– బీఆర్‌ఎస్ సర్కారుపై మంత్రి ప్రియాంక్‌ఖర్గే ఆరోపణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో పది పథకాలు ప్రవేశ పెట్టి రూ. పదివేల కోట్లు దోచుకున్నారని కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్‌ఖర్గే ఆరోపించారు. కర్నాటక ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో ఐదు గ్యారంటీలు అమలు కాలేదనడానికి బీఆర్‌ఎస్ నేతలేమైనా లబ్దిదారులా? అని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎమ్మెల్యే శరత్, జాతీయఅధికార ప్రతినిధి షామా, సీనియర్ నేత వీ. హనుమంతరావులతో ప్రియాంక్‌ఖర్గే విలేకర్లతో మాట్లాడారు. నాలుగు ఐదు రోజుల నుంచి హైదరాబాదులో తిరుగుతున్నామన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పరిపాలనలో అనేక సమస్యలున్నాయన్నారు. బీఆర్‌ఎస్ నేతలు కర్ణాటక ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ను బదనాం చేస్తున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రంలో చేయలేక కర్నాటకపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పేదలకు కర్నాటకలో హామీలు అమలు అవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను చూసి బీఆర్‌ఎస్ భయపడుతున్నదని చెప్పారు. 2013లో మ్యానిఫెస్టోలో 165 అంశాలుంటే, 158 హామీలను అమలు పరిచినట్టు తెలిపారు.బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో చూడాలని సూచించారు. కర్నాటకలో ఐదు గ్యారంటీలను ఆరు నెలల్లోనే అమలు చేశామన్నారు. ఆ విషయం బీఆర్‌ఎస్ నేతలకు ఏం తెలుసన్నారు. వాళ్లు లబ్ధి దారులు కాదు కదా? అని ప్రశ్నించారు. ఐదు గ్యారంటీల కోసం ఎన్‌రోల్ చేసుకుంటే అర్హత బట్టి అందిస్తామన్నారు. గహలక్ష్మి పథకాన్ని 1.60 కోట్ల మంది అందించామన్నారు. అన్న భాగ్య పథకాన్ని 3.92 కోట్ల మందికి ఇవ్వడం జరిగిందన్నారు. మోడీ, కేసీఆర్ ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలా మెలుగుతున్నారని విమర్శించారు. కర్నాటకలో ప్రతిరోజు 60 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. వాళ్లంతా ప్రభుత్వం బాగుండాలని దేవాలయాల్లో పూజలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 3600 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఇక్కడ ఉద్యోగాలు లేక బెంగళూరుకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌కు గుర్తు చేశారు. కర్నాటక ప్రజలు స్కీములతో రూ. 80 వేల నుంచి లక్ష వరకు సేవింగ్స్ చేసుకుంటున్నారని చెప్పారు. కానీ బీఆర్‌ఎస్ ప్రజాధనం ఫామ్‌హౌస్‌లో నింపుతున్నదన్నారు. కర్నాటకలో అన్ని స్కీమ్‌లు అద్భుతంగా అమలు అవుతున్నాయని చెప్పారు. పథకాలు అమలు కావడం లేదనే అనుమానం బీఆర్‌ఎస్ నాయకులకు ఉంటే గాంధీభవన్ నుంచి బస్సు పెడతాను తిరిగి పరిశీలించవచ్చనన్నారు. బీఆర్‌ఎస్ అంటే భ్రష్టు రాష్ట్రీయ సమితి అని ఎద్దేవా చేశారు.