– ప్రక్రియ పూర్తికానందునే జీవో 85 జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మరో 10 రోజులు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు శనివారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో నెంబరు 85ను విడుదల చేశారు. వాస్తవానికి ఈనెల ఐదు నుంచి శనివారం వరకు బదిలీలు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా సర్కారీ శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి కాని నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవోలో పేర్కొన్నారు.
గందరగోళం..కౌన్సెలింగ్ వాయిదా
ప్రజారోగ్య శాఖలో బదిలీల వ్యవహారం రసాభాసాగా మారింది. సీనియారిటీ జాబితాలు ప్రజారోగ్య (పబ్లిక్ హెల్త్) విభాగం తప్పులతడకగా రూపొందించడంతో బదిలీల అంశం గందరగోళంగా మారి చివరికి వాయిదాపడింది. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్యకళాశాలకు కౌన్సెలింగ్ కోసం తరలివచ్చిన వేలాదిమంది హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు రాత్రి వరకు పడిగాపులు పడ్డారు. చివరికి కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం చేస్తూ స్టాఫ్‌నర్సులు, హెడ్‌నర్సులు పెద్దసంఖ్యలో ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. వ్యవసాయశాఖలో బదిలీలను నిలిపేశారు. నాలుగు కేటగీరిల్లో అధికారులను బదిలీలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ పథకం అమలయ్యేంత వరకు వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, జిల్లా వ్యవసా యాధికారుల బదిలీలను నిలిపివేస్తున్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావు ప్రకటించిన విషయం విదితమే. దీంతో దాదాపు 3400 మంది అధికారులు, సిబ్బందికి రుణమాఫీ పూర్తయిన తర్వాత బదిలీలు చేస్తారు.
అటవీ శాఖలో అక్రమంగా డిప్యూటేషన్లు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో ఏడాది కాలానికిగాను పని చేసేందుకు నలుగురు అధికారులను తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అటవీశాఖ ఉన్నతాధికారులు కుమ్మక్కై డిప్యూటేషన్లు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. నీరుపారుదల శాఖలో నలుగురు అధికారులకు అక్రమంగా పోస్టింగ్ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ శాఖలో తాత్కాలికంగా బదిలీలను నిలిపేశారు. ప్రణాళిక శాఖలోనూ సీనియార్టీ జాబితాల రూపకల్పనలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కౌన్సెలింగ్ పూర్తయినా శనివారం ఉత్తర్వులు జారీచేయలేదు. రెవెన్యూ శాఖలో బదిలీలు జరిగాయి.