శ్రీ సీతారాముల కల్యాణానికి ముస్తాబైన ఆలయాలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా శ్రీ సీతారాముల కల్యాణానికి రామాలయాలు అన్నీ ముస్తాబయ్యాయి. మంగళవారం మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో గత నాలుగు రోజులుగా శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఏర్పాటు చేస్తున్న తాటాకు చలువ పందిళ్ళు టెంట్లు పూర్తి అయినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మరాజు సత్యనారాయణ తెలిపారు. చల్వాయి దుంపెల్లి గూడెం పసర గాంధీ నగర్ లతో పాటు ప్రతి గ్రామం ప్రతి తండాలోనూ శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఆయా గ్రామాల ప్రజలు తండావాసులు ఘనంగా జరుపుకుంటారు. కొన్నిచోట్ల వేద పండితులు పేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం జరుగుతుండగా మరికొన్ని చోట్ల పండితులు లేకపోవడం వల్ల భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణం కామెంట్రీ ద్వారా కల్యాణ క్రతువులు పూర్తి చేస్తారు. కళ్యాణానికి అవసరమైన సామాగ్రిని ఇప్పటికే దాతలు పెద్ద ఎత్తున సమకూర్చారు వారి పేర్లతో సహా ఆలయ కమిటీ వారు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కళ్యాణ క్రమంలో అన్నదాన కార్యక్రమాలను కూడా చేస్తున్నట్లు ఆయా ఆలయాల కమిటీలు తెలిపారు.