ”దేవుడనగ వేరే దేశమందున్నాడే/ దేవుడనగ తనదు దేహమందు/ వాహనంబు లైదు వడి తోలుచున్నాడు”. మనిషిని నడిపించే జీవచైతన్యమే దేవుడు. పాడి, పంట, రైతు, తల్లి, తండ్రి, మానవత్వం ఇవే దైవ స్వరూపాలుగా వేమన సిద్ధాంతీకరించాడు.
వేమన భాష స్వచ్ఛమైనది. వాడి గలది. శైలి సరళం. ఆయన చేసే పోలికలు సహజంగా, సరికొత్తగా గంభీరంగా మేరు తీగల్లాగా ఉంటాయి. ఇతరుల సొమ్మును ఆశించే లక్షణం ‘వెన్నదొంగ’ లోనూ కనిపిస్తుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతాడు. ”పాల కడలి పైన పవళించిన స్వామి/ గొల్ల ఇండ్లపాలు కోరనేల?/ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి”
బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడు ఎలా గయ్యాడు? అంటూ ప్రశ్నిస్తాడు వేమన. ”కనక మృగము భువిని కద్దు లేదనుకుండ/ తరుణి విడిచి పోయే దాశరధియు/ తెలివి లేని వాడు దేవుడేట్లయేరా?” అలానే కుల వివక్షత లోని డొల్లతనం గురించి ”మాలవానినంటి మరి నీట మునిగితే/ కాటికేగునప్పుడు కాల్చు మాల/ అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?” అంటూ సామాజిక రుగ్మత అయిన కుల వివక్షతను చీల్చి చెండాడాడు. మనిషిని మనిషిగా చూడాలే కానీ కులంపేరుతో దూరం చేయకూడదు అనే నగ సత్యాన్ని సమాజానికి చెప్పి అప్రమత్తం చేశాడు. వేమన మానవతా ధర్మం గురించి చెప్తూ ”చంపదగిన యట్టి శత్రువు తన చేత/ చిక్కెనేని కీడు సేయరాదు/ పొసగ మేలు చేసి పొమ్మంటే చాలు” అంటూ మానవత్వాన్ని చాటుతాడు.
వేమన ఆంధ్రులలో సాటి లేని వ్యక్తి. తనకు తెలిసిన వాటిని నిర్భయంగా ప్రపంచమునకు బోధించు ధైర్యం, దానికి సాధనమైన మంచి పదును గల చురకత్తి వంటి కవితా శక్తి వేమన సొంతం. తాము సత్యమని నమ్మినప్పటికి కూడా ఇతరుల మనసు నొచ్చుకుంటుందేమోనని చెప్పకుండా తప్పించుకు తిరుగు ‘ధన్యులు’ కవులు ఆంధ్రులలోఎందరో ఉన్నారు.
వేమన పద్యాలు తెలుగు సాహిత్య వనంలో విరబూసిన రత్నాల హారాలు. ఆయన చెప్పిన ప్రతి విషయం ఒక సత్య నిఘంటువే. పండిత లోకానికి పరిమితమైన వేదాంతాన్ని అతి సామాన్య మానవునికి కూడా అందుబాటులో ఉండేట్లు స్వచ్ఛమైన అచ్చమైన తేనె లాంటి తేట తెలుగు పద్యాలలో వివరించిన మహానుభావుడు వేమన.
”వేయి విధము లమర వేమన పద్యంబు/ లర్ధ మిచ్చు వాని నరసి చూడ/ చూడ జూడ గలుగు చోద్యమౌ జ్ఞానంబు/ విశ్వదాభిరామ వినురవేమ”.
పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి వేమన. అంధ విశ్వాసాలను తూర్పార పెట్టిన విశ్వమానవుడు వేమన.
– పి.బీ.చారి, 9704934614