– ఎడవల్లిలో ఆ మూడు పార్టీల లీడర్ల వాగ్వావాదం
– బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్, బీజేపీ నేతల ఘర్షణ
– పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో లాఠీచార్జి
నవతెలంగాణ-ఎడపల్లి/బోధన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకీల్కు ఎదురు దెబ్బ తగిలింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అంబం(వై), ఏఆర్పి క్యాంప్, బ్రాహ్మణపల్లి, జైతాపూర్ గ్రామాల్లో ఆయన బుధ వారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చారని పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యేను నిల దీసేందుకు వెళ్తుండగా.. స్థానిక బీఆర్ఎస్ నాయ కులు వారిని అడ్డుకున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ నాయకులు సైతం ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకునేం దుకు ప్రయత్నించారు. తమ గ్రామాల్లో రెండు పడక గదులు లేక అనేకమంది పేదలు అద్దె ఇండ్లల్లో నివాసం ఉంటున్నారని మండిపడ్డారు. జైతాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. దాంతో మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద జైతాపూర్, ఏఆర్పీక్యాంపు, వడ్డెపల్లి గ్రామాల కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై ఘర్షణకు దిగారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వినకపోవడంతో స్వల్ప లాఠీచార్జి చేపట్టారు.
దాడులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలి : ఎమ్మెల్యే షకీల్
ఎడపల్లి మండలంలో ఏఆర్పీ క్యాంప్, జైతాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనపై దాడిచేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్, బీజేపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాడి వివరాలు వెల్లడించారు. దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఘర్షణ పడకుండా సామరస్యంగా వెళ్లిపోయిన కూడా తిరిగి సాటాపూర్ గేట్ వద్ద ఏకంగా బీఆర్ఎస్ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కొందరు దాడులు చేయడంతో పార్టీ కార్యకర్త మోసిన్ తలకు తీవ్రగాయాల య్యాయన్నారు. పోలీసులు చర్యలు తీసుకోని యెడల కార్యకర్తలతో కలిసి నిరసన చేపడతామని తెలిపారు. అలాగే పూలదండలలో రాళ్లుపెట్టి విసరడంతో తాను ప్రమాదాన్ని గ్రహించి తృటిలో తప్పించుకున్నానని తెలిపారు. ఈ ఘటన దావానంలా వ్యాపించడంతో ప్రచారంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు.