– మృతికి హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్ కారణమని ఆందోళనలు
– సూసైడ్ లెటర్‌పై అనుమానాలున్నాయి : బంధువులు
– మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : ప్రజాసంఘాలు, విద్యార్థి నాయకుల నిరసన
నవతెలంగాణ-భువనగిరి
భువనగిరి పట్టణంలో ఇద్దరు నిరుపేద విద్యార్థునుల ఆత్మహత్య యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం కలిగించింది. శనివారం రాత్రి జరిగిన కోడి భవ్య (15), గాదే వైష్ణవి(15) ఆత్మహత్యకు నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా కనబడుతుంది. బాలికల హాస్టల్ వద్ద హాస్టల్ వార్డెన్ ఉండకపోవడం, అధికారుల వైఫల్యంతో బాలికలకు రక్షణ కల్పించకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. హాస్టల్లో ఉన్న వంట మనిషిపై, రోజూ పాఠశాలకు తీసుకుపోయే ఆటో డ్రైవర్ ఆంజనేయులుపై, వార్డెన్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, విద్యార్థుల మధ్య కొనసాగిన వివాదం.. కౌన్సెలింగ్ పేరిట పీఈటీ, వార్డెన్లు సరైన విధంగా స్పందించలేదని ఆరోపణలున్నాయి. పీఈటీ సమాచారం మేరకు.. వార్డెన్ విద్యార్థులను తన ఇంటికి తీసుకుపోయి వారి ప్రవర్తనలో మార్పులపై కౌన్సెలింగ్ చేసినట్టు వార్డెన్ శైలజ పేర్కొనడం గమనార్హం. కాగా, వసతిగృహంలో విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకొని ఉంటారని డీఈవో తెలిపారు. మృతిచెందిన బాలికలు తమను దూషించి.. చేయి చేసుకున్నారంటూ నలుగురు విద్యార్థినులు పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆ ఇద్దరికీ శనివారం ఉదయం కౌన్సెలింగ్ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించి ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది.
వారి మాటలు తట్టుకోలేకపోయామంటూ సూసైడ్ నోట్..
సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖ ప్రకారం.. తాము తప్పుచేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తట్టుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.
తమను శైలజ మేడమ్ తప్ప ఎవరూ నమ్మలేదని, మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామని లేఖలో రాశారు. కాగా, ఈ సూసైడ్ నోట్‌పై మృతుల తల్లిదండ్రులు, ఐద్వా నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్ మేడమ్ గురించి లేఖలో ఉంది తప్పితే, వారి తల్లిదండ్రుల గురించి లేదని, విద్యార్థులు రాసారని చెప్తున్న లెటర్‌ను నిపుణులతో పరిశీలించి నిజాలు బయటికి తీయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బట్టు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సూసైడ్ లెటర్‌పై అనుమానాలు ఉన్నాయని, ఉరేసుకుంటే పోలీసులకు ఎందుకు చెప్పలేదని మృతుల కుటుంబ సభ్యులు, వైష్ణవి మేనత్త సంధ్య హాస్టల్ అధికారులను ప్రశ్నించారు.
హాస్టల్, ఏరియా ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళన
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు మద్దతుగా హాస్టల్, ఏరియా ఆస్పత్రి ప్రధాన గేట్ల ఎదుట ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో ఆందోళన చేపట్టారు. వందలాదిమంది రాస్తారోకోలో పాల్గొన్నారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ శనివారం రాత్రి సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తెల్లవారుజామున వారు హాస్టల్‌లో జరిగిన సంఘటనపై విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవని, కనీస పర్యవేక్షణ లేదని ఆరోపించారు. మృతికి కారణాలను పూర్తిస్థాయిలో విచారణ జరిపి బయట పెట్టి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులు, వైష్ణవి మేనత్త సంధ్య మాట్లాడుతూ.. బాలికలను హాస్టల్ నుంచి స్కూల్‌కి తీసుకెళ్లే ఆటో డ్రైవర్ ఆంజనేయులు ప్రవర్తన సరిగాలేదని పలుసార్లు హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లామని, అయినా వార్డెన్ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కుంభం ఆర్థిక సహాయం
భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఘటనపై కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కోరిన విధంగా వరంగల్ జిల్లాలో లేక భువనగిరిలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేదా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందిస్తామని తెలిపారు.