– డీఈఓ శ్రీనివాసరెడ్డి
– జిల్లాలో పరీక్షలు రాయనున్న 13,987 మంది విద్యార్థులు
– ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ కు వేర్వేరుగా పరీక్షలు
– ఒక్క నిమిషం నిబంధన
నవతెలంగాణ – సిద్దిపేట
ఈనెల 18 నుండి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో 80 సెంటర్లలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పది పబ్లిక్ పరీక్షలు ఉదయం 09.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 371 పాఠశాలల నుండి 13987 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్ల తెలిపారు. బాలురు- 7036, బాలికలు-6951 పరీక్షలు రాయనున్నారని, ఒకసారి ఫెయిల్ అయిన వారిలో బాలురు- 3, బాలికలు-3 కూడా పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1, 2న జరిగే ఒకేషనల్ పరీక్షలకు 18 సెంటర్లలో బాలురు- 790, బాలికలు-871, మొత్తం-1661 పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉందని, విద్యార్థులు 9 గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో ఇచ్చే ఓఎంఆర్ షీటును ఒకసారి సరిచూసుకోవాలని తెలిపారు. 80 పరీక్ష కేంద్రాల్లో 58 ప్రభుత్వ, 22 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, ప్రభుత్వ ఉపాధ్యాయులనే ఇన్విజిలేటర్ గా ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు సెంటర్లలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచినీరు, ఫ్యాన్ , ఫర్నిచర్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్షలు రాయవచ్చని తెలిపారు. గతంలో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఒకే రోజు పరీక్షలు జరిగేవని, ఈసారి మాత్రం ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు వేరువేరు రోజులలో జరుగుతాయని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ల, డిపార్ట్‌మెంటల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతిరోజు 9 గంటల 15 నిమిషాలకు సీసీ కెమెరాల ముందే పరీక్ష పేపర్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఏ ఒక్కరికి కూడా పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతులు లేవని, విద్యార్థులు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం స్టోరేజ్ పాయింట్ల సంఖ్య 23, 7 గురు కస్టోడియన్, 7గురు రూట్ ఆఫీసర్లు, 80 మంది చీఫ్ సూపరింటెండెంట్ల, 80 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 46 మంది స్టోరేజ్ పాయింట్ సంరక్షకులు, 789 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈఓ యాదవ రెడ్డి, ఏ సి జి ఈ లక్ష్మయ్య పాల్గొన్నారు.