ఎంపీ ఇంటి ముట్టడిలో ఉద్రిక్తత

– పోలీసులు, నాయకుల మధ్య తోపులాట
– నీట్‌ రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్‌-2024లో అవకతవకలు జరిగాయని, దీనిపై పార్లమెంట్‌లో ఎంపీలు మాట్లాడకపోవడం సిగ్గు చేటని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఎంపీల తీరును నిరసిస్తూ బుధవారం పట్టణంలో ఉన్న ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ నివాసాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. పోలీసులు నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎంపీ ఇంటి ముందు బైటాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు నాయకులను బలవంతంగా అక్కడి నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అరెస్టు చేసి విద్యార్థి సంఘాల నాయకులను వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శాంతన్‌రావ్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నీట్‌ను సవ్యంగా నిర్వహించలేదన్నారు. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు కొనసాగుతున్నా పార్లమెంట్‌లో ఏ ఒక్క ఎంపీ మాట్లాడడం లేదన్నారు. నీట్‌ ప్రారంభమైన నుంచి వంద శాతం మార్కులు వచ్చిన చరిత్ర ఎవరికి లేదన్నారు. తప్పిదాలను కప్పిపుచ్చేందుకు జూన్‌ 14న రావాల్సిన ఫలితాలను, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేసి విద్యార్థులను పక్కదారి పట్టించారన్నారు. నీట్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించడంతో పాటు ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే వైద్య వృత్తి విద్యార్థులు ఇంతటి అన్యాయానికి గురైతే మున్ముందు దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌.వెంకటేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.దిగంబర్‌, మాస్‌లైన్‌ పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు వి.మహేందర్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శాంతన్‌రావు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎర్రాజి హరీష్‌, సహాయ కార్యదర్శి దత్తు, పీవైఎల్‌ జిల్లా నాయకులు మెస్రం మారుతి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కపిల్‌, అవినాష్‌ పాల్గొన్నారు.