ఎంపీల్లో టెన్షన్‌..అసంతృప్తుల్లో జోష్‌

ఎంపీల్లో టెన్షన్‌..అసంతృప్తుల్లో జోష్‌– సిట్టింగ్‌లకు కన్ఫర్మ్‌ లేదంటున్న కిషన్‌రెడ్డి
–  బీజేపీ అభ్యర్థుల మార్పు చర్చ మరోమారు
–  ఆదిలాబాద్‌, కరీంనగర్‌ అభ్యర్థిత్వాలపైనే ఉత్కంఠ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రాష్ట్రంలోని బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలకు సీట్లు కన్ఫర్మ్‌ అని ఎవరు చెప్పారు? రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో అమిత్‌షా సిట్టింగ్‌లకు హామీనిచ్చారని ఎవరన్నారు? దాని గురించి నిమిషం కూడా చర్చ జరగలేదు. ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉంది. రాష్ట్రంలో 50 శాతం సీట్లకు అభ్యర్థులు ఖరారై పోయారు’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక పుట్టిస్తు న్నాయి. సిట్టింగ్‌ స్థానాల్లో ఇద్దరు అభ్యర్థులను మారుస్తారనే చర్చ మళ్లీ మొదలైంది. ఎవర్ని మారుస్తారనే చర్చ ఆ పార్టీలో హాట్‌టాఫిక్‌గా మారింది. దీనిపై తాజా ఎంపీలు బండి సంజరు, సోయం బాపూరావు అనుచరులు గరంగరమవు తున్నారు. జాతీయ నాయకత్వమేమో అభ్యర్థుల బలాబలాలు, సామాజిక నేపథ్యం, సర్వే రిపోర్టుల ఆధారంగా ప్రకటిస్తామని చెబుతుండగా కిషన్‌రెడ్డి మాత్రం ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారని ప్రకటించడంపై టికెట్‌ ఆశిస్తున్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయం లో అభ్యర్థిత్వ మార్పు తమ నియోజకవర్గంలోనే అంటూ ఆదిలాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గాల్లోని ఎంపీల వ్యతిరేక గ్రూపు నేతలు ఖుషీ అవుతున్నారు. తాజా పరిణామాలను చూస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిరిగానే ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు లోలోన రగులుతున్నట్టే కనిపిస్తున్నది. సికింద్రాబాద్‌ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అర్వింద్‌ మరోసారి బరిలోకి దిగటం పక్కాగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గాల్లో వారిద్దరికీ ఇతర నేతల నుంచి పోటీ కూడా లేదు. కొన్ని రోజులుగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల నుంచి టికెట్లు ఇవ్వబోరనే చర్చ ఇప్పటికే జోరుగా నడుస్తున్నది. ఆదిలాబాద్‌ ఎంపీగా సోయం బాపూరావు ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరి అనూహ్యంగా ఆదిలాబాద్‌లో విజయం సాధించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన సొంతగూటి నుంచే తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యే బాపూరావు(ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు) రేసులోకి వచ్చారు. వారిద్దరూ బలమైన అభ్యర్థులే. ఆదిలాబాద్‌ పార్లమెంటరీ స్థానం పరిధిలో తాజీ ఎంపీకి వ్యతిరేకంగా బీజేపీ కీలక నేతలు ఒక్కటవుతుండటం ఆయనకు మైనస్‌గా మారుతున్నది. మొత్తంగా అక్కడ ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్‌ నుంచి బండి సంజరుని వేరే నియోజకవర్గానికి పంపి ఆ స్థానం నుంచి రెడ్డి లేదా ముదిరాజ్‌ సామాజిక తరగతులకు చెందిన వారికి టికెట్‌ ఇస్తే బాగుంటుందని నియోజకవర్గంలోని బీజేపీ ముఖ్యనేతలు పట్టుబడుతున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో అక్కడ నుంచి బండి గెలవడనీ, అభ్యర్థిని మార్చాలని ఆ పార్టీలోని బండి వ్యతిరేక వర్గం పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. బండికి టికెట్‌ ఇస్తే సహకరించేదే లేదంటూ ఆ ఎంపీ స్థానం పరిధిలోని గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, లింగయ్య లాంటి బీజేపీ సీనియర్‌ నేతలు బాహాటంగానే చెబుతున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో రెండు చోట్ల ఈటల రాజేందర్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన తనకు కరీంనగర్‌ లేదంటే మల్కాజిగిరి స్థానం కేటాయించాలని అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బండిని జహీరాబాద్‌కు మార్చి ఈటలను అక్కడ నుంచి పోటీచేయిస్తారనే చర్చ నడుస్తున్నది. దీనికి కరీంనగర్‌ తాజా ఎంపీ బండి సంజరు సుముఖంగా లేరని తెలుస్తోంది. అక్కడ ఈటలకు సీటివ్వకపోతే మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. మహబూబ్‌నగర్‌ స్థానం తమకంటే తమకే అని డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి. మల్కాజిగిరి సీటుపై డజన్‌కుపైగా ముఖ్యనేతలు కన్నేశారు. అక్కడ అభ్యర్థిని ప్రకటించడం కూడా ఆపార్టీకి కత్తిమీద సామే అన్నట్టుగా పరిస్థితి తయారైంది.