మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా…

Mid-day meal workers' strike Temporary adjournment...– యూనియన్‌ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం
– కార్మిక వ్యతిరేక బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి : పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మధ్యాహ్న భోజన కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ అధ్యక్షతన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తిస్తామని చెప్పే ప్రధాని మోడీ దేశంలో మధ్యాహ్న భోజన కార్మికులను మాత్రం కార్మికులుగా గుర్తించడం లేదని విమర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కారు జీవోలను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చట్టాలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్వులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగితేనే న్యాయం జరుగుతుందని సూచించారు. కార్మికులుగా గుర్తించాలనీ, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనీ, హెల్త్‌ కార్డులివ్వాలనీ, రిటైర్డ్‌ మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలనీ, పెన్షన్‌ కల్పించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్న దాంట్లో న్యాయముందని తెలిపారు. తెలంగాణ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం వండే షెడ్లలో ఇప్పటికీ వెట్టిచాకిరీ, బానిసత్వం అమల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను మ్యానిఫెస్టోల్లో చేర్చాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం గడువు ముగిసేనాటికి కూడా మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకోని బీఆర్‌ఎస్‌ పార్టీకి బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు.
సీఐటీయూ కార్యదర్శి జె.వెంకటేష్‌ మాట్లాడుతూ సీఎం అల్పాహార పథకం మంచిదేననీ, దాన్ని సిద్ధం చేసే కార్మికులకు అదనపు పనికి అదనపు వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
ఇక సీఎం కేసీఆర్‌ ఇచ్చే హామీలను నమ్మేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి రావడం, రాకపోవడమనేది మధ్యాహ్న భోజన కార్మికులపైనే ఆధారపడి ఉంటుందనీ, ఓటు సత్తా చూపించాలని సూచించారు. కేసీఆర్‌ తలరాతను రాయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ కు రాజకీయ సమాధి కట్టాలని కోరారు.
ఎస్‌.రమ మాట్లాడుతూ మాట తప్పిన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచారని విమర్శించారు. దళిత సీఎం, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, కాంట్రాక్ట్‌ వ్యవస్థ రద్దు తదితర అనేక హామీలను అమలు చేయకుండా విస్మరించారని తెలిపారు. మధ్యాహ్న భోజనంలోకి వాడే సరుకుల ధరలకు, ప్రభుత్వం ఇస్తున్న దానికి పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు ఎదురు పెట్టుబడి పెట్టే ఏకైక రంగం మధ్యాహ్న భోజనం పథకం అని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామని తెలిపారు.
యూనియన్‌ ఏర్పడిన తర్వాత చేసిన పోరాటాల ఫలితంగా వేతనం నిర్ణయించారని చెప్పారు. ఆ వేతన పెంపు కోసం దశల వారీగా చేసిన పోరాటాల ఫలితంగా సీఎం ప్రకటన వచ్చినా ఇంకా అమలు చేయలేదని తెలిపారు. అన్ని రకాల ఆటంకాలను ఎదుర్కొని మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె చేశారని కొనియాడారు. రాబోయే కాలంలో సమరశీల పోరాటాలుంటాయని చెప్పారు. కేసీఆర్‌ తొమ్మిదేండ్ల పాలన చూశామనీ, ఇక బీఆర్‌ఎస్‌పై రాజకీయంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు ఎం.సులోచన, రాజేశ్వరి, సుల్తాన్‌, స్వప్న, సరస్వతి, మాయా, బాల లక్ష్మి, రాష్ట్ర నాయకులు రమ్య, యాకలక్ష్మి, గీతా, కృ ష్ణమాచారి, గోవర్థన్‌, బాలరామ్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.