సాగర్‌ డ్యాంపై ఉద్రిక్తత

సాగర్‌ డ్యాంపై ఉద్రిక్తత– ప్రాజెక్టు భద్రతా బలగాలు, ఆంధ్ర పోలీసుల మధ్య ఘర్షణ
–  డ్యాంపై కంచె ఏర్పాటు
–  అదే సమయంలో కుడి కాలువకు నీటి విడుదల
–  తెలంగాణ ప్రభుత్వానికి అధికారుల లేఖ
నవతెలంగాణ-పెద్దవూర
తెలంగాణ రాష్ట్రంలో తెల్లవారితే అసెంబ్లీ ఎన్నికలు.. అధికారులు ఆ ఏర్పాట్లలో నిమగమై ఉండగా.. బుధవారం అర్ధరాత్రి నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం తెల్లవారు జామున 2గంటల సమయంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రధాన డ్యామ్‌పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్స్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఇరు రాష్ట్రాల డీఎస్పీల మధ్య జరిగిన వాగ్వాదం తిరిగి సీన్‌ రిపీటైంది. అయితే, గొడవ జరుగుతున్న క్రమంలోనే కుడి కాలువకు నీటిని దిగువకు విడుదల చేయడం గమనార్హం.
గురువారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో నాగార్జున సాగర్‌ డ్యామ్‌పై ఆంధ్ర పోలీసులు రైట్‌ బ్యాంక్‌ ప్రధాన గేటు నుంచి చొచ్చుకొచ్చారు. వారిని అడ్డుకున్న ఎస్పీఎఫ్‌ కానిస్టేబుళ్లను గాయపరిచి 13వ గేటు మా ఆధీనంలో ఉంటుందని దాదాపు ఏఎస్‌పీ 700 మంది పోలీస్‌ జవాన్లు 13వ గేటు వరకు దూసుకొచ్చారు. 13వ గేట్‌ వరకు చేరుకున్న ఆంధ్ర పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.
ఇరువురు మధ్య ఘర్షణ
డ్యాం భద్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సెల్‌ఫోన్లను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ధ్వంసం చేశారని వార్తలు వచ్చాయి. దీనితో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. డ్యామ్‌ పైకి ప్రాజెక్టు అధికారులు తప్ప ఇతరులు ఎవరికీ అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం ఇరు రాష్ట్రాల పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు.
2015లో జల వివాదం
2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్‌లో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాగా, రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో డ్యామ్‌ దగ్గర ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఏపీ అధికారులు కుడిగట్టు క్రస్ట్‌ గేట్ల స్విచ్‌ రూమ్‌ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పోలీసులు పరసర్పం దాడులు చేసుకున్నారు. అప్పుడు సద్దిమణిగినా.. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దు భద్రత దళాల మధ్య గొడవలు, లైట్లు, కెమెరాలు ధ్వంసం చేయడంపై రాజకీయ కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఈసారి ఓటమి దిశగా ఉన్నట్టు పలు సర్వేలు తేల్చాయి. ఈ క్రమంలో సాగర్‌ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడం చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డ్యామ్‌పై కంచె ఏర్పాటు
నాగార్జున సాగర్‌ డ్యామ్‌పై ఎవరినీ అనుమతించకుండా కంచె ఏర్పాటు చేశారు. తెలంగాణ ఐడి కార్డు ఉంటే అనుమతించడం లేదు కానీ ఆంధ్ర ఐడి కార్డు ఉంటే డ్యాం పైకి అనుమతిస్తున్నారు. అక్కడి పరిస్థితులను తెలుసుకోవడానికి విలేకరులను సైతం అనుమతించడం లేదు. ఇరు రాష్ట్రాల పోలీసుల గొడవ జరుగుతుండగానే.. నాగార్జున సాగర్‌ కుడి కాలువకు గురువారం ఒంగోలు చీఫ్‌ ఇంజినీర్‌ ఆధ్వర్యంలో 2000వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే, తెలంగాణ పోలీసులు కరెంట్‌ కట్‌ చేయడంతో.. వాళ్లు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కరెంట్‌ కనెక్షన్‌ తీసుకుని నీటి విడుదల చేసుకుంటున్నారు.
మరోసారి హైటెన్షన్‌
నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యామ్‌ వద్దకు తెలంగాణ పోలీసులు పెద్దఎత్తున చేరుకున్నారు. సాయంత్రం వరకు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు భద్రత దృష్టా రాత్రికి డ్యామ్‌ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే డ్యామ్‌పై కంచె వేసి పెద్ద ఎత్తున అక్కడ ఏపీ పోలీసులు పహారా కాస్తున్నారు. డ్యామ్‌ వద్ద అటు ఏపీ పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అయితే, ఏపీ పోలీసుల తీరుపై నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.