– పూజారులతో మేడారంలో అత్యవసర సమావేశం
నవతెలంగాణ – తాడ్వాయి
తెలంగాణ కుంభమేళాను తలపించే మేడారం మహా జాతరపై ఆధునికత, సౌకర్యాల మాటున నవీన పోకడలు, స్వచ్ఛతను కోల్పోతున్న మేడారం, ఆదివాసీ సంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి అనే వదంతులు, సోషల్ మీడియాలో ప్రచారం జరగడం, అది వాస్తవం కాదని, మేడారంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే సమ్మక్క సారలమ్మ ఆలయాల నిర్మాణం ఉంటుందని పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు అన్నారు. ఆదివారం మేడారంలో పూజారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతర ఆదివాసి సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహిస్తామని తెలిపారు. అభివృద్ధి పేరుతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నది అది వాస్తవం కాదని, మేము దాన్ని తీవ్రంగా ఖండించామని తెలిపారు. మేడారంలో సమ్మక్క, కన్నెపెళ్లిలో సారలమ్మ ఆలయాలు చాలా సంవత్సరాల క్రితం నిర్మించినవి కాబట్టి వాటిని పూజా నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలకు వెడల్పైన గేట్లు, దర్వాజకు టేకు కర్రతో నిర్మాణాలు, ఆలయంలో దీప ధూప నైవేద్యం, చేసేటప్పుడు పోగ బయటికి వెళ్లే విధంగా పెద్ద పెద్ద వెంటిలేటర్లు, ఆలయం బయట గోడల పైన ఆదివాసి సాంప్రదాయాల్లో ఉట్టిపడే విధంగా కొమ్ము, డోలి, పడగలు, సంతానం పొందే చిత్రాలను వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదివాసి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా నిర్మించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పూజారులు చందా గోపాల్, చందర్ రఘుపతి, కొక్కెర రమేష్, పెనక రాజేశ్వర్, కొక్కెర కృష్ణయ్య, కాక వెంకటేశ్వర్లు, సిద్ధ బోయిన మునిందర్, సిద్ధ బోయిన వంశీ, సిద్ధబోయిన బోజారావు, సిద్దబోయిన నితిన్, రానా రమేష్, కళ్యాణ్, సమ్మక్క- సారమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు తదితరులు పాల్గొన్నారు.