– 36-32తో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపు
– ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11
పుణె, 14 డిసెంబర్ 2024 : తెలుగు టైటాన్స్ వరుస పరాజయాల నుంచి పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11లో 11వ విజయం నమోదు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. శనివారం పుణెలోని బలెవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో 36-32తో గుజరాత్ జెయింట్స్‌పై తెలుగు టైటాన్స్ మెరుపు విజయం సాధించింది. తెలుగు టైటాన్స్ స్టార్ రెయిడర్ పవన్ సెహ్రావత్ (12 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో అదరగొట్టగా.. విజరు మాలిక్ (8 పాయింట్లు), ఆశీష్ నర్వాల్(6) ఆకట్టుకున్నారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ (10 పాయింట్లు), గుమన్ సింగ్ (9) రాణించారు. పీకెఎల్ 11లో 20 మ్యాచుల్లో తెలుగు టైటాన్స్‌కు ఇది 11వ విజయం. లీగ్ దశలో చివరి రెండు మ్యాచుల్లోనూ మెరిస్తే తెలుగు టైటాన్స్‌కు తిరుగుండదు.